Hero MotoCorp: ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లో హీరో సంచలనం.. 2027లో తొలి ఈ-బైక్ లాంచ్
2027లో తొలి ఈ-బైక్ లాంచ్
Hero MotoCorp: భారతీయ ద్విచక్ర వాహన రంగంలో అతిపెద్ద కంపెనీ అయిన హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగాన్ని మరింత విస్తరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం తన విడా బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్న కంపెనీ, 2027 నాటికి తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. ఈ నిర్ణయంతో భారత ఇ-బైక్ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్, రివోల్ట్, అల్ట్రావైలైట్ వంటి కంపెనీలకు గట్టి పోటీ ఎదురుకానుంది.
UBEX , VXZ అనే రెండు నూతన ప్లాట్‌ఫామ్‌లు
హీరో తీసుకురాబోతున్న ఎలక్ట్రిక్ బైక్‌లు పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్‌లపై రూపుదిద్దుకోనున్నాయి. కంపెనీ వీటికోసం UBEX, VXZ అనే కోడ్‌నేమ్‌లతో రెండు ప్లాట్‌ఫామ్‌లను సిద్ధం చేస్తోంది. ఇవి కేవలం స్కూటర్ ప్లాట్‌ఫామ్‌కు పెద్ద చక్రాలు వేసి బైక్‌గా మార్చడం కాకుండా, పూర్తిగా మోటార్‌సైకిల్ అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేసిన ప్రత్యేక వేదికలు. EICMA 2025లో హీరో ఈ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించిన కాన్సెప్ట్‌లను తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది.
స్ట్రీట్ రైడింగ్, అడ్వెంచర్ ఫోకస్డ్ మోడళ్లు
UBEX ప్లాట్‌ఫామ్ ఆధారంగా రోజువారీ నగర ప్రయాణాలకు, సిటీ రైడింగ్‌కు అనుకూలమైన స్ట్రీట్-నేకెడ్ ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేస్తున్నారు. ఇక VXZ ప్లాట్‌ఫామ్‌పై మరింత పవర్‌ఫుల్, లాంగ్ రేంజ్ అందించే అడ్వెంచర్ తరహా ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందిస్తున్నారు. VXZ ప్లాట్‌ఫామ్‌ను ప్రముఖ అమెరికన్ ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ జీరో మోటార్‌సైకిల్స్‌తో కలిసి హీరో వికసింపజేస్తోంది. ఈ VXZ ఆధారిత డిజైన్‌కు సంబంధించిన పేటెంట్లను ఇప్పటికే భారతదేశంలో హీరో నమోదు చేసుకుంది.
అత్యుత్తమ పెర్ఫార్మెన్స్, రేంజ్ పైనే ప్రధాన దృష్టి
హీరో తన Vida స్కూటర్ల తయారీలో పొందిన అనుభవాన్ని ఈ కొత్త బైక్‌ల రూపకల్పనలో ఉపయోగిస్తోంది. బైక్ లవర్స్ కోరికల మేరకు వేగం, పికప్, కొండ ప్రాంతాలు లేదా ఎత్తుపల్లాల బాటలలో సులభంగా ప్రయాణించే సామర్థ్యం, ఎక్కువ రేంజ్ లభించేలా బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ను డిజైన్ చేస్తున్నారు. భారతదేశంలో ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతున్న కొద్దీ ఎలక్ట్రిక్ బైక్‌లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుందని, దానిని అందుకోవడానికి తాము ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా భారీగా పెంచబోతున్నామని హీరో యాజమాన్యం వెల్లడించింది.