E-Clutch Bike : క్లచ్ లేకుండానే స్పోర్ట్స్ బైక్ రైడ్.. మార్కెట్లోకి లేటెస్ట్ టెక్నాలజీ
మార్కెట్లోకి లేటెస్ట్ టెక్నాలజీ;
E-Clutch Bike : బైక్ రైడింగ్ అంటే ఇష్టమైతే, మిడ్-సెగ్మెంట్లో ఒక పవర్ఫుల్ స్పోర్ట్స్ బైక్ కోసం చూస్తున్నారా అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా తన CBR650R E-క్లచ్ మోడల్ డెలివరీలను ఇప్పుడు ప్రారంభించింది. దీని ధర రూ.10.40 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్‌ను ప్రత్యేకంగా హోండా బిగ్ వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే విక్రయిస్తున్నారు. ఈ బైక్‌లో మీకు లభించే ప్రత్యేకతలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం.
ఇంజిన్ విషయానికి వస్తే.. ఈ బైక్‌లో 649సీసీ లిక్విడ్-కూల్డ్, ఇన్లైన్ 4 సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 94bhp పవర్, 63Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్, అసిస్ట్ క్లచ్ కూడా లభిస్తుంది. మీకు E-క్లచ్ ఆప్షన్ కావాలంటే అదనంగా సుమారు రూ.40,000 చెల్లించాల్సి ఉంటుంది.
హోండా E-క్లచ్ టెక్నాలజీ అంటే ఏమిటి?
హోండా E-క్లచ్ ఒక అత్యాధునిక టెక్నాలజీ . దీనిని మొదట నవంబర్ 2023లో పరిచయం చేశారు. దీనిని ఉపయోగించడం వల్ల క్లచ్ లివర్‌ను నొక్కకుండానే గేర్లను మార్చడం చాలా సులభతరం అవుతుంది. దీని ప్రయోజనాల విషయానికి వస్తే.. ఇందులో స్టార్ట్, స్టాప్, గేర్ షిఫ్ట్ క్లచ్ లివర్ లేకుండానే చేయవచ్చు. ఎందుకంటే, ఇందులో ఆటోమేటిక్ క్లచ్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. ఇందులో క్విక్‌షిఫ్టర్, మ్యాన్యువల్ క్లచ్, DCT (డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్) కూడా లభిస్తాయి. మీ అవసరాన్ని బట్టి మీరు మ్యాన్యువల్‌గా కూడా క్లచ్, గేర్లను ఉపయోగించవచ్చు. E-క్లచ్ కారణంగా బైక్ బరువు 2.8 కిలోల వరకు పెరుగుతుంది.
హార్డ్‌వేర్, సేఫ్టీ ఫీచర్లు
ఈ బైక్ హార్డ్‌వేర్, సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ముందు వైపున 310 మి.మీ. డ్యూయల్ ఫ్లోటింగ్ డిస్క్ బ్రేక్, వెనుక వైపున 240 మి.మీ. సింగిల్ డిస్క్ బ్రేక్ ఉంటాయి. మెరుగైన కంట్రోల్ సేఫ్టీ కోసం డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది. బైక్‌లో 5 అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లే ఉంటుంది. ఇది హోండా రోడ్‌సింక్ యాప్‌తో పనిచేస్తుంది. ఈ యాప్ సహాయంతో కాల్స్, మెసేజ్‌లు, నావిగేషన్ , బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి.ఈ కొత్త హోండా CBR650R E-క్లచ్ మిడ్-సెగ్మెంట్ స్పోర్ట్స్ బైక్ మార్కెట్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.