EV Charging Stations: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఊహించని రీతిలో పుంజుకుంటోంది. ఒకప్పుడు ఎలక్ట్రిక్ వాహనం కొనాలంటే ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలి, దారిలో బ్యాటరీ అయిపోతే పరిస్థితి ఏంటి అనే భయాలు ఉండేవి. కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తున్నాయి. ఆగస్టు 2026 నాటికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 67,657 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో 1,139 బ్యాటరీ స్వ్యాపింగ్ స్టేషన్లు కూడా ఉన్నాయి. గంటల తరబడి ఛార్జింగ్ కోసం వేచి చూడకుండా కొన్ని నిమిషాల్లోనే డిశ్చార్జ్ అయిన బ్యాటరీని ఇచ్చి, కొత్త ఛార్జ్ చేసిన బ్యాటరీని తీసుకునే వెసులుబాటు వాహనదారులకు అమితమైన ఊరటనిస్తోంది.

గ్రీన్ నంబర్ ప్లేట్‌తో పర్మిట్ల గండం కానరాదు

ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం పలు పన్ను మినహాయింపులను ప్రకటించింది. ఈవీ వాహనాలు, వాటి ఛార్జర్లు, ఛార్జింగ్ స్టేషన్లపై వసూలు చేసే జిఎస్‌టిని ఏకంగా 5 శాతానికి కుదించింది. రోడ్డు రవాణా శాఖ ఈ బ్యాటరీ వాహనాలకు ప్రత్యేకంగా ఆకర్షణీయమైన ఆకుపచ్చ రంగు నంబర్ ప్లేట్ కేటాయించింది. కమర్షియల్ విభాగంలో తిరిగే ఈవీలకు ఎలాంటి పర్మిట్లు తీసుకోవాల్సిన అవసరం లేకుండా పూర్తి మినహాయింపు ఇవ్వడం వాహన యజమానులకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.

ఫేమ్ పథకం సక్సెస్.. విపరీతంగా పెరిగిన సేల్స్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేమ్ ఇండియా పథకం ఈవీ విప్లవానికి ఊపిరి పోసింది. ఫేమ్-1 ద్వారా 2.80 లక్షల వాహనాలకు లబ్ధి చేకూరగా, రూ.11,500 కోట్ల భారీ బడ్జెట్‌తో అమలైన ఫేమ్-2 పథకం కింద 16.72 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలు భారీ సంఖ్యలో రోడ్డెక్కాయి. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద మరో 26.59 లక్షల వాహనాలు, ఆటో పీఎల్ఐ స్కీమ్ ద్వారా 21.30 లక్షల వాహనాలు అమ్ముడవడం చూస్తుంటే భారతీయ రవాణా వ్యవస్థ వేగంగా ఈవీ వైపు అడుగులు వేస్తోందని స్పష్టమవుతోంది.

నగరాల్లో ఈ-బస్సుల హవా

సొంత వాహనాలే కాకుండా ప్రజా రవాణా వ్యవస్థ కూడా ఎలక్ట్రిక్‌గా మారుతోంది. ఫేమ్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 5,299 ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే రోడ్లపై తిరుగుతుండగా, పీఎం ఈ-బస్ సేవా పథకం ద్వారా మరో 27,555 ఈ-బస్సులను కవర్ చేశారు. కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు ప్రయాణికులకు నిశ్శబ్దమైన, ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని ఈ బస్సులు అందిస్తున్నాయి.

Tags: