Honda City vs Hyundai Verna : సిటీ వర్సెస్ వెర్నా.. హోండా హైబ్రిడ్ మ్యాజిక్ ముందు వెర్నా టర్బో నిలుస్తుందా?
హోండా హైబ్రిడ్ మ్యాజిక్ ముందు వెర్నా టర్బో నిలుస్తుందా?
Honda City vs Hyundai Verna : భారతీయ సెడాన్ మార్కెట్లో రారాజుగా వెలుగొందుతున్న హోండా సిటీ, ఇప్పుడు మరింత శక్తివంతంగా ముస్తాబై వస్తోంది. మే 22న హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ లాంచ్ కాబోతుండటంతో కారు ప్రియుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ సరికొత్త మోడల్ తన ప్రధాన ప్రత్యర్థి అయిన హ్యుందాయ్ వెర్నాకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. హోండా తన మైలేజీ, హైబ్రిడ్ టెక్నాలజీని నమ్ముకోగా, హ్యుందాయ్ వెర్నా తన పవర్‌ఫుల్ టర్బో ఇంజిన్‌తో యువతను ఆకర్షిస్తోంది.
మైలేజీలో కింగ్ హోండా సిటీ
కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌లో అతిపెద్ద ప్లస్ పాయింట్ దాని స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ. పెట్రోల్ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో ఎక్కువ మైలేజీ కోరుకునే వారికి ఈ కారు ఒక వరప్రసాదం కానుంది. సిటీ ట్రాఫిక్‌లో కూడా అద్భుతమైన ఫ్యూయల్ ఎఫిషియన్సీని ఇచ్చేలా దీనిని రూపొందించారు. నిత్యం లాంగ్ డ్రైవ్ చేసేవారికి, తక్కువ రన్నింగ్ కాస్ట్‌తో లగ్జరీని అనుభవించాలనుకునే వారికి హోండా సిటీ మొదటి ఛాయిస్‌గా మారనుంది.
హ్యుందాయ్ వెర్నా స్పీడ్‌లో తోపు
మరోవైపు హ్యుందాయ్ వెర్నా తన టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో దూసుకెళ్తోంది. స్పోర్టీ లుక్, వేగంగా పికప్ అందుకునే సామర్థ్యం వెర్నాను యువతకు ఫేవరెట్ సెడాన్‌గా మార్చేశాయి. రోడ్డుపై వేగంగా వెళ్లాలి, ఇంజిన్ సౌండ్ అదిరిపోవాలి అనుకునే డ్రైవింగ్ ప్రియుల కోసం వెర్నా ఒక పవర్‌ఫుల్ ఆప్షన్‌గా నిలుస్తోంది. ఇంటీరియర్ విషయానికి వస్తే, పెద్ద డ్యూయల్ స్క్రీన్ సెటప్, ప్రీమియం ఆడియో సిస్టమ్, వెంట్లేటెడ్ సీట్లు వెర్నాకు హై-టెక్ రూపాన్ని ఇస్తాయి.
సేఫ్టీలో దేనికీ తీసిపోవు..
సేఫ్టీ విషయంలో రెండు కంపెనీలు అసలు తగ్గడం లేదు. హోండా, హ్యుందాయ్ రెండూ తమ కార్లలో ADAS టెక్నాలజీని అందిస్తున్నాయి. ఇందులో లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వైర్‌లెస్ ఛార్జింగ్, సన్‌రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి మోడ్రన్ ఫీచర్లు రెండు కార్లలోనూ కామన్ కావడంతో కస్టమర్లకు ఏది ఎంచుకోవాలో అన్నది పెద్ద సవాలుగా మారనుంది.
ధర, ఎంపిక ఎవరిది?
హైబ్రిడ్ టెక్నాలజీ కారణంగా హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర వెర్నా కంటే కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉందని డీలర్ల అంచనా. అయితే, లాంగ్ రన్‌లో మైలేజీ ద్వారా వచ్చే పొదుపు ఆ ధరను కవర్ చేస్తుందని హోండా భావిస్తోంది. అదే సమయంలో వెర్నా తన మోడ్రన్ డిజైన్, పవర్‌ఫుల్ ఇంజిన్, ప్రైస్ పాయింట్‌తో గట్టి పోటీ ఇవ్వనుంది. సెడాన్ సెగ్మెంట్‌లో ఈ పోరు భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త చర్చకు దారితీసింది.