Collar EV : డెలివరీ బాయ్స్‌కు గుడ్ న్యూస్.. అదిరిపోయే రేంజ్‌తో కాలర్ ఈవీ మూన్ స్కూటర్ లాంచ్
అదిరిపోయే రేంజ్‌తో కాలర్ ఈవీ మూన్ స్కూటర్ లాంచ్
Collar EV : దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఈవీ స్టార్టప్ CollarEV, డెలివరీ, లాజిస్టిక్స్ రంగమే లక్ష్యంగా తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మూన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. వ్యాపార అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ స్కూటర్, పెట్రోల్ ఖర్చులను తగ్గించుకోవాలనుకునే చిన్న వ్యాపారులకు, డెలివరీ బాయ్స్‌కు ఒక వరం అని చెప్పొచ్చు. సరసమైన ధర, దృఢమైన బాడీతో వచ్చిన ఈ స్కూటర్ వివరాలను తెలుసుకుందాం.కాలర్ ఈవీ మూన్ స్కూటర్ ధర రూ.79,999 నుంచి రూ.89,999 (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది. ఇది మార్కెట్లోని ఇతర కమర్షియల్ ఈవీల కంటే తక్కువ ధరకే లభిస్తోంది. కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రీ-బుకింగ్స్ ప్రారంభించింది. కేవలం రూ.999 చెల్లించి ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు.
సాధారణంగా ఈవీ స్కూటర్లు ప్లాస్టిక్ బాడీతో వస్తాయి, కానీ మూన్ స్కూటర్ ఫుల్ మెటల్ బాడీతో రూపొందించబడింది. దీని వల్ల స్కూటర్ చాలా కాలం మన్నికగా ఉంటుంది. ఇందులో 2.3 kWh సామర్థ్యం గల లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీని అమర్చారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 135 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దీనిలోని 1500W BLDC మోటర్ 50 కిమీ టాప్ స్పీడ్‌ను అందిస్తుంది, ఇది నగరాల్లో డెలివరీలకు సరిగ్గా సరిపోతుంది.
డెలివరీ చేసే వారికి సమయం చాలా ముఖ్యం. అందుకే ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఇచ్చారు. కేవలం 2 గంటల్లోనే 80% బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. పూర్తి ఛార్జింగ్‌కు 2.5 గంటలు పడుతుంది. ఈ స్కూటర్ 150 కిలోల బరువును సులభంగా మోయగలదు. పాలు, కూరగాయలు లేదా ఇతర పార్శిల్స్ డెలివరీ చేసే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్మార్ట్ ఫీచర్ల కోసం ఇందులో TFT డిస్ప్లే, టెలిమాటిక్స్ సిస్టమ్ ఉన్నాయి, దీని ద్వారా స్కూటర్ లొకేషన్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు.
వ్యాపార అవసరాల కోసం మూన్ స్కూటర్‌ను తెచ్చిన కాలర్ ఈవీ, త్వరలోనే సాధారణ కస్టమర్ల కోసం సరికొత్త మోడల్‌ను తీసుకురానుంది. ఇది మరింత స్టైలిష్‌గా, ఎక్కువ ఫీచర్లతో మే - జూన్ 2026 నాటికి మార్కెట్లోకి రావచ్చని సమాచారం. ఇది ఓలా S1, టీవీఎస్ ఐక్యూబ్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు. ఈ కంపెనీ తొలుత టైర్-1, టైర్-2 నగరాలపై దృష్టి సారించి, ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని ప్లాన్ చేస్తోంది.