Car AC Tips : వేసవిలో మీ కారు ఏసీ సూపర్ కూలింగ్ ఇవ్వాలా? ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే లోపల మంచు కురవాల్సిందే

ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే లోపల మంచు కురవాల్సిందే

Update: 2026-04-08 14:17 GMT

Car AC Tips : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. భానుడు భగభగమంటూ మండిపోతుంటాడు. బయట ఎండ తట్టుకోలేక కారులో ఏసీ ఆన్ చేస్తే, అది కాస్తా సరిగ్గా చల్లబరచక ఉడకబెట్టినట్టు అనిపిస్తోందా? అయితే మీ కారు ఏసీకి ఏదో సమస్య ఉందని అర్థం. చాలామంది ఏసీ గ్యాస్ అయిపోయిందనో లేదా ఏసీ పాడైపోయిందనో కంగారుపడి మెకానిక్ దగ్గరికి పరుగులు తీస్తారు. కానీ, మనకు తెలియకుండా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు, కొన్ని జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఏసీ కూలింగ్ తగ్గిపోతుంది. మీ కారు ఏసీని కాశ్మీర్ లా మార్చుకోవడానికి ఈ టిప్స్ పాటించండి..

ముందుగా ఆ వేడిని బయటకు పంపండి

కారును ఎండలో పార్క్ చేసినప్పుడు లోపల గాలి భయంకరంగా వేడెక్కుతుంది. మనం కారులోకి ఎక్కగానే ఏసీ ఆన్ చేస్తే ఆ వేడిని తగ్గించడానికి ఏసీ చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకే కారు స్టార్ట్ చేసే ముందు డోర్లు లేదా కిటికీలను కనీసం రెండు నిమిషాల పాటు తెరిచి ఉంచండి. లోపల ఉన్న వేడి గాలి బయటకు వెళ్లిపోయాక ఏసీ ఆన్ చేస్తే, అది చాలా త్వరగా చల్లబరుస్తుంది. దీనివల్ల ఇంజిన్ పై కూడా భారం తగ్గుతుంది.

రీసర్క్యులేషన్ మోడ్ మ్యాజిక్

చాలామంది ఏసీ బటన్ నొక్కేస్తారు కానీ, రీసర్క్యులేషన్ బటన్ వాడటం మర్చిపోతారు. ఈ మోడ్ లో ఉంచితే బయట ఉన్న వేడి గాలి లోపలికి రాదు. కారు లోపల ఉన్న చల్లటి గాలినే మళ్ళీ మళ్ళీ ఏసీ యూనిట్ చల్లబరుస్తుంది. దీనివల్ల కూలింగ్ వేగంగా పెరుగుతుంది. అలాగే ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ స్పీడ్‌ను మొదట ఎక్కువగా ఉంచి, కారు చల్లబడ్డాక తగ్గించడం మంచి పద్ధతి.

ఫిల్టర్లను నిర్లక్ష్యం చేయకండి

మనం ఇంట్లో ఏసీ ఫిల్టర్లు ఎలా క్లీన్ చేస్తామో, కారు ఏసీ ఫిల్టర్ కూడా అంతే ముఖ్యం. గాలిలోని దుమ్ము, ధూళి చేరి ఫిల్టర్ జామ్ అయితే గాలి సరిగ్గా రాదు. దీనివల్ల ఏసీ కంప్రెసర్ పైన ఒత్తిడి పెరుగుతుంది కానీ కూలింగ్ రాదు. కనీసం ఆరు నెలలకు ఒకసారి ఏసీ ఫిల్టర్ మార్చుకోవాలి. అలాగే కారు ముందు భాగంలో ఉండే కండెన్సర్‌ను కూడా నీళ్లతో శుభ్రం చేయిస్తూ ఉండాలి. అక్కడ మురికి ఉంటే వేడి గాలి బయటకు వెళ్లక కూలింగ్ తగ్గిపోతుంది.

పార్క్ చేసేటప్పుడు జాగ్రత్త

సాధ్యమైనంత వరకు కారును నీడలో పార్క్ చేయడానికి ప్రయత్నించండి. నీడ దొరకని పక్షంలో విండ్ షీల్డ్ పైన సన్ షేడ్స్ వాడండి. దీనివల్ల లోపల సీట్లు, డ్యాష్ బోర్డ్ వేడెక్కకుండా ఉంటాయి. గ్యాస్ తక్కువగా ఉన్నా ఏసీ సరిగ్గా పని చేయదు. కాబట్టి ఏసీ సర్వీసింగ్ చేయించేటప్పుడు గ్యాస్ లెవల్స్ చెక్ చేయించుకోవడం మర్చిపోవద్దు. క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయిస్తే మీ కారు ఏసీ లైఫ్ పెరగడమే కాకుండా, పెద్ద పెద్ద ఖర్చులు కూడా తప్పుతాయి.

Tags:    

Similar News