BYD : భారత్ కోసం BYD కొత్త అస్త్రం.. టెస్లాకు దడ పుట్టిస్తున్న చైనా ఈవీ దిగ్గజం
టెస్లాకు దడ పుట్టిస్తున్న చైనా ఈవీ దిగ్గజం
BYD : ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో టెస్లాను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న BYD, ఇప్పుడు భారత్‌లో తన సామ్రాజ్యాన్ని విస్తరించాలని చూస్తోంది. దుబాయ్‌లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్టెల్లా లీ మాట్లాడుతూ.. భారత్ తమకు అత్యంత కీలకమైన మార్కెట్ అని ప్రకటించారు. ప్రస్తుతం చైనాలోని షెన్‌జెన్ ప్రధాన కార్యాలయంలో భారతీయుల అవసరాలకు, బడ్జెట్‌కు తగ్గట్టుగా ఒక ప్రత్యేకమైన కారు డిజైన్ పనులు జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు.
ప్రస్తుతం BYD వద్ద ఉన్న గ్లోబల్ మోడళ్ల కంటే భిన్నంగా, భారతీయ రోడ్లు, ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండే మోడళ్లను తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. అయితే, ఈ కారు ధర ఎంత ఉంటుంది? ఫీచర్లు ఏమిటి? అనే విషయాలను కంపెనీ ఇంకా రహస్యంగానే ఉంచింది. "మా టీమ్ దీనిపై తీవ్రంగా పనిచేస్తోంది, కానీ ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉంది" అని స్టెల్లా లీ పేర్కొన్నారు. ఇదే సమయంలో భారత్‌లో కొత్తగా అసెంబ్లీ ప్లాంట్ పెడుతున్నారన్న వార్తలను ఆమె తోసిపుచ్చారు, ప్రస్తుతానికి డిజైన్, మార్కెట్ విస్తరణపైనే తమ ఫోకస్ అని స్పష్టం చేశారు.
ఒకప్పుడు కేవలం మొబైల్ బ్యాటరీలు తయారు చేసే చిన్న కంపెనీగా మొదలైన BYD, ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ తయారీ సంస్థగా ఎదిగింది. గత ఏడాది ఏకంగా 22.6 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ కార్లను విక్రయించి, ఎలాన్ మస్క్ టెస్లా రికార్డులను తిరగరాసింది. చైనా మార్కెట్లో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు తగ్గడం, దేశీయంగా అమ్మకాలు మందగించడంతో BYD ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లపై దృష్టి పెట్టింది. అమెరికాలో చైనా వాహనాలపై భారీగా పన్నులు ఉండటంతో, ఆ దేశం మినహా మిగిలిన అన్ని దేశాల్లోనూ, ముఖ్యంగా భారత్ వంటి పెద్ద మార్కెట్లలో పాగా వేయాలని చూస్తోంది.
BYD తన భారత ప్రణాళికలను వేగవంతం చేయడానికి మరో ముఖ్య కారణం.. భారత్, చైనా మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడుతుండటం. 2020లో సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, ఇటీవల అక్టోబర్‌లో ఐదేళ్ల తర్వాత ప్రత్యక్ష విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కావడం వంటి పరిణామాలు వ్యాపార రంగానికి సానుకూలంగా మారాయి. స్థానిక మార్కెట్లకు అనుగుణంగా తనను తాను మలచుకుంటూ, అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని శక్తిగా ఎదగాలన్నదే BYD అసలు లక్ష్యం.