Car Tyre Buying Guide : కొత్త టైర్లు కొంటున్నారా? అయితే ఈ విషయాలు తెలియకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం

అయితే ఈ విషయాలు తెలియకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం

Update: 2026-02-28 03:35 GMT

Car Tyre Buying Guide : సాధారణంగా కారు కొనేటప్పుడు లేదా కారు కండిషన్ గురించి మాట్లాడేటప్పుడు అందరి దృష్టి ఇంజిన్ మీదనే ఉంటుంది. కానీ అసలు విషయం ఏంటంటే.. కారు రోడ్డు మీద ఎంత వేగంగా దూసుకుపోవాలన్నా, సడన్ బ్రేక్ వేసినప్పుడు ఎంత సురక్షితంగా ఆగాలన్నా ఆ భారమంతా మోసేది కేవలం టైర్లే. ఇంజిన్ కారుకు గుండె లాంటిదైతే, టైర్లు కాళ్ల వంటివి. అందుకే కొత్త టైర్లు కొనేటప్పుడు కేవలం ధర చూసి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో ప్రమాదాలు కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. టైర్లు మార్చే ముందు ప్రతి వాహనదారుడు తెలుసుకోవాల్సిన కీలక విషయాలను ఇప్పుడు వివరంగా చూద్దాం.

మీ కారు టైరు పక్క భాగంలో 215/60R17 వంటి కోడ్స్ కనిపిస్తాయి. చాలామంది వీటిని కేవలం నంబర్లు అనుకుంటారు, కానీ ఇవే మీ కారు జాతకాన్ని నిర్ణయిస్తాయి. ఇందులో మొదటి నంబర్ (215) టైరు వెడల్పును (మిల్లీమీటర్లలో) సూచిస్తుంది. రెండో నంబర్ (60) టైరు ఎత్తును తెలియజేస్తుంది. ఈ రేషియో తక్కువగా ఉంటే కారు హ్యాండ్లింగ్ బాగుంటుంది కానీ ప్రయాణం కొంచెం గతుకులుగా అనిపిస్తుంది. ఇక R అంటే రేడియల్ టైర్ అని, చివరి నంబర్ (17) రిమ్ సైజును (అంగుళాల్లో) సూచిస్తాయి. కంపెనీ సూచించిన సైజును మాత్రమే వాడటం వల్ల మైలేజీ, కారు లైఫ్ బాగుంటుంది.

టైర్లు కొనేటప్పుడు మీ డ్రైవింగ్ అవసరాలను బట్టి ఎంపిక చేసుకోవాలి. మీరు ఎక్కువగా సిటీలో లేదా హైవేలపై తిరుగుతుంటే ఆల్-సీజన్ టైర్లు బెస్ట్ ఛాయిస్. ఇవి అన్ని రకాల వాతావరణాలకు తట్టుకోగలవు. అదే ఎండలు మండిపోయే ప్రాంతాల్లో ఉండేవారు సమ్మర్ టైర్లను, మంచు కురిసే చోట్ల ఉండేవారు వింటర్ టైర్లను వాడటం క్షేమం. తప్పుడు టైర్లను ఎంచుకోవడం వల్ల బ్రేకింగ్ దూరం పెరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

చాలామంది టైర్లు చూడటానికి కొత్తగా ఉంటే చాలనుకుంటారు. కానీ టైరు క్వాలిటీని UTQG రేటింగ్ ద్వారా చెక్ చేయాలి. టైరుపై ఉండే ట్రాక్షన్ రేటింగ్ (AA, A, B, C) అది రోడ్డును ఎంత బలంగా పట్టుకుంటుందో చెబుతుంది. AA రేటింగ్ ఉంటే అది టాప్ క్వాలిటీ అని అర్థం. అలాగే టెంపరేచర్ రేటింగ్ టైరు వేడిని ఎంతవరకు తట్టుకోగలదో వివరిస్తుంది. టైరుపై ఉండే ట్రెడ్ ప్యాటర్న్ (గాళ్లు) కూడా ముఖ్యం, వర్షాకాలంలో నీరు త్వరగా బయటకు పోయేలా ఉండే డిజైన్ ఉన్న టైర్లు ఎంచుకుంటే కారు స్కిడ్ అవ్వకుండా ఉంటుంది.

చివరగా, టైరు తయారీ తేదీని చూడటం అస్సలు మర్చిపోవద్దు. టైర్లు వాడకపోయినా కాలక్రమేణా రబ్బర్ గట్టిపడి పాడైపోతుంది. టైరుపై ఉండే DOT కోడ్ చివరి నాలుగు అంకెలను గమనించండి. ఉదాహరణకు 1224 అని ఉంటే, అది 2024 సంవత్సరం, 12వ వారంలో తయారైందని అర్థం. ఎప్పుడూ ఆరు నెలల కంటే పాత టైర్లను కొనకపోవడమే మంచిది. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ ప్రయాణం సుఖమయం కావడమే కాకుండా కారు మైలేజీ కూడా పెరుగుతుంది.

Tags:    

Similar News