Honda Activa 125 vs TVS Jupiter 125 : హోండా యాక్టివా vs టీవీఎస్ జూపిటర్.. అసలైన స్కూటర్ కింగ్ ఎవరు?
అసలైన స్కూటర్ కింగ్ ఎవరు?
Honda Activa 125 vs TVS Jupiter 125 : మధ్యతరగతి కుటుంబాలలో టూవీలర్ కొనాలి అనుకుంటే మొదట గుర్తొచ్చేది స్కూటర్లే. ఆఫీసులకు వెళ్లాలన్నా, ఇంట్లోకి నిత్యావసర వస్తువులు తేవాలన్నా స్కూటర్ ఇచ్చే కంఫర్ట్ వేరు. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో 125సీసీ స్కూటర్ల సెగ్మెంట్‌లో విపరీతమైన పోటీ నడుస్తోంది. ఈ రేసులో అందరికంటే ముందు వరుసలో ఉండే రెండు మోడళ్లు హోండా యాక్టివా 125, టీవీఎస్ జూపిటర్ 125. కొత్తగా స్కూటర్ కొనాలనుకునే చాలా మంది ఈ రెండింటిలో ఏది తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. మీ బడ్జెట్, అవసరాలకు ఏది కరెక్టో క్లియర్‌గా చూద్దాం.
ధరల విషయంలో ఏది బెస్ట్?
ఏదైనా కారు లేదా బైక్ కొనేటప్పుడు మనం చూసే మొదటి విషయం బడ్జెట్. ధర విషయానికి వస్తే టీవీఎస్ జూపిటర్ 125 కాస్త తక్కువ ధరకే లభిస్తూ కస్టమర్లకు భారీ ఊరటనిస్తోంది. దీని ప్రారంభ ధర మార్కెట్లో సుమారు రూ.75,000 నుంచిప్రారంభమై టాప్ వేరియంట్ రూ.87,000 వరకు ఉంటుంది. అదే సమయంలో హోండా బ్రాండ్ ఇమేజ్ ఉన్న యాక్టివా 125 కాస్త ఖరీదైనదిగా చెప్పవచ్చు. దీని ప్రారంభ ధర సుమారు రూ.91,000 ఆ పైన ఉంటుంది. బడ్జెట్ తక్కువగా ఉండి మంచి స్కూటర్ కావాలనుకునే వారికి జూపిటర్ ఒక బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు.
ఇంజిన్ పవర్ అండ్ పర్ఫార్మెన్స్
డైలీ యూజ్ కోసం డిజైన్ చేసిన ఈ రెండు స్కూటర్ల ఇంజిన్ పవర్స్ దాదాపు ఒకేలా ఉంటాయి. హోండా యాక్టివా 125 మోడల్‌లో 123.92 సీసీ ఇంజిన్ వస్తుంది. ఇది 8.3 హార్స్‌పవర్ (HP) శక్తిని జనరేట్ చేస్తుంది. మరోవైపు టీవీఎస్ జూపిటర్ 125 మోడల్‌లో 124.8 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 8.4 హార్స్‌పవర్ శక్తిని ఇస్తుంది. పవర్ పరంగా చూస్తే జూపిటర్ కొద్దిగా ముందంజలో ఉన్నట్లు అనిపించినా.. రోడ్డుపై పర్ఫార్మెన్స్ విషయంలో రెండింటి మధ్య పెద్దగా తేడా తెలియదు. ఈ రెండు స్కూటర్లలో సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉండటం వల్ల సిటీ ట్రాఫిక్‌లో వీటిని నడపడం చాలా సులభం.
మైలేజ్ లెక్కల్లో హోండా మార్క్
భారతీయులకు స్కూటర్ కొనేటప్పుడు మైలేజ్ అనేది అత్యంత కీలకమైన అంశం. ఈ విషయంలో హోండా యాక్టివా 125 కాస్త మెరుగైన ప్రదర్శన ఇస్తుంది. కంపెనీ క్లెయిమ్ ప్రకారం యాక్టివా 125 లీటరుకు సుమారు 60 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. అదే సమయంలో టీవీఎస్ జూపిటర్ 125 లీటరుకు దాదాపు 57 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే నిజమైన మైలేజ్ అనేది ఎప్పుడూ రోడ్డు కండిషన్, ట్రాఫిక్, మనం బైక్ నడిపే స్టైల్ మీద ఆధారపడి మారుతుందని రైడర్స్ గమనించాలి.
ఫీచర్లు, కంఫర్ట్ లో పోటీ
ఫీచర్ల విషయానికి వస్తే టీవీఎస్ జూపిటర్ 125 హోండాపై పైచేయి సాధించింది. జూపిటర్‌లో రైడర్ల కోసం స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీ, యూఎస్‌బీ మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ , ఈ సెగ్మెంట్‌లోనే అత్యంత పెద్దదైన 33 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది. ఇందులో రెండు హెల్మెట్లు ఈజీగా పెట్టేయొచ్చు. ఇక హోండా యాక్టివా 125 విషయానికి వస్తే.. ఇందులో ఎల్‌ఈడీ లైటింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సిగ్నల్స్ పడినప్పుడు పెట్రోల్ ఆదా చేసే ఐడల్ స్టాప్ సిస్టమ్ వంటి నమ్మకమైన ఫీచర్లు ఉన్నాయి.
చివరగా అసలైన స్కూటర్ కింగ్ ఎవరు?
ఓవరాల్‌గా చూసుకుంటే.. మీకు మార్కెట్లో మంచి రీసేల్ వాల్యూ, తిరుగులేని బ్రాండ్ నమ్మకం, కాస్త ఎక్కువ మైలేజ్ కావాలనుకుంటే హోండా యాక్టివా 125 వైపు వెళ్లడం మంచిది. అలా కాకుండా తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ అధునాతన ఫీచర్లు, మొబైల్ ఛార్జింగ్ సపోర్ట్, మార్కెట్లోనే భారీ స్టోరేజ్ స్పేస్ కావాలనుకుంటే టీవీఎస్ జూపిటర్ 125 మీకు పర్ఫెక్ట్ పార్ట్‌నర్ అవుతుంది. మీ ప్రాధాన్యతలను బట్టి ఈ రెండింటిలో బెస్ట్ స్కూటర్‌ను ఎంచుకోండి.