Electric Vehicles: భారత ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలు సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా ఏకంగా 2,98,448 ఈవి వాహనాలు అమ్ముడుపోయి ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేశాయి. గత ఏడాదితో పోలిస్తే విక్రయాలు ఏకంగా 52.9 శాతం పెరగడం ఈవి విప్లవానికి స్పష్టమైన నిదర్శనంగా నిలుస్తోంది. దేశంలో విద్యుత్ వాహనాల వాడకం ఊహించని వేగంతో పుంజుకుంటోంది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) వెల్లడించిన గణాంకాల ప్రకారం భారత వాహన విపణిలో ఈవిల వాటా గతంలో ఉన్న 9.5 శాతం నుంచి ఏకంగా 12.3 శాతానికి చేరింది. ఇంధన ధరల భారం తగ్గించుకోవడానికి, పర్యావరణ స్పృహతో ప్రయాణించడానికి కస్టమర్లు ఇష్టపడుతున్నారు. నాలుగు విభాగాల్లోనూ ఒకేసారి రికార్డు స్థాయిలో విక్రయాలు జరగడం ఆటోమొబైల్ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం.

పరుగులెడుతున్న ఎలక్ట్రిక్ టూవీలర్లు

ఈవి విక్రయాల్లో అత్యధిక వాటాను రెండు చక్రాల వాహనాలే ఆక్రమించాయి. ఒక్క ఆగస్టు నెలలోనే 1,83,204 ఈవి టూవీలర్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాదితో పోలిస్తే వీటి విక్రయాల్లో ఏకంగా 67.05 శాతం భారీ పెరుగుదల నమోదైంది. దేశంలో అమ్ముడవుతున్న మొత్తం విద్యుత్ వాహనాల్లో టూవీలర్ల వాటానే 60 శాతానికి పైగా ఉండటం గమనార్హం. ప్రతినిత్యం ఆఫీసులకు, స్వల్ప దూరాలకు వెళ్లే ఉద్యోగులు, సామాన్యులు ఎక్కువగా పెట్రోల్ బండ్లను వదిలి వీటివైపే మొగ్గు చూపుతున్నారు.

ఎలక్ట్రిక్ కార్లు, త్రీవీలర్ల ఊపు

ప్యాసింజర్ కార్ల విభాగంలోనూ ఇవి మోడళ్లు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. ఆగస్టు నెలలో 30,696 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడుపోగా, గత ఏడాదితో పోలిస్తే 52 శాతం వృద్ధి కనిపించింది. దీంతో మొత్తం కార్ల విభాగంలో ఈవిల వాటా 7.6 శాతానికి చేరింది. త్రీవీలర్ల విషయానికొస్తే 79,846 యూనిట్ల విక్రయాలతో 25.28 శాతం వృద్ధి నమోదైంది. ఈ విభాగంలో ఏకంగా 65.3 శాతం విక్రయాలు కేవలం ఎలక్ట్రిక్ మోడళ్లవే కావడం విశేషం. ఆటో డ్రైవర్లకు నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.

మూడు రెట్లు పెరిగిన కమర్షియల్ వాహనాలు

అత్యంత ఆశ్చర్యకరమైన మార్పు ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహనాల్లో కనిపించింది. ఆగస్టు నెలలో 4,702 ఈవి కమర్షియల్ బండ్లు అమ్ముడుపోగా, గత ఏడాదితో పోలిస్తే సేల్స్ ఏకంగా మూడు రెట్లు పెరిగాయి. ఫాడా అధ్యక్షుడు సాయి గిరిధర్ మాట్లాడుతూ.. భారత ఈవి రంగానికి ఇది ఆల్‌టైమ్ బెస్ట్ ఆగస్టుగా నిలిచిపోతుందని తెలిపారు. చార్జింగ్ మౌలిక వసతులు వేగంగా పెరుగుతుండటంతో రాబోయే రోజుల్లో ఈవిల వాటా మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Tags: