Ferrari : 530 కిమీ రేంజ్, బుల్లెట్ లాంటి స్పీడ్‌.. ఫెరారీ తొలి సూపర్ ఎలక్ట్రిక్ కార్ లూసే వచ్చేసింది

ఫెరారీ తొలి సూపర్ ఎలక్ట్రిక్ కార్ లూసే వచ్చేసింది

Update: 2026-05-27 11:26 GMT

Ferrari : ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ, రేసింగ్ స్పోర్ట్స్ కార్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచే ఇటాలియన్ కార్ల దిగ్గజం ఫెరారీ ఆటోమొబైల్ రంగాన్ని షేక్ చేసే సరికొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది. కంపెనీ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోయే విధంగా తన మొట్టమొదటి 100 శాతం ప్యూర్ ఎలక్ట్రిక్ సూపర్ కార్ ఫెరారీ లూసే‎ను ఇటలీలోని రోమ్ నగరంలో అత్యంత వైభవంగా ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పటివరకు పెట్రోల్ ఇంజన్ల గాండ్రింపులు, హైబ్రిడ్ మోడళ్లతో మార్కెట్‌ను రూల్ చేసిన ఫెరారీ.. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తూ ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో కూడా తన జెండా పాతేందుకు సిద్ధమైంది. ఈ రాకెట్ ఈవీ కారులో అమర్చిన అల్ట్రా మోడ్రన్ టెక్నాలజీ ఫీచర్లు చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగరాల్సిందే.

ఈ సరికొత్త ఫెరారీ లూసే కారును కంపెనీ ప్రత్యేకంగా రూపొందించిన ఈవీ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించింది. ఇందులో ఏకంగా నాలుగు పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్లను ఉపయోగించారు. అంటే కారులోని నాలుగు చక్రాలకు విడివిడిగా నాలుగు మోటార్లు పవర్‌ను అందిస్తాయి. ఈ సూపర్ సెటప్ అంతా కలిసి అక్షరాలా 1,050 హార్స్‌పవర్ (hp) లాంటి నమ్మశక్యం కాని రాక్షస శక్తిని జనరేట్ చేస్తుంది. స్పీడ్ విషయానికి వస్తే ఇది ప్యూర్ బుల్లెట్‌లా దూసుకెళ్తుంది. కారు స్టార్ట్ చేసిన కేవలం 2.5 సెకన్లలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే కేవలం 6.8 సెకన్లలోనే 200 కిమీ స్పీడ్‌కు చేరుకుంటుంది. దీని టాప్ స్పీడు గంటకు 310 కిలోమీటర్లకంటే ఎక్కువ కావడం విశేషం.

ఎలక్ట్రిక్ కార్ల అనగానే అందరికీ గుర్తొచ్చే ప్రధాన సమస్య రేంజ్, ఛార్జింగ్ టైమ్. అయితే ఫెరారీ లూసే ఈ సమస్యకు పర్‌ఫెక్ట్ సమాధానం ఇచ్చింది. ఈ సూపర్ కారులో 122kWh సామర్థ్యం గల భారీ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీనివల్ల ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 530 కిలోమీటర్లకంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, ఇందులో లేటెస్ట్ 800V ఛార్జింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. దీని సహాయంతో 350kW డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే 70kWh వరకు బ్యాటరీని చాలా ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. లాంగ్ జర్నీలు చేసేటప్పుడు ఛార్జింగ్ టెన్షన్ అస్సలు ఉండదు.

డిజైన్ పరంగా కూడా ఫెరారీ లూసే సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇది ఫెరారీ బ్రాండ్ నుంచి వస్తున్న మొట్టమొదటి ఆల్-వీల్ డ్రైవ్, ఫోర్-వీల్ స్టీరింగ్ ఎలక్ట్రిక్ కారు. సాధారణంగా ఫెరారీ కార్లు రెండు సీట్లతో వస్తాయి, కానీ లూసే మోడల్‌ను 4 డోర్లు, 5 సీట్ల లేఅవుట్‌తో ఫ్యామిలీ అంతా కూర్చునేలా విశాలంగా డిజైన్ చేశారు. ఈ కారు లుక్, ఇంటీరియర్‌ను మరింత క్లాస్‌గా మార్చడం కోసం యాపిల్ మాజీ డిజైన్ హెడ్ జానీ ఐవ్, ప్రముఖ డిజైనర్ మార్క్ న్యూసన్‌లకు చెందిన లవ్‌ఫ్రమ్ టీమ్‌తో కలిసి ఫెరారీ పనిచేసింది. కారు లోపల అధునాతన ఓఎల్ఈడీ డిస్‌ప్లేలు, ఫిజికల్ కంట్రోల్ బటన్స్, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే 21 స్పీకర్ల ప్రీమియం ఆడియో సిస్టమ్‌ను అమర్చారు.

ఈ అద్భుతమైన ఈవీ లాంచ్ సందర్భంగా ఫెరారీ సీఈఓ మాట్లాడుతూ.. లూసే అనేది కేవలం ఒక ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదని, ఇది ఫెరారీ బ్రాండ్‌లో ఒక సరికొత్త బంగారు శకానికి ఆరంభమని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో సూపర్ కార్ల ప్రపంచం ఏ దిశగా ప్రయాణించబోతుందో ఈ కారు ముందే చూపిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వేగం, లగ్జరీ, పర్యావరణ స్పృహ కలబోసిన ఈ కారు సూపర్ కార్ మార్కెట్లో గేమ్ ఛేంజర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News