Car Safety Tips : వర్షాకాలంలో కార్ నీళ్లలో ఆగిపోతే వెంటనే ఈ పనులు చేయండి
ఈ పనులు చేయండి
Car Safety Tips : వర్షాకాలం వచ్చిందంటే చాలు రోడ్లపై నీరు నిలవడం, డ్రైనేజీలు పొంగిపొర్లడం సర్వసాధారణం. అయితే ఇటువంటి ముంపు నీటిలో ప్రయాణిస్తున్నప్పుడు కార్లు ఆకస్మికంగా ఆగిపోవడం వాహనదారులకు పెద్ద సమస్యగా మారుతుంది. అలాంటి క్లిష్ట సమయంలో చాలామంది కంగారుపడి చేసే చిన్న చిన్న పొరపాట్లు రూ. లక్షల రిపేర్ బిల్లులకు దారితీస్తాయి. సరిగ్గా అవగాహన పెంచుకుని, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే కార్ ఇంజిన్‌ను మరియు ఎలక్ట్రానిక్ విడిభాగాలను సురక్షితంగా కాపాడుకోవచ్చు.
కార్‌ను పదే పదే స్టార్ట్ చేసే ప్రయత్నం చేయకండి
నీటిలో కార్ ఆగిపోగానే చాలామంది చేసే మొదటి పెద్ద తప్పు పదే పదే ఇగ్నిషన్ తిప్పి స్టార్ట్ చేయడానికి ప్రయత్నించడం. నీటి మట్టం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా స్టార్ట్ చేస్తే, ఎయిర్ ఫిల్టర్ లేదా ఎగ్జాస్ట్ పైప్ ద్వారా నీరు నేరుగా ఇంజిన్ లోపలికి ప్రవేశిస్తుంది. దీనివల్ల ఇంజిన్ పిస్టన్లు పూర్తిగా దెబ్బతిని పిస్టన్ బ్లాక్ అవుతుంది. దీనినే ఆటోమొబైల్ పరిభాషలో హైడ్రోలాక్ అంటారు. ఈ పరిస్థితి దాపురిస్తే ఇంజిన్ రీ-బిల్డ్ చేయాల్సి వస్తుంది, దానికి వేల నుంచి లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది.
వెంటనే ఇగ్నిషన్ ఆఫ్ చేసి, సురక్షితంగా బయటకు రండి
కార్ నీటిలో ఆగిపోయిన తక్షణమే ఇగ్నిషన్ పూర్తిగా ఆఫ్ చేసి చావి బయటకు తీసేయాలి. దీనివల్ల కార్‌లోని సెన్సార్లు, వైరింగ్, ఎలక్ట్రికల్ సిస్టమ్స్ షార్ట్ సర్క్యూట్ కాకుండా నిరోధించవచ్చు. ఒకవేళ కార్ చుట్టూ నీటి మట్టం వేగంగా పెరుగుతుంటే లోపలే కూర్చోవడం సురక్షితం కాదు. నీటి ఒత్తిడి వల్ల తలుపులు తెరవడం కష్టమైతే, వెంటనే విండోస్ తెరిచి బయటకు వచ్చి ఎత్తైన సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలి. నీటి ప్రవాహం తక్కువగా ఉంటే కార్‌ను న్యూట్రల్ గేర్‌లో పెట్టి నెమ్మదిగా తోసుకుంటూ పక్కకు తీసుకెళ్లవచ్చు.
టోయింగ్, ఇన్సూరెన్స్ సాయం తీసుకోండి
కార్‌ను సొంతంగా నడిపే ప్రయత్నం చేయకుండా క్రేన్ లేదా టోయింగ్ వాహనం సాయంతో మెకానిక్ షెడ్‌కు తరలించాలి. అలాగే వెంటనే మీ కార్ ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం అందించడం శ్రేయస్కరం. మెకానిక్ ద్వారా స్పార్క్ ప్లగ్‌లు, ఇంజెక్టర్లు, ఎయిర్ ఫిల్టర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయించాలి. ఇంజిన్ ఆయిల్ డిప్‌స్టిక్ తీసి చూసినప్పుడు ఆయిల్‌లో తెల్లటి నురుగు లేదా నీటి చుక్కలు కనిపిస్తే, ఇంజిన్‌లోకి నీరు చేరిందని అర్థం. అప్పుడు ఆయిల్‌ను పూర్తిగా మార్చి, డ్రై చేసిన తర్వాత మాత్రమే ఇంజిన్ స్టార్ట్ చేయాలి.