Bike Sales: జులై నెలలో భారత టూ వీలర్ మార్కెట్ రికార్డు స్థాయిలో దూసుకెళ్లింది. కస్టమర్లు షోరూమ్‌లకు క్యూ కట్టడంతో బైక్‌ల విక్రయాలు ఏకంగా 20 శాతానికి పైగా పెరిగాయి. ఎప్పటిలాగే హీరో స్ప్లెండర్ తన రాజసాన్ని చాటుకుంటూ మొదటి స్థానంలో నిలవగా, అపాచీ, బుల్లెట్ అమ్మకాల్లో దుమ్మురేపాయి. భారతీయ బైక్ లవర్స్ మనసుల్లో హీరో స్ప్లెండర్ స్థానం చెక్కుచెదరలేదని మరోసారి నిరూపితమైంది. జులై నెలలో ఏకంగా 3,35,346 యూనిట్ల స్ప్లెండర్ బైక్‌లు అమ్ముడై అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాయి. గతేడాది జులైలో జరిగిన 2,46,715 యూనిట్ల విక్రయాలతో పోలిస్తే ఇది దాదాపు 36 శాతం వృద్ధి కావడం విశేషం. మిడిల్ క్లాస్ వాహనదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ హోండా షైన్ 1,91,950 యూనిట్ల సేల్స్‌తో రెండో స్థానాన్ని పటిష్టం చేసుకుంది. షైన్ అమ్మకాలు కూడా వార్షికంగా 20 శాతానికి పైగా పుంజుకున్నాయి.

పడుతున్న పల్సర్.. జోరు పెంచిన అపాచీ

యువతకు ఎంతో ఇష్టమైన బజాజ్ పల్సర్ విక్రయాల్లో ఈసారి కాస్త నెమ్మదనం కనిపించింది. 66,156 యూనిట్ల అమ్మకాలతో పల్సర్ మూడో స్థానానికి పడిపోయింది. గతేడాదితో పోలిస్తే పల్సర్ సేల్స్ 17 శాతం మేర తగ్గడం గమనార్హం. కంపెనీ తన పల్సర్ శ్రేణిని అప్‌డేట్ చేస్తుండటమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. మరోవైపు టీవీఎస్ అపాచీ మాత్రం అమ్మకాల్లో ఊచకోత కోసింది. ఏకంగా 58 శాతం వృద్ధితో 59,404 బైక్‌లను విక్రయించి నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ రీసౌండింగ్ హిట్.. పడిపోయిన హెచ్‌ఎఫ్ డిలక్స్

మిడ్‌సైజ్ బైక్ సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఆధిపత్యాన్ని మళ్లీ చాటుకుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్స్ 39,197 యూనిట్లు అమ్ముడవగా, దాదాపు 48 శాతం పెరుగుదల నమోదైంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఏకంగా 65.61 శాతం విక్రయాల వృద్ధితో టాప్-10 చార్ట్‌లో అత్యంత వేగంగా పెరిగిన బైక్‌గా నిలిచింది. ఇటు టీవీఎస్ రైడర్ 39 శాతం గ్రోత్ సాధించగా, హీరో హెచ్‌ఎఫ్ డిలక్స్ విక్రయాలు మాత్రం 21 శాతం తగ్గి 55,978 యూనిట్లకు పడిపోయాయి. బజాజ్ ప్లాటినా అమ్మకాలు కూడా కొంత మేర తగ్గుముఖం పట్టాయి.

మొత్తం విక్రయాల్లో కొత్త రికార్డులు

జులై నెలలో దేశీయ మార్కెట్‌లో మొత్తంగా 10.74 లక్షలకు పైగా మోటార్ సైకిళ్లు అమ్ముడయ్యాయి. గతేడాది నమోదైన 8.90 లక్షల విక్రయాలతో పోలిస్తే ఇది 20.75 శాతం ఎక్కువ. ఎగుమతులు కూడా 29.82 శాతం పెరిగి 4.80 లక్షల యూనిట్లకు చేరాయి. దేశీయ సేల్స్, ఎగుమతులు రెండూ కలిపి జులైలో ఏకంగా 15,54,809 బైక్‌ల విక్రయాలు జరిగాయి. పండుగల సీజన్ ముందే ఆటోమొబైల్ రంగానికి ఈ స్థాయిలో కొనుగోళ్లు పెరగడం పరిశ్రమకు కొండంత ఉత్సాహాన్నిస్తోంది.

Tags: