Citroen : టాటా పంచ్ ఈవీకి పోటీగా వచ్చిన సిట్రోయెన్ eC3.. ఇప్పుడు కొంటే ఏకంగా రూ.40,000 డిస్కౌంట్

ఇప్పుడు కొంటే ఏకంగా రూ.40,000 డిస్కౌంట్

Update: 2026-05-20 13:01 GMT

Citroen : భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో టాటా మోటార్స్ హవాను తట్టుకునేందుకు ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ సరికొత్త ఎత్తుగడ వేసింది. తన పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఏకైక ఎలక్ట్రిక్ కారు సిట్రోయెన్ eC3 అమ్మకాలను పెంచేందుకు ఈ మే నెలలో భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఈ బడ్జెట్ ఈవీ కారును కొనుగోలు చేసే కస్టమర్లకు కంపెనీ ఏకంగా రూ.40,000 వరకు నగదు బహుమతులు, ప్రయోజనాలను అందిస్తోంది. పట్టణ వినియోగదారులను ఆకర్షించేలా అందుబాటు ధరలో లాంచ్ అయిన ఈ కారు.. మార్కెట్లో ఉన్న టాటా పంచ్ ఈవీ, టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెట్ ఈవీలకు గట్టి పోటీ ఇస్తోంది.

సేల్స్ పెంచేందుకే ఈ భారీ ఆఫర్.. ప్రారంభ ధర ఎంతంటే?

నిజానికి సిట్రోయెన్ eC3 కారుకు మార్కెట్లో ఆశించిన స్థాయిలో ఆదరణ లభించడం లేదు. మార్చి నెల సేల్స్ రిపోర్ట్ ప్రకారం కేవలం 13 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అందుకే ఈ కారు అమ్మకాలకు మళ్లీ జీవం పోయాలని కంపెనీ ఈ అదిరిపోయే డిస్కౌంట్‌ను తెరపైకి తెచ్చింది. భారత మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.12.90 లక్షలుగా ఉంది. అధికారిక ARAI రేటింగ్ ప్రకారం ఈ కారు సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 320 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

ఫీచర్లు ఎలా ఉన్నాయి?

ఈ కారు లుక్స్, డిజైన్ పరంగా సిట్రోయెన్ పాత పెట్రోల్ మోడల్ C3 లాగే ఉంటుంది. కేవలం ముందు భాగంలో ఉండే క్లోజ్డ్ గ్రిల్, ఫ్రంట్ ఫెండర్ పై ఉన్న ఛార్జింగ్ ఫ్లాప్ (క్యాప్) మాత్రమే ఇది ఈవీ కారు అని గుర్తు చేస్తాయి.

ఇంటీరియర్ ఫీచర్లు: కేబిన్ లోపల వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్‌తో కూడిన 10.2-ఇంచుల భారీ టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను ఇచ్చారు. అలాగే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్, స్టైలిష్ ఫ్యాబ్రిక్ సీట్లు ఉన్నాయి.

సేఫ్టీ & వారంటీ: భద్రత పరంగా ఈ కారు కాస్త నిరాశపరిచింది. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో పెద్దల రక్షణలో 0-స్టార్ రేటింగ్, పిల్లల రక్షణలో కేవలం 1-స్టార్ రేటింగ్‌ను మాత్రమే సాధించింది. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్‌లు ఉన్నాయి. కంపెనీ ఈ కారుపై 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల స్టాండర్డ్ వారంటీని ఇస్తోంది.

రియల్ వరల్డ్ రేంజ్ టెస్ట్

కంపెనీ 320 కిమీ రేంజ్ అని చెబుతున్నప్పటికీ, 75% సిటీ, 25% హైవే రోడ్లపై ఏసీ ఆన్ చేసి చేసిన ప్రాక్టికల్ రియల్ రేంజ్ డ్రైవ్ టెస్ట్‎లో ఆసక్తికరమైన నిజాలు బయటపడ్డాయి.

* 100% ఛార్జింగ్ ఉన్నప్పుడు డిస్‌ప్లేపై 228 కిమీ రేంజ్ చూపించింది.

* కారును 114.4 కిమీ నడిపిన తర్వాత బ్యాటరీ 50 శాతానికి పడిపోయింది.

* బ్యాటరీ 5% ఉన్నప్పుడు కారులోని ఏసీ ఆటోమేటిక్‌గా బంద్ అయిపోయింది.

* బ్యాటరీ 2% కి చేరుకోగానే కారు టాప్ స్పీడ్ గంటకు కేవలం 10 కిమీకి పడిపోయింది.

* బ్యాటరీ పూర్తిగా 0% అయిపోయే సరికి ఈ కారు నిజ జీవితంలో 218.8 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించింది. రోజువారీ సిటీ ప్రయాణాలకు, ఆఫీస్ అవసరాలకు ఈ మైలేజ్ సరిపోతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News