Harley-Davidson X440 : బైక్ లవర్స్‌కు షాక్.. ఇండియాలో ప్రియమైన హార్లే-డేవిడ్‌సన్ X440 బైక్ ధరల పెంపు
ఇండియాలో ప్రియమైన హార్లే-డేవిడ్‌సన్ X440 బైక్ ధరల పెంపు
Harley-Davidson X440 : భారతీయ టూవీలర్ మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన ప్రీమియం రోడ్‌స్టర్ బైక్ హార్లే-డేవిడ్‌సన్ X440 ధరలను కంపెనీ పెంచేసింది. ప్రముఖ అమెరికన్ క్రూజర్ బైక్ తయారీ సంస్థ అయిన హార్లే.. తన X440 బైక్ లైనప్‌లోని వివిధ వేరియంట్లపై రూ.1,000 నుంచి రూ.5,000 వరకు అదనపు భారాన్ని మోపింది. ఈ ధరల పెంపు Vivid, S, T అనే మూడు వేరియంట్లపై వర్తిస్తుంది. అయితే బైక్‌లో ఎటువంటి కొత్త ఫీచర్లు లేదా మెకానికల్ మార్పులు చేయకుండానే ధరలను పెంచడం గమనార్హం. దీనివల్ల ఈ బైక్ కొనాలనుకునే వారు ఇప్పుడు కాస్త అదనపు బడ్జెట్ సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.
హీరో మోటోకార్ప్ భాగస్వామ్యంతో తయారీ
భారతదేశంలో హార్లే-డేవిడ్‌సన్ బైకుల తయారీ, అమ్మకాలు దేశీయ దిగ్గజం హీరో మోటోకార్ప్ భాగస్వామ్యంతో జరుగుతున్నాయి. మన దేశంలో హార్లే బైకులకు సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్, మర్చండైజ్ నెట్‌వర్క్‌ను హీరో సంస్థే పూర్తిగా పర్యవేక్షిస్తుంది. ఈ క్రమంలోనే X440లో అత్యంత చౌకైన బేస్ మోడల్ అయిన వివిడ్ వేరియంట్ ధరపై రూ.1,000 పెంచారు. గతంలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.2.35 లక్షలుగా ఉండగా.. ఇప్పుడు అది రూ.2.36 లక్షలకు చేరింది.
మిడ్ అండ్ టాప్ వేరియంట్ల లేటెస్ట్ రేట్లు
ఈ బైక్ యొక్క మిడ్-వేరియంట్ అయిన X440 S మోడల్ ధరను కంపెనీ ఏకంగా రూ.4,000 మేర పెంచింది. దీనితో గతంలో రూ.2.55 లక్షలుగా ఉన్న ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ.2.59 లక్షలకు పెరిగింది. ఇకపోతే ఈ లైనప్‌లోనే అత్యంత ఖరీదైన టాప్ వేరియంట్ X440 T పై అత్యధికంగా రూ.5,000 పెంచారు. దీనివల్ల రూ.2.79 లక్షలుగా ఉన్న దీని పాత ధర కాస్తా.. ఇప్పుడు ఏకంగా రూ.2.84 లక్షల (ఎక్స్-షోరూమ్) రికార్డు స్థాయికి చేరుకుంది. గత ఏడాది ఈ బైక్ భారత మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత ధరలను పెంచడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఇంజిన్, పవర్‌ఫుల్ ఫీచర్లు
ధరలు పెరిగినప్పటికీ బైక్ ఇంజిన్ సామర్థ్యంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో మునుపటిలాగే పవర్‌ఫుల్ 440cc సింగిల్-సిలిండర్, ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 26.6 bhp పవర్, 38 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే రైడింగ్‌ను సులభతరం చేయడానికి దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జతచేశారు. లాంగ్ రైడ్స్ వెళ్లేవారికి, క్రూజర్ బైక్ లవర్స్‌కు ఈ బైక్ అద్భుతమైన రైడింగ్ ఫీలింగ్‌ను ఇస్తుంది.
పోటీదారులతో పెరిగిన ధరల వ్యత్యాసం
తాజా ధరల పెంపు తర్వాత హార్లే-డేవిడ్‌సన్ X440 T మోడల్.. తన సెగ్మెంట్‌లోని ఇతర పాపులర్ బైకులతో పోలిస్తే మరింత ఖరీదైనదిగా మారిపోయింది. ఈ బైక్‌కు గట్టి పోటీనిస్తున్న ట్రయంఫ్ 400 సిరీస్ బైక్ ప్రారంభ ధర సుమారు రూ.2.53 లక్షలుగా ఉంది. అలాగే హోండా సీబీ350 ఆర్‌ఎస్ ధర సుమారు రూ.1.98 లక్షలుగా, మిడిల్ క్లాస్ యువత కలల బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ప్రారంభ ధర కేవలం రూ.1.86 లక్షలుగా ఉన్నాయి. ఈ పోటీదారులతో పోలిస్తే హార్లే X440 టాప్ మోడల్ ధర ఇప్పుడు చాలా ఎక్కువగా ఉండటం మార్కెట్ అమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.