EV Battery : ఈవీ బ్యాటరీల సునామీ.. పెట్రోల్ కార్ల యుగం ముగిసినట్టేనా
పెట్రోల్ కార్ల యుగం ముగిసినట్టేనా
EV Battery : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలకు డిమాండ్ రాబోయే సంవత్సరాలలో అసాధారణంగా పెరగనుంది. కస్టమైజ్ ఎనర్జీ సొల్యూషన్స్ శుక్రవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2025లో 17.7 GWh (గిగా వాట్ అవర్) గా ఉన్న బ్యాటరీల డిమాండ్, 2032 నాటికి భారీగా పెరిగి 256.3 GWh కి చేరుకుంటుంది. ఈ అద్భుతమైన పెరుగుదలకు ప్రధాన కారణాలు.. పెట్రోల్-డీజిల్ ధరలు పెరగడం, వినియోగదారుల నుంచి ఈవీలకు పెరుగుతున్న డిమాండ్, మార్కెట్లో కొత్త మోడల్స్ వేగంగా రావడం, ప్రభుత్వ విధానాల మద్దతు.
రాబోయే ఏడు సంవత్సరాలలో బ్యాటరీ మార్కెట్‌లో సగటు వార్షిక వృద్ధి రేటు 35% వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ గణాంకాలు దేశంలోని ఆటోమొబైల్ రంగంలో పెద్ద మార్పులు రాబోతున్నాయని స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ పెరుగుతున్నందున, బ్యాటరీల పనితీరు, సాంకేతిక మెరుగుదలలు, తయారీ వ్యూహాలలో కూడా గణనీయమైన అభివృద్ధి జరుగుతోంది. బ్యాటరీ కెమిస్ట్రీలో జరుగుతున్న ఆవిష్కరణలు భారతదేశపు ఈవీ విప్లవంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
LFP Gen 4 వంటి ఆవిష్కరణలు, సోడియం-అయాన్ టెక్నాలజీ రాక కేవలం సాంకేతిక మెరుగుదలలు మాత్రమే కాదని, అవి పెద్ద మార్పులకు సంకేతాలని ఆయన అన్నారు. ఈ మార్పుల ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు మరింత తక్కువ ధరలో, సురక్షితంగా, ఒకే ఛార్జ్‌తో ఎక్కువ దూరం ప్రయాణించేలా తయారవుతాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సాంకేతిక మెరుగుదలల కారణంగా, లిథియం-అయాన్ బ్యాటరీలు – ముఖ్యంగా తదుపరి తరం LFP (లిథియం ఐరన్ ఫాస్ఫేట్), NCM (నికెల్ కోబాల్ట్ మాంగనీస్) టెక్నాలజీలు సేఫ్టీ, ధర పరంగా మరింత మెరుగవుతున్నాయి.
కొత్త LFP Gen 4 సెల్స్ ఇప్పుడు 300 Wh/kg కంటే ఎక్కువ ఎనర్జీని అందిస్తున్నాయి. దీనివల్ల వాహనాల రేంజ్ పెరుగుతుంది. అతి ముఖ్యంగా కార్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇదే సమయంలో సోడియం-అయాన్, సాలిడ్-స్టేట్ బ్యాటరీలు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. ఇవి భారతదేశంలోని టూ-వీలర్, త్రీ-వీలర్, ప్రీమియం కార్లు, కమర్షియల్ వాహనాలు వంటి వివిధ సెగ్మెంట్‌లకు మరింత మెరుగైన పరిష్కారాలను అందించగలవు. ఈ సాంకేతిక పురోగతి భారతీయ ఆటో పరిశ్రమ భవిష్యత్తును పూర్తిగా మార్చబోతోంది.