Car Price Hike: కొత్త కారు లేదా బైక్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇంకొంచెం ఆలస్యం చేస్తే మీ జేబుకు భారీ చిల్లు పడటం ఖాయం. రాబోయే పండగల సీజన్ కంటే ముందే వాహనాల ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తయారీ వ్యయం విపరీతంగా పెరగడంతో వాహన తయారీ సంస్థలు ఆ భారాన్ని కస్టమర్లపై మోపేందుకు సిద్ధమవుతున్నాయి.

పెరిగిన ముడి సరుకుల ధరల భారం

వాహనాల తయారీకి అత్యంత కీలకమైన స్టీల్, రబ్బర్, అల్యూమినియం, రాగి (కాపర్), సెమీకండక్టర్ల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతంగా పెరిగాయి. టాటా మోటార్స్ సీఈఓ గిరీష్ వాగ్ తెలిపిన వివరాల ప్రకారం కమర్షియల్ వాహనాల తయారీ వ్యయంలో ఒక్క స్టీల్ వాటానే 40 శాతం వరకు ఉంటుంది. స్టీల్ ధరలు తగ్గకపోవడంతో కంపెనీలపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. విద్యుత్ వాహనాల్లో రాగి వినియోగం ఎక్కువ కావడం వల్ల దానికి డిమాండ్‌తో పాటు ధర కూడా పెరిగింది. మహీంద్రా ఆర్థిక గణాంకాల ప్రకారం ఈ ఏడాది రబ్బర్ ధర 53 శాతం, స్టీల్ 24 శాతం, రాగి 10 శాతం మేర పెరిగాయి.

ఆటో పార్ట్స్, టైర్ కంపెనీల్లోనూ తీవ్ర ఒత్తిడి

ముడి సరుకుల ధరల ప్రభావం కేవలం వాహన తయారీ సంస్థలకే కాకుండా ఆటో విడిభాగాల కంపెనీలు, టైర్ల తయారీదారులపై కూడా తీవ్రంగా పడింది. సోనా కామ్‌స్టార్ నిపుణుల ప్రకారం గత 11 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ముడి సరుకుల ధరలు పెరిగాయి. రవాణా ఛార్జీలు, విద్యుత్ బిల్లులు, కార్మికుల వేతనాలు కూడా తోడయ్యాయి. సియట్ వంటి ప్రముఖ టైర్ల కంపెనీ ఇప్పటికే జులై 1న ధరలు పెంచినప్పటికీ, రాబోయే రోజుల్లో మరోసారి పెంచక తప్పదని సూచించింది.

ఇప్పటికే ధరలు పెంచిన దిగ్గజ సంస్థలు

ప్రముఖ కార్ల తయారీ సంస్థలైన మారుతి సుజుకి, హోండా కార్స్ ఇప్పటికే తమ వాహనాల ధరలను సవరించాయి. మారుతి జూన్ నెలలో 0.5 శాతం ధరలు పెంచగా, ఆగస్టు నుంచి మరోసారి పెంచే సంకేతాలు ఇచ్చింది. హోండా కార్స్ కూడా ఆగస్టు ఆరంభం నుంచి కొత్త ధరలను అమలులోకి తెచ్చింది. హ్యుందాయ్ మోటార్స్ ప్రస్తుతానికి వ్యయాన్ని తగ్గించుకుంటూ కస్టమర్లపై భారం పడకుండా చూస్తోంది. అయితే ఎక్కువ కాలం ఈ భారాన్ని కంపెనీలే భరించడం కష్టమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

పండగల సీజన్‌లో కొనుగోలుదారుల ముందస్తు నిర్ణయం

సాధారణంగా దసరా, దివాళీ పండగల సమయంలో వాహనాల విక్రయాలు జోరుగా సాగుతాయి. కానీ పండగలకు ముందే ధరలు పెంచితే కస్టమర్లు కొనుగోళ్లను వాయిదా వేసుకునే ప్రమాదం ఉందనే ఆందోళన కంపెనీల్లో నెలకొంది. అందుకే తక్కువ మొత్తంలో ధరలను పెంచుతూ వస్తున్నాయి. వాహనం కొనే ఆలోచన ఉంటే ధరలు మరింత పెరగకముందే ముందస్తుగా నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

Tags: