Cheapest EVs : పెట్రోల్ కార్ల కంటే చౌకగా ఈవీలు.. మధ్యతరగతి జేబుకు ఊరటనిచ్చే టాప్-5 బెస్ట్ ఆప్షన్స్
టాప్-5 బెస్ట్ ఆప్షన్స్
Cheapest EVs : భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లను విపరీతంగా పెంచేందుకు ఆటోమొబైల్ రంగానికి చెందిన దిగ్గజ సంస్థలు సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించాయి. అదే BaaS విధానం. సాధారణంగా ఒక ఎలక్ట్రిక్ కారు మొత్తం ధరలో 40 శాతం ఖర్చు కేవలం దాని బ్యాటరీ కోసమే అవుతుంది. ఈ లోపాన్ని అధిగమించడానికి 2026 లో కంపెనీలు బ్యాటరీ లేకుండా కార్లను తక్కువ ధరకే అమ్ముతున్నాయి. కస్టమర్లు కారును కొనుగోలు చేసి, బ్యాటరీ కోసం వారు తిరిగే కిలోమీటర్ల ఆధారంగా లేదా నెలవారీగా స్వల్ప రెంట్ చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల ఈవీల ఆరంభ ధరలు భారీగా తగ్గి సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చాయి.
భారత్‌లోనే అత్యంత చౌకైన టాటా టియాగో ఈవీ
ఈ సరికొత్త లిస్ట్‌లో మొదటి స్థానంలో నిలిచింది మన అందరికీ నచ్చిన హ్యాచ్‌బ్యాక్ కారు టాటా టియాగో ఈవీ. దీని సాధారణ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.6.99 లక్షలుగా ఉంది. అయితే మీరు గనుక BaaS స్కీమ్ కింద ఈ కారును కొనుగోలు చేస్తే, దీని ప్రారంభ ధర ఏకంగా రూ.4.69 లక్షలకే పడిపోతుంది. అంటే ముందే దాదాపు రూ.2.30 లక్షల బడ్జెట్ ఆదా అవుతుంది. దీనికి బదులుగా కస్టమర్లు కిలోమీటర్‌కు కేవలం రూ.2.60 చొప్పున బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో నలుగురు ప్రయాణించడానికి ఇది దేశంలోనే బెస్ట్ ఆప్షన్.
సిటీ డ్రైవింగ్‌కు పర్ఫెక్ట్ ఎంజీ కామెట్ ఈవీ
ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో రోజువారీ ఆఫీస్ ప్రయాణాల కోసం, మొదటిసారి ఈవీ కారు కొనాలనుకునే వారి కోసం ఎంజీ కామెట్ ఈవీ అద్భుతంగా సెట్ అవుతుంది. ఈ క్యూట్ కాంపాక్ట్ కారును BaaS ఆప్షన్ కింద కేవలం రూ.4.92 లక్షల ప్రారంభ ధరకే సొంతం చేసుకోవచ్చు. పార్కింగ్ సులభంగా ఉండటం, తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇవ్వడం వల్ల ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో ఈ కారుకు రికార్డు స్థాయిలో బుకింగ్స్ వస్తున్నాయి.
సేఫెస్ట్ మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ ఈవీ
భారతీయ మార్కెట్లో ప్రస్తుతం అత్యంత సురక్షితమైన మైక్రో ఎస్‌యూవీగా పేరు తెచ్చుకున్న టాటా పంచ్ ఈవీ కూడా ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ లిస్ట్‌లో చేరిపోయింది. ఈ కారు బేస్ మోడల్ ప్రారంభ ధర కేవలం రూ.6.49 లక్షలుగా నిర్ణయించారు. ఈ స్కీమ్ కింద కస్టమర్లు తిరిగే ప్రతి కిలోమీటర్‌కు రూ.2.60 బ్యాటరీ రెంట్‌గా చెల్లించాలి. మంచి రోడ్ ప్రెజెన్స్, అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్, సేఫ్టీ ఫీచర్లు కోరుకునే వారికి పంచ్ ఈవీ ఒక పవర్‌ఫుల్ ఛాయిస్.
320 కిమీ రేంజ్‌తో దూసుకొచ్చిన సిట్రోయెన్ ఈసీ3ఎక్స్
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ తమ అప్‌డేటెడ్ మోడల్ సిట్రోయెన్ ఈసీ3ఎక్స్ ను సరికొత్త హంగులతో మార్కెట్లోకి తెచ్చింది. దీని ఒరిజినల్ ప్రారంభ ధర రూ. 10.25 లక్షలు కాగా, బాస్ ఆప్షన్‌తో ఇది కేవలం రూ. 6.89 లక్షలకే లభిస్తుంది. ఇందులో అత్యంత పవర్‌ఫుల్ 29.2 kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 320 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. దీనికి గానూ కిలోమీటర్‌కు రూ.2.26 బ్యాటరీ రెంట్‌గా కట్టాలి. ఇందులో 10.25 ఇంచ్ పెద్ద టచ్‌స్క్రీన్ కూడా ఉంటుంది.
పెద్ద కుటుంబాల కోసం లగ్జరీ ఎంజీ విండ్సర్ ఈవీ
ఈ లిస్ట్‌లో ప్రీమియం, ఎక్కువ స్పేస్ ఉన్న పెద్ద కారును కోరుకునే వారి కోసం ఎంజీ విండ్సర్ ఈవీ అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.9.99 లక్షలుగా ఉంది. అయితే ఈ పెద్ద కారు బ్యాటరీ సైజ్ ఎక్కువగా ఉండటం వల్ల, దీని బ్యాటరీ రెంట్ కిలోమీటర్‌కు రూ.3.90 నుంచి రూ.4.50 వరకు ఉంటుంది. మిగిలిన చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్లతో పోలిస్తే విండ్సర్ ఈవీ లోపల కేబిన్ స్పేస్ చాలా లగ్జరీగా, సోఫా లాంటి సీట్లతో విలాసవంతమైన ఫ్యామిలీ ప్రయాణాన్ని అందిస్తుంది.