BYD Leopard 8 : పెట్రోల్ తిప్పలు లేవు.. ఛార్జింగ్ టెన్షన్ లేదు.. వచ్చేస్తోంది అల్టిమేట్ హైబ్రిడ్ ఎస్‌యూవీ

వచ్చేస్తోంది అల్టిమేట్ హైబ్రిడ్ ఎస్‌యూవీ

Update: 2026-04-29 12:25 GMT

BYD Leopard 8 : భారతీయ రోడ్లపై ఇప్పటివరకు ఎలక్ట్రిక్ కార్ల హవా చూశాం, కానీ ఇప్పుడు హైబ్రిడ్ పవర్ అంటే ఏంటో చూపించడానికి చైనా దిగ్గజం BYD సిద్ధమైంది. కేవలం ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే.. ఏకంగా హైదరాబాద్ నుంచి కలకత్తా వరకు (1200 కి.మీ) నాన్-స్టాప్ గా వెళ్ళిపోయే రేంజ్ కలిగిన సరికొత్త లగ్జరీ ఎస్‌యూవీ బివైడి లియోపార్డ్ 8 త్వరలో భారత్‌లో అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే ఇండియాలో సీల్, అట్టో 3 వంటి మోడళ్లతో సక్సెస్ అయిన ఈ కంపెనీ, ఇప్పుడు తన ప్రీమియం సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేయడానికి ఈ బాహుబలి కారును రంగంలోకి దించుతోంది.

ఏమిటీ లియోపార్డ్ 8 ప్రత్యేకత?

బివైడి సంస్థ భారత్‌లో తన విక్రయాలను రెట్టింపు చేయాలనే ప్లాన్‌తో ఉంది. ఇందులో భాగంగానే లియోపార్డ్ 8 అనే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీ కోసం డిజైన్ పేటెంట్‌ను ఫైల్ చేసింది. గ్లోబల్ మార్కెట్‌లో దీనిని ఫాంగ్‌చెంగ్‌బావో బావో 8 అని కూడా పిలుస్తారు. ఇది కేవలం లగ్జరీ కారు మాత్రమే కాదు, మొండి ఘటమైన ఆఫ్-రోడర్ కూడా. అంటే బురదలో, ఇసుకలో, కొండల మీద కూడా ఇది అద్భుతంగా పరుగెడుతుంది.

ఈ ఎస్‌యూవీలో 2.0 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. దీనికి తోడు 36.8 kWh సామర్థ్యం గల బ్లేడ్ బ్యాటరీని అమర్చారు. ఇవన్నీ కలిసి ఏకంగా 748 bhp పవర్‌ను, 760 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. కేవలం 4.8 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే 100 కిలోమీటర్లు వెళ్లే ఈ కారు, పెట్రోల్, బ్యాటరీ కలిపి వాడితే 1,200 కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్‌ను ఇస్తుంది.

ఈ కారును బాడీ-ఆన్-ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించారు, ఇది కారుకు చాలా గట్టిదనాన్ని ఇస్తుంది. ఇందులో ఫుల్-టైమ్ ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ ఉంది. ఇసుక, మంచు, ఆఫ్-రోడ్ వంటి వివిధ రోడ్లకు తగ్గట్టుగా ప్రత్యేక మోడ్స్ ఉన్నాయి. కారు కింద ఉన్న రాళ్లు, గుంతలు కూడా డ్యాష్‌బోర్డ్ స్క్రీన్‌పై కనిపించేలా ట్రాన్స్‌పరెంట్ వ్యూ టెక్నాలజీని వాడారు. హైడ్రాలిక్ సస్పన్షన్ సిస్టమ్ వల్ల రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నా లోపల కూర్చున్న వారికి ఏమీ తెలియదు.

లోపల అడుగుపెడితే కారులా కాకుండా ఒక హైటెక్ రూమ్ లాగా ఉంటుంది. డ్యాష్‌బోర్డ్‌పై ఏకంగా మూడు స్క్రీన్లు ఉన్నాయి. మధ్యలో 17.3 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్, డ్రైవర్ కోసం 12.3 అంగుళాల డిస్‌ప్లే, పక్కన కూర్చునే ప్రయాణికుడి కోసం మరో 12.3 అంగుళాల వినోదపు స్క్రీన్ ఉన్నాయి. దీనికి తోడు 50 అంగుళాల భారీ హెడ్-అప్ డిస్‌ప్లే (HUD) డ్రైవర్ కు కారు వివరాలన్నీ కళ్లముందే చూపిస్తుంది. మొత్తానికి ఈ కారు రోడ్ల మీదకు వస్తే టయోటా ల్యాండ్ క్రూయిజర్ వంటి దిగ్గజాలకు చుక్కలు కనిపించడం ఖాయం.

Tags:    

Similar News