EICMA 2026: ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మోటార్‌సైకిల్ ప్రదర్శనలలో ఒకటైన EICMA 2026 ఇటలీలోని మిలాన్ నగరంలో అత్యంత వైభవంగా జరుగుతోంది. ఫియరా మిలానో రో వేదికగా నవంబర్ 3 నుంచి 8 వరకు ఈ 83వ ఎడిషన్ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ అంతర్జాతీయ ఆటో షోలో భారతీయ ఆటోమొబైల్ కంపెనీల హవా స్పష్టంగా కనిపిస్తోంది. మన దేశంలో తయారైనవి, త్వరలోనే భారత మార్కెట్లోకి అడుగుపెట్టనున్న పలు ఆధునిక మోటార్‌సైకిళ్లు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆకర్షణీయమైన అడ్వెంచర్, క్రూయిజర్, సూపర్ స్పోర్ట్ విభాగాల్లో ఆవిష్కృతమైన ఆ టాప్ 5 బైక్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

హీరో ఎక్స్‌పల్స్ 450

హీరో మోటోకార్ప్ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఎక్స్‌పల్స్ 450' ప్రొడక్షన్ మోడల్‌ను ఈ వేదికపై ఆవిష్కరించింది. ఇందులో 421 సిసి లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ అమర్చారు, ఇది 46 బిహెచ్‌పి పవర్, 38 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 225 మిమీ ట్రావెల్ అడ్జస్టబుల్ సస్పెన్షన్, టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఫీచర్లు ఉన్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన బిగ్గెస్ట్ అడ్వెంచర్ మోడల్ 'హిమాలయన్ 750'ని ప్రదర్శించింది. ఇందులో 5 రైడింగ్ మోడ్లు, కార్నరింగ్ ఎబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లను అందించారు.

హార్లే డేవిడ్సన్ స్ప్రింట్ 440

హీరో మోటోకార్ప్ భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న 'హార్లే డేవిడ్సన్ స్ప్రింట్ 440' బైక్ ఈ షోలో ప్రత్యేకంగా నిలిచింది. భారత్‌లో లభించే X440 ఆధారంగా రూపొందించిన ఈ బైక్ డిజైన్ సాంప్రదాయ క్రూయిజర్ లుక్‌ను కలిగి ఉంది. దీనిని అమెరికాలోని మిల్వాకీ హెడ్‌క్వార్టర్స్‌లో డిజైన్ చేశారు.

బిఎమ్‌డబ్ల్యూ F 450 RR

ఇక బిఎమ్‌డబ్ల్యూ F 450 RR పేరుతో స్పోర్టీ ఫెయిర్డ్ సూపర్ స్పోర్ట్ బైక్ వెలుగులోకి వచ్చింది. ఇందులో 421 సిసి ప్యారలల్-ట్విన్ ఇంజిన్ కలదు. ఇది 47 బిహెచ్‌పి పవర్ ఇస్తుంది. 177 కేజీల బరువుండే ఈ బైక్ 2026 చివరి నాటికి భారత రోడ్లపైకి రానుంది.

టీవీఎస్ అపాచే RTR 125 LC స్పోర్టీ మోడల్

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ తన స్పోర్టీ 125 సిసి బైక్ 'అపాచే RTR 125 LC'ని మిలాన్ షోలో ఆవిష్కరించింది. ఇందులో 4-వాల్వ్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంది, ఇది 14.7 బిహెచ్‌పి పవర్ బట్వాడా చేస్తుంది. సాధారణ 125 సిసి కమ్యూటర్ బైకులకు భిన్నంగా రేసింగ్ ఇన్స్పైర్డ్ డిజైన్, ప్రీమియం హంగులతో దీనిని సిద్ధం చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ల కోసం దీనిని లాంచ్ చేసినప్పటికీ, మన దేశంలో డిమాండ్ బట్టి భారత్‌లోనూ విడుదల చేసే ఆలోచనలో కంపెనీ ఉంది.

త్వరలో భారతీయ మార్కెట్లోకి ఎంట్రీ

EICMA 2026 ప్రదర్శనలో ఆకట్టుకున్న ఈ ఐదు మోటార్‌సైకిళ్లు రాబోయే 12 నుండి 24 నెలల వ్యవధిలో భారతీయ విపణిలో విడుదల కానున్నాయి. ప్రతిష్టాత్మక బ్రాండ్లు భారతీయ రైడర్ల అభిరుచులకు అనుగుణంగా టెక్నాలజీ, మైలేజీ, సేఫ్టీ ఫీచర్లను మేళవించి వీటిని రూపొందించాయి. మోటార్ రంగానికి భారత్ ఎంత పెద్ద హబ్‌గా మారిందో ఈ గ్లోబల్ ప్రదర్శన రుజువు చేస్తోంది. బైక్ లవర్స్ ఈ సరికొత్త రైడింగ్ అనుభూతి కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Tags: