Honda Elevate : క్రెటా, సెల్టోస్‌లకు గట్టి పోటీ.. సరికొత్త అవతారంలో వస్తున్న హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్

సరికొత్త అవతారంలో వస్తున్న హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్

Update: 2026-06-16 10:11 GMT

Honda Elevate : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీ కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి కార్లు మంచి అమ్మకాలతో దూసుకుపోతున్నాయి. వీటికి గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా తన పాపులర్ ఎస్‌యూవీ ఎలివేట్‎ను సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ నయా కారుకు సంబంధించిన టెస్టింగ్ ప్రక్రియ ఇప్పటికే భారతదేశంలో ప్రారంభమైంది.

ఇన్ కార్ న్యూస్ నివేదిక ప్రకారం.. సరికొత్త హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ కారు మొదటిసారిగా భారతీయ రోడ్లపై పబ్లిక్ టెస్టింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. టెస్టింగ్ సమయంలో కారు బాడీని పూర్తిగా కవర్‌తో కప్పి ఉంచినప్పటికీ, ఇందులో రాబోయే మార్పులపై ఆటోమొబైల్ నిపుణులు ఒక అంచనాకు వచ్చారు. కారు ఓవరాల్ బాక్సీ లుక్ పాత మోడల్ లాగే ఉన్నప్పటికీ, ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో కంపెనీ కీలకమైన కాస్మెటిక్ మార్పులను చేస్తోంది.

ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో సరికొత్త ఫ్రంట్ గ్రిల్, రీ-డిజైన్ చేసిన అగ్రెసివ్ బంపర్, సరికొత్త ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్, టెయిల్ ల్యాంప్ గ్రాఫిక్స్ ఉండబోతున్నాయి. వీటికి తోడు కారుకు మరింత స్పోర్టీ లుక్ ఇచ్చేందుకు కొత్త డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్‌ను కంపెనీ జత చేయనుంది. ఈ చిన్న చిన్న అప్‌డేట్స్ కారును రోడ్డుపై మరింత గంభీరంగా మార్చనున్నాయి. మార్కెట్లో దీని ప్రధాన పోటీదారులైన క్రెటా, సెల్టోస్‌లకు ఈ లుక్ గట్టి సవాల్ విసరడం ఖాయం.

భద్రతకు పెద్దపీట వేసే హోండా సంస్థ.. ఈసారి ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌లో సేఫ్టీ అప్‌డేట్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం హోండా అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ టెక్నాలజీ కేవలం టాప్-ఎండ్ ZX రియంట్లోనే లభిస్తోంది. అయితే కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ఈ అడాస్ ఫీచర్‌ను మిడ్-లెవల్ వేరియంట్లలో కూడా అందుబాటులోకి తీసుకురావాలని హోండా యోచిస్తోంది. దీనివల్ల తక్కువ బడ్జెట్ లోనే కస్టమర్లకు లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి.

కారు లోపలి భాగం గురించి కంపెనీ ఇంకా ఎలాంటి వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ నివేదికల ప్రకారం.. ఇందులో కొత్త కలర్ ట్రిమ్ ఆప్షన్లు, మరింత ప్రీమియం క్వాలిటీ సీట్ అపోలిస్ట్రీని అందించనున్నారు. వీటితో పాటు 10.25 ఇంచుల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ మొబైల్ చార్జర్, 6-స్పీకర్ ఆడియో సిస్టమ్, క్యాబిన్ యాంబియంట్ లైటింగ్, కనెక్ట్ కార్ టెక్నాలజీ, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈఎస్‌సీ (ESC), హిల్ స్టార్ట్ అసిస్ట్, ఏబీఎస్ వంటి ఫీచర్లు కంటిన్యూ కానున్నాయి.

ఇంజన్, మెకానికల్ విభాగంలో హోండా ఎలాంటి మార్పులు చేయడం లేదు. ప్రస్తుతం ఉన్న నమ్మకమైన 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌నే ఇందులోనూ కొనసాగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 121 బీహెచ్‌పీ పవర్‌ను, 145 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ మాన్యువల్ గేర్‌బాక్స్ , సీవీటీ ఆటోమేటిక్ ఆప్షన్లతో లభిస్తుంది. కాగా ఎలివేట్ హైబ్రిడ్ వెర్షన్ గురించి మార్కెట్లో జోరుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, హోండా దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక స్పష్టత ఇవ్వలేదు.

హోండా కంపెనీ భారతీయ మార్కెట్లో తన ఉనికిని మరింత చాటుకునేందుకు ఫైనాన్షియల్ ఇయర్ 2027లో ఒక భారీ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా దేశంలో మొత్తం 6 కొత్త మోడల్స్ లాంచ్ చేయనున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ లిస్టులో సరికొత్త హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌తో పాటు, హోండా జెడ్ఆర్-వి హైబ్రిడ్ ఎస్‌యూవీ, సరికొత్త 0 ఆల్ఫా కాన్సెప్ట్ ఆధారిత ప్యూర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కూడా ఉన్నాయి. ఈ కొత్త లాంచ్‌లతో హోండా ఇండియాలో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేయబోతోంది.

Tags:    

Similar News