Honda : క్లచ్ నొక్కకుండానే గేర్లు మార్చేయొచ్చు.. హోండా నుంచి అదిరిపోయే అడ్వెంచర్ బైక్
హోండా నుంచి అదిరిపోయే అడ్వెంచర్ బైక్
Honda : ప్రముఖ జపనీస్ వాహన తయారీ సంస్థ హోండా, భారతీయ బైక్ ప్రియుల కోసం ఒక సరికొత్త టెక్నాలజీతో కూడిన అడ్వెంచర్ టూరింగ్ బైక్‌ను లాంచ్ చేసింది. అదే హోండా NX500 E-Clutch. ఈ బైక్ ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో ఉన్న అత్యాధునిక ఈ-క్లచ్ టెక్నాలజీ వల్ల రైడర్ క్లచ్ నొక్కాల్సిన అవసరం లేకుండానే సులభంగా గేర్లు మార్చుకోవచ్చు. లాంగ్ రైడ్స్ వెళ్లేవారికి, సిటీ ట్రాఫిక్‌లో ఇబ్బంది పడేవారికి ఇది ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. హోండా తన కొత్త NX500 E-Clutch ఎక్స్-షోరూమ్ ధరను రూ.7.43 లక్షలుగా నిర్ణయించింది. ఈ బైక్ కోసం బుకింగ్స్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో ప్రారంభమయ్యాయి. అడ్వెంచర్, టెక్నాలజీని ఇష్టపడే రైడర్లను లక్ష్యంగా చేసుకుని హోండా ఈ మోడల్‌ను ప్రవేశపెట్టింది.
ఏమిటీ ఈ-క్లచ్ మ్యాజిక్?
హోండా డెవలప్ చేసిన ఈ సరికొత్త ఈ-క్లచ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్ పద్ధతిలో క్లచ్‌ను కంట్రోల్ చేస్తుంది. బైక్ స్టార్ట్ చేసేటప్పుడు, గేర్లు మార్చేటప్పుడు లేదా బైక్‌ను ఆపేటప్పుడు రైడర్ క్లచ్ లివర్‌ను వాడాల్సిన పని లేదు. సిస్టమే ఆ పనిని ఆటోమేటిక్గా పూర్తి చేస్తుంది. ఒకవేళ రైడర్‌కు మ్యాన్యువల్‌గానే క్లచ్ వాడాలని అనిపిస్తే, ఎప్పుడైనా లివర్‌ను నొక్కి పాత పద్ధతిలో బైక్‌ను నడపవచ్చు. ఇది అచ్చం ఆటోమేటిక్ కార్ లాంటి సౌకర్యాన్ని ఇస్తూనే, బైక్ రైడింగ్ ఫీల్‌ను ఏమాత్రం తగ్గించదు.
పవర్‌ఫుల్ ఇంజిన్.. అదిరిపోయే పెర్ఫార్మెన్స్
హోండా NX500 లో 471cc లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 46 bhp శక్తిని, 43 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లో, మిడ్-రేంజ్‌లో ఈ బైక్ మంచి పవర్‌ను ఇస్తుంది, కాబట్టి కొండ ప్రాంతాల్లో లేదా హైవేల మీద రైడింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది.
ఫీచర్లు, సేఫ్టీ
ఈ బైక్‌లో 5-అంగుళాల ఫుల్ కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో హోండా రోడ్‌సింక్ కనెక్టివిటీ ఉంది, దీని ద్వారా మనం మ్యాప్స్, మ్యూజిక్, కాల్ అలర్ట్స్ సులభంగా చూసుకోవచ్చు. సేఫ్టీ కోసం డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ (ABS), హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC) వంటి ఫీచర్లు ఉన్నాయి. షోవా కంపెనీకి చెందిన అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్, అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ వల్ల రాళ్ల దారుల్లో కూడా బైక్ చాలా స్థిరంగా వెళ్తుంది.