Car Safety Tips: పటాకుల ధాటికి కాలిపోకుండా కారు కాపాడుకునేందుకు 6 సేఫ్టీ టిప్స్
6 సేఫ్టీ టిప్స్
Car Safety Tips: దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని తాకుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ ఇళ్లను దీపాలతో అలంకరించుకోవడంలో, బాణసంచా కాల్చడంలో నిమగ్నమై ఉంటారు. అయితే ఈ ఆనందాల మధ్య మనం నిర్లక్ష్యం చేసే ఒక ముఖ్యమైన విషయం మన వాహనాల భద్రత. పండగ రాత్రి ఆకాశంలో పేలే రాకెట్లు, నేలపై తిరిగే భూచక్రాలు, బాణసంచా నుంచి వెలువడే వేడి చిచ్చుబుడ్లు అకస్మాత్తుగా ఎటునుంచి అయినా దూసుకువచ్చి పార్క్ చేసిన కార్లు అలాగే బైక్‌లపై పడే ప్రమాదం ఉంది. ఈ ఒక్క చిన్న పొరపాటు వల్ల వాహనాల పెయింట్ కాలిపోవడం, ప్లాస్టిక్ భాగాలు కరిగిపోవడం జరిగి వేల రూపాయల నష్టం వాటిల్లుతుంది.
సురక్షితమైన పార్కింగ్ స్థలం ఎంచుకోండి
దీపావళి సమయంలో వాహనాన్ని ఎక్కడ పార్క్ చేస్తున్నారనేది అత్యంత కీలకం. మీ ఇంటి వద్ద కవర్డ్ గ్యారేజ్ లేదా బేస్మెంట్ పార్కింగ్ సదుపాయం ఉంటే ఖచ్చితంగా వాహనాన్ని అక్కడే ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్ల పక్కన, బహిరంగ ప్రదేశాలలో లేదా బాల్కనీల కింద కార్లను నిలపవద్దు. సాధారణంగా ప్లాట్లు, అపార్ట్మెంట్ల బాల్కనీల నుంచి పిల్లలు అలాగే పెద్దలు టపాసులు కాలుస్తుంటారు. అక్కడ నుంచి ఎగిరే నిప్పు రవ్వలు కింద ఉన్న కార్ల మీద పడి క్షణాల్లో మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. అందువల్ల ఎప్పుడూ జనాలకు కొంచెం దూరంగా ఉండే సురక్షిత ప్రాంతంలోనే వాహనం ఉంచాలి.
ప్లాస్టిక్ కవర్లకు దూరంగా ఉండటం మంచిది
చాలా మంది తమ కార్లను దుమ్ము అలాగే పొగ నుంచి రక్షించుకోవడానికి నైలాన్ లేదా ప్లాస్టిక్ కవర్లతో కప్పుతుంటారు. కానీ దీపావళి రోజులలో ఈ పద్ధతి చాలా ప్రమాదకరమైనదిగా మారుతుంది. ఈ రకమైన ప్లాస్టిక్ కవర్లు అతి త్వరగా మంటలను ఆకర్షించే గుణం కలిగి ఉంటాయి. గాల్లో ఎగిరే ఒక చిన్న నిప్పు కణిక తగిలినా కవర్ మొత్తం కాలిపోయి కారుకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఒకవేళ కారును కప్పాల్సి వస్తే మార్కెట్లో లభించే ఫైర్-రిటార్డెంట్ కవర్లను మాత్రమే ఉపయోగించాలి. వీలుకాకపోతే కవర్ తొలగించి బహిరంగంగా ఉంచడమే మేలు.
కిటికీలు పూర్తిగా మూసివేయడం, త్వరగా కాలే వస్తువులకు దూరం
కారును పార్క్ చేసే ముందు అన్ని కిటికీలను సరిగ్గా పైకి ఎత్తి ఉంచాలి అలాగే సన్ రూఫ్‌ను లాక్ చేయాలని గుర్తుంచుకోండి. కొద్దిగా తెరుచుకుని ఉన్న కిటికీల ద్వారా టపాసుల నిప్పు లోపలకి ప్రవేశించి సీట్లను కాల్చేయవచ్చు. అలాగే బైకులు లేదా స్కూటర్లపై వెళ్లేవారు పెట్రోల్ ట్యాంక్ క్యాప్, డెక్కీ సరిగ్గా లాక్ అయ్యాయో లేదో చూసుకోవాలి. కారును ఎండిన ఆకులు, చెత్తాచెదారం లేదా తాత్కాలిక టపాసుల దుకాణాల దగ్గర అస్సలు నిలపవద్దు. కార్ల లోపల సెంట్లు, డియోడరెంట్లు, శానిటైజర్లు, లైటర్లు, గ్యాస్ సిలిండర్లు లేదా టపాసుల బాక్సులు ఉంచడం ప్రాణాలకే ప్రమాదం.
అత్యవసర పరిస్థితుల కోసం అగ్నిమాపక పరికరం
ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఎదుర్కొనేందుకు కారులో ఎప్పుడూ ఒక చిన్న ఏబీసీ టైప్ పోర్టబుల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ (అగ్నిమాపక యంత్రం) అమర్చుకోవడం మంచిది. ఇది అత్యవసర సమయంలో మంటలు వేగంగా విస్తరించకుండా నివారించడంలో సహాయపడుతుంది. అలాగే ఇంటి వద్ద పార్కింగ్ ప్రాంతంలో ఒక బకెట్ నిండా నీరు లేదా ఇసుక అందుబాటులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. తద్వారా పండుగ సంతోషం ఎలాంటి ఆటంకం లేకుండా ప్రశాంతంగా గడిచిపోతుంది.