Renault Duster : డస్టర్ హవా.. లాంచ్ కాకముందే అమ్ముడైపోయిన హైబ్రిడ్ యూనిట్లు.. బుకింగ్స్ క్లోజ్

బుకింగ్స్ క్లోజ్

Update: 2026-03-19 09:37 GMT

Renault Duster : కార్ లవర్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సరికొత్త రెనాల్ట్ డస్టర్ అట్టహాసంగా అడుగుపెట్టింది. ప్రస్తుతం షోరూమ్‌లలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఈ ఎస్‌యూవీ, తన పాత వైభవాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చేలా కనిపిస్తోంది. అదిరిపోయే టర్బో ఇంజన్లు, ఆకర్షణీయమైన ధరలతో లాంచ్ అయిన డస్టర్.. త్వరలోనే హైబ్రిడ్ అవతారంలో కూడా సందడి చేయబోతోంది. ఇప్పటికే ఈ కారుకు వస్తున్న రెస్పాన్స్ చూసి కంపెనీ యాజమాన్యం కూడా ఖుషీ అవుతోంది.

కొత్త రెనాల్ట్ డస్టర్ టర్బో పెట్రోల్ వేరియంట్లు రూ.10.49 లక్షల నుంచి రూ.18.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరల మధ్య అందుబాటులోకి వచ్చాయి. అయితే, ముందే ఆర్-పాస్ తీసుకున్న కస్టమర్లకు ప్రత్యేకంగా రూ.10.29 లక్షలకే ప్రారంభ ధర లభించనుంది. అంతేకాకుండా, వేరియంట్లను బట్టి వీరికి రూ.50,000 వరకు అదనపు ప్రయోజనాలు కూడా అందజేస్తోంది రెనాల్ట్. ఈ ఆఫర్లతో కస్టమర్లు భారీగా పొదుపు చేసుకునే అవకాశం ఉంది.

డస్టర్ హైబ్రిడ్ వెర్షన్ 2026 దీపావళి నాటికి మార్కెట్లోకి రానుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..అధికారికంగా లాంచ్ కాకముందే ఈ ఏడాదికి కేటాయించిన హైబ్రిడ్ యూనిట్లన్నీ అమ్ముడైపోయాయి. పట్టణ ప్రాంత కొనుగోలుదారులలో సుమారు 39 శాతం మంది టర్బో పెట్రోల్ కంటే హైబ్రిడ్ ఇంజన్‌కే ఓటు వేస్తున్నారు. డిమాండ్ విపరీతంగా ఉండటంతో రెనాల్ట్ ప్రస్తుతానికి హైబ్రిడ్ ప్రీ-బుకింగ్స్‌ను నిలిపివేసింది. చెన్నై ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే పనిలో పడింది కంపెనీ.

త్వరలో రాబోతున్న డస్టర్ హైబ్రిడ్ తన విభాగంలోనే అత్యంత పవర్ఫుల్ కారుగా నిలవనుంది. ఇందులో 1.8 లీటర్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఈ మొత్తం సెటప్ కలిసి ఏకంగా 160 BHP పవర్, 172 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.4 kWh బ్యాటరీ, మల్టీ-మోడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే ఈ కారు, ఇంధన పొదుపుతో పాటు అద్భుతమైన పికప్‌ను కూడా అందిస్తుంది. డిజైన్ పరంగా సాధారణ డస్టర్ లాగే ఉన్నా, దీనిపై ఉండే హైబ్రిడ్ బ్యాజింగ్ దీనికి ప్రత్యేక గుర్తింపునిస్తుంది.

డస్టర్ హైబ్రిడ్ బేస్ వేరియంట్ ధర సుమారు రూ.18 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ ఎండ్ రూ.21 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. ఇది మార్కెట్లోకి వస్తే మారుతీ గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ వంటి ప్రస్తుత హైబ్రిడ్ కార్లతో పాటు త్వరలో రాబోయే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ హైబ్రిడ్ వెర్షన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. రెనాల్ట్ ఇండియా ఉపాధ్యక్షుడు ఫ్రాన్సిస్కో హిడాల్గో మాట్లాడుతూ.. డస్టర్ బ్రాండ్ పట్ల భారతీయులకున్న నమ్మకమే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు.

Tags:    

Similar News