Holi Car Care : హోలీ రంగుల నుంచి మీ కారును కాపాడుకోండి.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే చాలు

ఈ చిన్న టిప్స్ పాటిస్తే చాలు

Update: 2026-03-03 09:15 GMT

Holi Car Care : రంగుల పండుగ హోలీ వచ్చేసింది. ఊరూవాడా చిన్నా పెద్దా తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపే సమయం ఇది. అయితే ఈ సందడిలో మనం ప్రాణప్రదంగా చూసుకునే మన కారు గురించి కూడా కాస్త ఆలోచించాలి. మన మీద పడ్డ రంగులు స్నానం చేస్తే పోతాయి కానీ, కారు పెయింట్‌పై పడ్డ జిడ్డు రంగులు, కెమికల్స్ మాత్రం కారు రూపాన్నే మార్చేస్తాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే హోలీ తర్వాత మీ కారు వెలవెలబోయే అవకాశం ఉంది.

ప్రస్తుతం మార్కెట్లో దొరికే రంగుల్లో మెటల్ కణాలు, ఆసిడ్లు, సింథటిక్ డైలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇవి ఎండలో కారు పెయింట్‌తో కెమికల్ రియాక్షన్ జరిపి, పెయింట్‌ను పాడు చేస్తాయి. ముఖ్యంగా నీళ్లు, రంగులు కలిసినప్పుడు కారు మెటల్ భాగాలకు తుప్పు పట్టే ప్రమాదం కూడా ఉంది. కొన్నిసార్లు హెర్బల్ రంగులు అని చెప్పేవి కూడా కారు మూలల్లో ఇరుక్కుపోయి, ఎంత కడిగినా వదలవు. అందుకే హోలీ సంబరాలు మొదలవ్వకముందే కారుకు ఒక కవచం ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం.

హోలీకి ముందే మీరు చేయాల్సిన పని ఏమిటంటే.. కారుకు మంచి క్వాలిటీ వాక్స్ పాలిష్ లేదా పెయింట్ సీలెంట్ కోటింగ్ వేయించండి. ఇది కారు పెయింట్‌పై ఒక రక్షణ పొరలా పనిచేస్తుంది, దీనివల్ల రంగులు పడ్డా అవి లోపలికి ఇంకకుండా సులభంగా వదిలిపోతాయి. వీలైతే హోలీ రోజున కారును బయట పార్క్ చేయకుండా, గ్యారేజీలో లేదా కారు కవర్‌తో పూర్తిగా కప్పి ఉంచండి. డోర్ హ్యాండిల్స్, సైడ్ మిర్రర్స్ మీద లైట్‌గా సిలికాన్ స్ప్రే చేస్తే రంగులు అంటుకోవు.

పండుగ అయిపోయిన తర్వాత కారును శుభ్రం చేసేటప్పుడు అస్సలు కంగారు పడకండి. రంగులు పడ్డాయని గట్టిగా పెట్టి రుద్దితే పెయింట్‌పై గీతలు పడతాయి. ముందుగా మామూలు నీళ్లతో కారును పూర్తిగా తడపండి, దీనివల్ల పైన ఉన్న పొడి రంగు కొట్టుకుపోతుంది. ఆ తర్వాత మంచి కారు షాంపూ, మెత్తటి మైక్రోఫైబర్ క్లాత్ వాడి సున్నితంగా తుడవండి. కారు టైర్లు, కింద భాగం కూడా బాగా కడగాలి, ఎందుకంటే అక్కడ రంగు నీళ్లు నిల్వ ఉంటే తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. చివరగా కారును ఆరబెట్టి మళ్ళీ ఒకసారి పాలిష్ వేస్తే మీ కారు కొత్తదానిలా మెరిసిపోతుంది.

Tags:    

Similar News