Honda Elevate: భారత మిడ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ప్రకంపనలు సృష్టించేందుకు హోండా కార్స్ ఇండియా సిద్ధమైంది. రాబోయే పండుగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ అక్టోబర్ మొదటి వారంలో ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లతో వస్తున్న ఈ మోడల్ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనుంది. మిడ్ ఎస్‌యూవీ విభాగంలో క్రెటా, సియెర్రా వంటి కార్లకు పోటీగా హోండా ఎలివేట్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నూతన ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ఇంజన్ పరంగా పెద్దగా మార్పులు చేయనప్పటికీ, బయటి లుక్‌లో గణనీయమైన మార్పులు ఉండబోతున్నాయి. సరికొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త 2D హోండా లోగో, స్టైలిష్ అలాయ్ వీల్స్, ఆకట్టుకునే కొత్త కలర్ ఆప్షన్లతో పాటు ఆధునిక ఎల్ఈడీ లైటింగ్ అమర్చనున్నారు. ఓవరాల్ డిజైన్ ప్లాట్‌ఫామ్ పాతదే అయినప్పటికీ, పండుగ సీజన్ ముంగిట కార్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకునే కొత్త లుక్ సొంతం చేసుకోనుంది.

కస్టమర్లు కోరుకునే అదిరిపోయే కొత్త ఫీచర్లు

ప్రస్తుత హోండా ఎలివేట్‌లో ఇప్పటికే 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్, యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 7 అంగుళాల డిజిటల్ క్లస్టర్, సింగిల్ ప్యానెల్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కాగా, ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ వేరియంట్‌లో కస్టమర్లు చాలా కాలంగా కోరుకుంటున్న పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటి ప్రీమియం హంగులను జోడించబోతున్నారు. ఇవి కారులో ప్రయాణాన్ని మరింత విలాసవంతంగా మార్చనున్నాయి.

మారని పవర్‌ట్రెయిన్

సాంకేతిక విభాగంలో హోండా తన పాత నమ్మకమైన 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌నే కొనసాగించనుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్, సివిటి (CVT) గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. హోండా సిటీలో ఉన్న హైబ్రిడ్ టెక్నాలజీని ఈ ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌లో ప్రవేశపెట్టే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. మైలేజ్, పర్ఫార్మెన్స్ పరంగా ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న ఈ ఇంజన్ దైనందిన ప్రయాణాలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.

ధరలు ఎలా ఉండబోతున్నాయి?

ప్రస్తుతం విపణిలో ఉన్న హోండా ఎలివేట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.81 లక్షల నుంచి రూ. 16.78 లక్షల మధ్య ఉంది. నూతన ఫేస్‌లిఫ్ట్ రాకతో బేస్ వేరియంట్ ప్రారంభ ధరలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. అయితే టాప్ వేరియంట్లలో తోడవుతున్న కొత్త ఫీచర్లు, హంగుల కారణంగా ధర సుమారు రూ. 15,000 నుంచి రూ. 30,000 వరకు పెరిగే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి.

Tags: