Car Wash Tips : ఇంట్లోనే కారు కడుగుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే పెయింట్ ఊడిపోవడం ఖాయం

ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే పెయింట్ ఊడిపోవడం ఖాయం

Update: 2026-03-27 07:24 GMT

Car Wash Tips : సొంత కారు ఉన్న ప్రతి ఒక్కరికీ దానిని మెరిసిపోయేలా ఉంచుకోవాలని ఉంటుంది. అందుకే చాలామంది బయట సర్వీసింగ్ సెంటర్లకు ఇచ్చే బదులు, ఇంటి వద్దే తమకు నచ్చిన సమయంలో కారును శుభ్రం చేసుకోవడానికి ఇష్టపడతారు. దీనివల్ల డబ్బు ఆదా అవ్వడమే కాకుండా, మన కారును మనం జాగ్రత్తగా కడుక్కున్నామన్న తృప్తి ఉంటుంది. అయితే, అవగాహన లేకుండా చేసే చిన్న చిన్న పొరపాట్లు మీ కారు మెరుపును శాశ్వతంగా పోగొట్టడమే కాకుండా, పెయింట్ పాడయ్యేలా చేస్తాయని మీకు తెలుసా? కారును ఇంటి వద్ద కడిగేటప్పుడు చేయకూడని తప్పులేంటో, పాటించాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం.

షాంపూల విషయంలో జాగ్రత్త

చాలామంది ఇంట్లో అందుబాటులో ఉండే పాత్రలు కడిగే లిక్విడ్స్, బట్టల డిటర్జెంట్లు లేదా మనం వాడే హెయిర్ షాంపూలను కారు కడగడానికి వాడుతుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. వీటిలో ఉండే ఘాటైన కెమికల్స్ కారు పెయింట్‌పై ఉండే రక్షణ పొరను మెల్లమెల్లగా అరగదీస్తాయి. దీనివల్ల కారు రంగు వెలిసిపోయినట్లు తయారవుతుంది. అలాగే నిమ్మరసం, వెనిగర్ వంటి చిట్కాలు వాడితే మురికి వదులుతుంది కానీ, కారు బాడీకి తుప్పు పట్టే ప్రమాదం ఉంది. అందుకే ఎప్పుడూ కార్ల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన కార్ వాష్ షాంపూనే వాడటం ఉత్తమం.

పాత బట్టలు వద్దు.. మైక్రోఫైబర్ ముద్దు

కారును తుడవడానికి మనం ఇంట్లో వాడి పారేసిన పాత బనియన్లు, టవళ్లు లేదా టీ-షర్టులు వాడుతుంటాం. ఇవి మెత్తగా అనిపించినా, వాటి దారాల మధ్య ఇరుక్కున్న చిన్న చిన్న ఇసుక రేణువులు కారు బాడీపై సన్నని గీతలు పడేలా చేస్తాయి. ముఖ్యంగా నలుపు, ముదురు రంగు కార్ల మీద ఈ గీతలు స్పష్టంగా కనిపిస్తాయి. కారును తుడవడానికి ఎప్పుడూ మైక్రోఫైబర్ క్లాత్ లేదా మెత్తని స్పాంజ్ మాత్రమే వాడాలి. ఇవి పెయింట్ కి ఎటువంటి హాని చేయకుండా మురికిని సున్నితంగా తొలగిస్తాయి.

ఎండలో కడగడం పెద్ద మైనస్

మధ్యాహ్నం వేళ లేదా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కారు కడగడం మరో సాధారణ పొరపాటు. తీవ్రమైన ఎండ వల్ల కారు బాడీ వేడెక్కి ఉంటుంది. మీరు నీళ్లు చల్లగానే అవి త్వరగా ఆరిపోయి, పెయింట్‌పై నీటి చారలు ఉండిపోతాయి. ఇవి కారు మెరుపును తగ్గించడమే కాకుండా, పోవడానికి చాలా కష్టమవుతాయి. కారును ఎప్పుడూ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో, నీడ ఉన్న చోట మాత్రమే కడగాలి. దీనివల్ల కారు మెరుస్తూ కనిపిస్తుంది.

క్లీనింగ్ ఆర్డర్ పాటించండి

కారును కడిగేటప్పుడు ఒక పద్ధతి పాటించాలి. మొదట టైర్లు, కారు కింది భాగం నుంచి క్లీనింగ్ మొదలుపెట్టాలి. ఎందుకంటే అక్కడ మురికి ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు పైన కడిగిన తర్వాత టైర్లు కడిగితే, ఆ మురికి మళ్ళీ కారు బాడీపై పడే అవకాశం ఉంది. ముందుగా నీటితో కారును పూర్తిగా తడిపి, ఆపై షాంపూతో రుద్ది, మళ్ళీ మంచి నీటితో కడగాలి. చివరగా మైక్రోఫైబర్ క్లాత్‌తో తేమ లేకుండా తుడిస్తే మీ కారు షోరూమ్ నుంచి వచ్చిన కొత్త కారులా మెరిసిపోతుంది.

Tags:    

Similar News