Citroen Basalt X : సిట్రోయెన్ కొత్త కారు లాంచ్.. బసాల్ట్ X కంఫర్ట్ ఎడిషన్ ధర ఎంతంటే?

బసాల్ట్ X కంఫర్ట్ ఎడిషన్ ధర ఎంతంటే?

Update: 2026-07-22 07:27 GMT

Citroen Basalt X : ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ భారతదేశంలో తన నూతన మోడల్ బసాల్ట్ X కంఫర్ట్ ఎడిషన్‎ను అధికారికంగా లాంచ్ చేసింది. కంపెనీ తన 108వ వార్షికోత్సవ శుభ సమయాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేక ఎడిషన్‌ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ సరికొత్త స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.8.75 లక్షలుగా నిర్ణయించారు. మునుపటి మోడళ్లతో పోలిస్తే ఇందులో మరింత ప్రీమియం కేబిన్, సుదూర ప్రయాణాలకు అనువుగా ఉండే సౌకర్యవంతమైన ఫీచర్లను అందించారు.

రాచరికపు లుక్‌తో అధునాతన కేబిన్

సిట్రోయెన్ బసాల్ట్ X కంఫర్ట్ ఎడిషన్‌లో చేసిన అతిపెద్ద మార్పు దాని కేబిన్ ఇంటీరియర్‌లోనే కనిపిస్తుంది. ఈ మోడల్‌కు చెందిన అన్ని వేరియంట్లలో మెట్రోపాలిటన్ బీజ్ లెదరెట్ సీట్లను స్టాండర్డుగా అందించడం విశేషం. గతంలో ఈ సౌలభ్యం లభించలేదు. ఈ కొత్త లెదరెట్ సీట్లు కారు లోపలి భాగం చూడటానికి అత్యంత విలాసవంతంగా కనిపించడమే కాకుండా, లాంగ్ డ్రైవ్స్ చేసే సమయంలో ప్రయాణికులకు అలసట లేకుండా అద్భుతమైన సౌకర్యాన్ని అందిస్తాయని కంపెనీ వెల్లడించింది.

ఫుల్లీ లోడెడ్ కంఫర్ట్ AXS ప్యాక్

కస్టమర్ల విభిన్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని సిట్రోయెన్ కంఫర్ట్ AXS ప్యాక్ ను పరిచయం చేసింది. కొనుగోలుదారులు తమ బడ్జెట్‌కు తగినట్లుగా ఈ ప్యాక్ ద్వారా అదనపు ఫీచర్లను ఎంచుకోవచ్చు. ఇందులో ప్రతిష్టాత్మక జేబీఎల్ ప్రీమియం ఆడియో సిస్టమ్, భద్రత కోసం ప్రిడిక్టివ్ సేఫ్టీ అలర్ట్స్‌తో కూడిన ఫ్రంట్ అండ్ కేబిన్ డ్యాష్ కెమెరా లభిస్తాయి. వీటితో పాటు రివర్స్ పార్కింగ్ కెమెరా, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, 10-అంగుళాల పెద్ద ఆండ్రాయిడ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు.

కస్టమర్ల ఇష్టానికే ప్రాధాన్యత – సిట్రోయెన్ వ్యాఖ్యలు

సిట్రోయెన్ బసాల్ట్ X కంఫర్ట్ ఎడిషన్ అనేది అందుబాటు ధరలోనే లగ్జరీ అనుభూతిని కోరుకునే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దబడిందని కంపెనీ తెలిపింది. స్టెల్లాంటిస్ ఇండియా ఆటోమోటివ్ బ్రాండ్స్ బిజినెస్ హెడ్ అండ్ డైరెక్టర్ కుమార్ ప్రియాంశ్ మాట్లాడుతూ.. "సిట్రోయెన్ ఎల్లప్పుడూ ప్రయాణికుల సౌకర్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది. గతంలో లాంచ్ చేసిన ఎయిర్‌క్రాస్ కంఫర్ట్ ఎడిషన్‌కు కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. అదే ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు బసాల్ట్ మోడల్‌లోనూ అదే స్థాయి ప్రీమియం అనుభవాన్ని అందిస్తున్నాం" అని పేర్కొన్నారు.

అన్ని షోరూమ్‌లలోనూ లభ్యం

కొత్తగా విడుదలైన సిట్రోయెన్ బసాల్ట్ X కంఫర్ట్ ఎడిషన్ కార్లు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సిట్రోయెన్ డీలర్‌షిప్‌లలో విక్రయానికి అందుబాటులోకి వచ్చాయి. నేరుగా షోరూమ్‌లను సందర్శించి లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ మోడల్, దానిలోని కంఫర్ట్ AXS ప్యాక్‌ల గురించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చని, టెస్ట్ డ్రైవ్‌లను కూడా బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలియజేసింది.

Tags:    

Similar News