Maruti Suzuki Fronx : మారుతి సుజుకి ఫ్రాంక్స్ సరికొత్త రికార్డు.. 5 లక్షల మార్కును దాటిన తొలి నెక్సా కారు ఇదే
5 లక్షల మార్కును దాటిన తొలి నెక్సా కారు ఇదే
Maruti Suzuki Fronx : భారతదేశపు నంబర్ వన్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకికి మే 2026 నెల వ్యాపార పరంగా అద్భుతంగా కలిసివచ్చింది. ఈ ఒక్క నెలలోనే కంపెనీ ఏటా 40 శాతం వృద్ధితో రికార్డు స్థాయిలో మొత్తం 1,90,337 వాహనాలను విక్రయించింది. ఇందులో మరీ ముఖ్యంగా యూటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) సెగ్మెంట్‌లో అమ్మకాలు భారీగా పెరిగాయి. మారుతి సంస్థ గతేడాదితో పోలిస్తే 44 శాతం వృద్ధితో కేవలం మే నెలలోనే 79,267 ఎస్‌యూవీ కార్లను అమ్మేసింది. మారుతి సాధించిన ఈ రికార్డు స్థాయి అమ్మకాలలో ఆ సంస్థకు చెందిన పాపులర్ మోడల్ ఫ్రాంక్స్ అత్యంత కీలక పాత్ర పోషించి, బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది.
5 లక్షల మార్కును దాటిన తొలి నెక్సా కారు
2023లో మార్కెట్లోకి విడుదలైన మారుతి సుజుకి ఫ్రాంక్స్, మే 2026 నాటికి భారత ఆటోమొబైల్ చరిత్రలో ఒక అరుదైన మైలురాయిని అందుకుంది. కంపెనీ ప్రీమియం డీలర్‌షిప్ నెట్‌వర్క్ అయిన నెక్సా ద్వారా అమ్ముడవుతున్న కార్లలో 5 లక్షల యూనిట్ల అమ్మకాల మార్కును దాటిన మొట్టమొదటి కారుగా ఫ్రాంక్స్ నిలిచింది. మే 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 5,12,829 ఫ్రాంక్స్ కార్లు అమ్ముడయ్యాయి. భారతదేశంలో మారుతి సుజుకి విక్రయించిన మొత్తం 22.80 లక్షల ఎస్‌యూవీ వాహనాలలో కేవలం ఫ్రాంక్స్ కారు వాటానే దాదాపు 22 శాతంగా ఉండటం విశేషం.
6 నెలల్లోనే లక్ష కార్ల అమ్మకం
ఫ్రాంక్స్ కారు సాధించిన ఈ విజయ ప్రస్థానంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ కారు తన చివరి లక్ష యూనిట్ల అమ్మకాలను కేవలం 6 నెలల స్వల్ప వ్యవధిలోనే పూర్తి చేసుకుంది. మార్కెట్లో దాదాపు 22 రకాల విభిన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్స్ నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ, కస్టమర్లలో ఫ్రాంక్స్ కారుకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. మే 2026 లోనే ఈ కారు 20,686 యూనిట్ల మేర అమ్ముడైంది. ఈ కారు నెలవారీ అమ్మకాలు 20 వేల మార్కును దాటడం ఇది మూడోసారి. అంతకుముందు ఫిబ్రవరి 2025లో 21,461 యూనిట్లు, డిసెంబర్ 2025లో 20,706 యూనిట్ల చొప్పున అమ్ముడయ్యాయి.
అద్భుతమైన మైలేజ్, వేరియంట్ల వివరాలు
మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు మొత్తం 5 ప్రధాన మోడళ్లలో (సిగ్మా, డెల్టా, డెల్టా ప్లస్, జీటా, ఆల్ఫా) 14 విభిన్న వేరియంట్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఇందులో 9 మాన్యువల్, 4 ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను కంపెనీ అందిస్తోంది. పెట్రోల్ ఇంజన్ కారు మార్కెట్లోకి వచ్చిన మూడు నెలలకే మారుతి దీని సిఎన్‌జీ వెర్షన్‌ను కూడా లాంచ్ చేసింది. సిఎన్‌జీ మోడల్ ఎంట్రీతో ఈ కారు అమ్మకాలు ఊపందుకున్నాయి. ఈ సిఎన్‌జీ కారు కేజీ గ్యాస్‌కు ఏకంగా 28.51 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజ్ ఇస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.
ధరల వివరాలు ఇవే
ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధరల ప్రకారం.. మారుతి ఫ్రాంక్స్ బేస్ వేరియంట్ అయిన సిగ్మా ప్రారంభ ధర రూ.6.85 లక్షలుగా ఉంది. ఇక అన్ని హంగులతో కూడిన దీని టాప్ ఎండ్ మోడల్ ఆల్ఫా టర్బో ఏటీ ధర రూ. 11.98 లక్షల వరకు పలుకుతోంది. తక్కువ ధర, అదిరిపోయే లుక్స్, లీటరుకు భారీ మైలేజ్ ఇవ్వడం వల్లే భారతీయ మధ్యతరగతి కుటుంబాల మొదటి ఎంపికగా ఫ్రాంక్స్ కారు నిలుస్తోంది.