BYD : చైనా ఎలక్ట్రిక్ కారుపై ఏకంగా రూ.5.2 లక్షల డిస్కౌంట్.. జూలై నుంచి పెరగనున్న ధరలు

జూలై నుంచి పెరగనున్న ధరలు

Update: 2026-05-15 12:07 GMT

BYD : ప్రపంచ ప్రఖ్యాత చైనా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బీవైడీ భారతీయ కస్టమర్ల కోసం కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది. మే నెలకు సంబంధించి తన ఎలక్ట్రిక్ కార్లపై భారీ తగ్గింపులను ఇస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. అయితే ఈ ఆనందం ఎంతో కాలం ఉండదు. ఎందుకంటే జూలై 1, 2026 నుంచి తన కార్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ఇప్పటికే బాంబు పేల్చింది. ఈ నేపథ్యంలో ధరలు పెరగకముందే కారును సొంతం చేసుకోవాలని చూస్తున్న వారికి బీవైడీ ఇస్తున్న డిస్కౌంట్లు ఒక అద్భుతమైన అవకాశమని చెప్పవచ్చు.

ఏ కారుపై ఎంత తగ్గింపు?

బీవైడీ తన మార్వెలస్ మే క్యాంపెయిన్‌లో భాగంగా అత్యధికంగా బీవైడీ eMax 7 ఎలక్ట్రిక్ ఎంపీవీపై రూ.5.2 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ భారీ ఆఫర్ ముఖ్యంగా eMax 7లోని 6-సీటర్, 7-సీటర్ బేస్ వేరియంట్లపై మాత్రమే లభిస్తుంది. అంతేకాకుండా పాత కారును మార్చుకునే వారికి భారీ ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా కంపెనీ ఇస్తోంది. పరిమిత స్టాక్ ఉన్నందున ముందుగా వచ్చిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది.

వారంటీ, మెయింటెనెన్స్‌లో బంపర్ ఆఫర్లు

డబ్బు రూపంలో ఇచ్చే డిస్కౌంట్లతో పాటు, కస్టమర్లకు దీర్ఘకాలిక ప్రయోజనాలను కూడా బీవైడీ అందిస్తోంది. eMax 7 కారుపై ఏకంగా 3 లక్షల కిలోమీటర్ల వరకు పొడిగించిన వారంటీ, ఏడేళ్ల పాటు ఉచిత మెయింటెనెన్స్ ప్యాకేజీని ఇస్తోంది. దీనివల్ల కారు కొన్న తర్వాత రిపేర్లు లేదా సర్వీసింగ్ ఖర్చుల గురించి కస్టమర్లు ఏడేళ్ల పాటు నిశ్చింతగా ఉండవచ్చు. ఇది మధ్యతరగతి, కుటుంబ అవసరాల కోసం కారు కొనే వారికి పెద్ద ఊరటనిచ్చే అంశం.

ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీపై కూడా రాయితీలు

బీవైడీ కంపెనీకి చెందిన పాపులర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ Atto 3 కొనుగోలుపై కూడా మే నెలలో ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. ఈ కారుపై రెండేళ్ల పాటు ఉచిత మెయింటెనెన్స్ ప్యాకేజీని అందిస్తున్నారు. అంటే సర్వీసింగ్ ఖర్చులు రెండేళ్ల పాటు ఉండవు. అయితే కంపెనీకి చెందిన ప్రీమియం మోడళ్లయిన బీవైడీ సీల్, సీలయన్ 7 కార్లపై మాత్రం ఎలాంటి నేరుగా డిస్కౌంట్లు ప్రకటించలేదు. వాటిని ప్రస్తుతమున్న సాధారణ ధరలకే విక్రయిస్తున్నారు.

జూలై 1 నుంచి ధరల బాదుడు

బీవైడీ ఇప్పుడు ఆఫర్లు ఇస్తున్నప్పటికీ, జూలై 1 నుంచి తన మొత్తం పోర్ట్‌ఫోలియోపై ధరలను 1 నుంచి 2 శాతం వరకు పెంచనుంది. విదేశీ మారకద్రవ్య రేట్లలో వస్తున్న మార్పుల వల్ల ఈ ఏడాదిలో ఇది మూడోసారి ధరల పెరుగుదల కావడం గమనార్హం. జూలై నుంచి సీల్, సీలయన్ 7, అట్టో 3, ఈమ్యాక్స్ 7 కార్ల ధరలు గణనీయంగా పెరగనున్నాయి. అందుకే ఈ రెండు నెలల్లోనే కారు కొంటే లక్షల రూపాయలు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News