EV Safety Alert : ఎలక్ట్రిక్ కార్లలో మంటలు ఎందుకు వస్తాయి? ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి
ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి
EV Safety Alert : మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరిగిన కొద్దీ, వాటి భద్రతపై ఆందోళనలు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. ఇటీవలే టెస్టింగ్ దశలో ఉన్న మహీంద్రా BE 6 ఎలక్ట్రిక్ కారులో మంటలు చెలరేగిన సంఘటన వాహనదారులను ఉలిక్కిపడేలా చేసింది. అయితే, ఈ ప్రమాదానికి కారణం బ్యాటరీ లోపం కాదని, డ్రైవర్ నిర్లక్ష్యమేనని తేలింది. ఈ నేపథ్యంలో మీ ఈవీని అగ్ని ప్రమాదాల నుంచి కాపాడుకోవడానికి మీరు పాటించాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
మహీంద్రా BE 6 ప్రమాదంలో అసలేం జరిగింది?
మహీంద్రా BE 6 కారులో మంటలు రావడానికి కారణం బ్యాటరీ పేలడం కాదని కంపెనీ డేటా విశ్లేషణలో తేలింది. కారు వెనుక టైర్ పంచర్ అయినా, డ్రైవర్ సుమారు 10 నిమిషాల పాటు 60 కి.మీ వేగంతో కారును నడుపుతూనే ఉన్నాడు. టయర్ ప్రెజర్ అలర్ట్స్ వచ్చినా పట్టించుకోకపోవడంతో, రిమ్, టయర్ మధ్య జరిగిన ఘర్షణ వల్ల విపరీతమైన వేడి పుట్టి రబ్బరుకు మంటలు అంటుకున్నాయి. అంటే ఇది వాహన లోపం కాదు, ప్యూర్ గా హ్యూమన్ ఎర్రర్ అన్నమాట.
మీ ఈవీని కాపాడుకోవడానికి 5 సూత్రాలు
1. బ్యాటరీ హెల్త్ పై నిఘా ఉంచండి: ఎలక్ట్రిక్ కారుకు బ్యాటరీయే గుండెకాయ. అధీకృత సర్వీస్ సెంటర్లలో నిర్ణీత కాలవ్యవధిలో బ్యాటరీని చెక్ చేయించాలి. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ (BMS) కరెక్టుగా ఉందో లేదో చూసుకోవాలి. బ్యాటరీ ఉబ్బినట్లు అనిపించినా లేదా విపరీతమైన వేడి వస్తున్నా వెంటనే మెకానిక్ ను సంప్రదించాలి.
2. సర్టిఫైడ్ ఛార్జర్లనే వాడండి: డబ్బులు ఆదా చేద్దామని లోకల్ ఛార్జర్లు లేదా చౌకబారు కేబుల్స్ వాడకండి. ఇవి షార్ట్ సర్క్యూట్ కు దారితీస్తాయి. ఎల్లప్పుడూ కంపెనీ ఇచ్చిన లేదా సర్టిఫైడ్ ఛార్జర్లనే వాడాలి. ఛార్జింగ్ చేసేటప్పుడు గాలి ఆడే చోట కారును పార్క్ చేయడం ఉత్తమం.
3. ఎండలో పార్కింగ్ వద్దు: తీవ్రమైన ఎండలో గంటల తరబడి ఈవీని పార్క్ చేయడం వల్ల బ్యాటరీ లోపల ఉష్ణోగ్రత పెరుగుతుంది. వీలైనంత వరకు నీడ ఉన్న చోట లేదా కవర్ ఉన్న పార్కింగ్ ఏరియాలో కారును నిలపాలి. పక్కన మండే స్వభావం ఉన్న వస్తువులు లేకుండా చూసుకోవాలి.
4. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను మర్చిపోవద్దు: ఈవీలు చాలా వరకు సాఫ్ట్‌వేర్ ఆధారంగా పనిచేస్తాయి. కంపెనీలు పంపే ప్రతి సాఫ్ట్‌వేర్ అప్డేట్లో థర్మల్ మేనేజ్మెంట్ మరియు బ్యాటరీ సేఫ్టీకి సంబంధించిన మార్పులు ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చు.
5. హెచ్చరిక సంకేతాలను గమనించండి: డ్యాష్‌బోర్డ్ పై ఏదైనా ఎర్రర్ మెసేజ్ వచ్చినా, కారు నుంచి వింత వాసన లేదా పొగ వస్తున్నా అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే కారు ఆపి అందరూ కిందకు దిగిపోవాలి. ఏదైనా అనుమానం వస్తే టెక్నీషియన్ సాయం తీసుకోవాలి తప్ప, మీరే ప్రయోగాలు చేయకండి.