Honda: భారతదేశంలో దశాబ్దాలుగా నమ్మకానికి మారుపేరుగా నిలిచింది హోండా సంస్థ. ముఖ్యంగా సిటీ సెడాన్, ఎలివేట్ ఎస్‌యూవీలతో తన మార్కును సుస్థిరం చేసుకుంది. కొన్ని సంవత్సరాలుగా పరిమిత మోడళ్లతోనే కొనసాగుతున్న ఈ జపనీస్ బ్రాండ్, రాబోయే రోజుల్లో భారత ఆటోమొబైల్ విపణిని ఏలేందుకు బిగ్ ప్లాన్ వేసింది. ఈ దశాబ్దం చివరి నాటికి ఏకంగా 10 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. అందులో ఏడు ఎస్‌యూవీ రకానికి చెందినవే కావడం గమనార్హం. ఇప్పటికే జెడ్ఆర్-వి హైబ్రిడ్ మోడల్‌ను ఇక్కడికి తెచ్చిన సంస్థ, త్వరలోనే గ్లోబల్ విపణిలో సంచలనం సృష్టిస్తున్న సివిక్, సీఆర్-వి మోడళ్లను ప్రవేశపెట్టనుంది.

స్పోర్టీ లుక్‌లో నెక్స్ట్ జనరేషన్ హోండా సిటీ

మిడ్-సైజ్ సెడాన్ విభాగంలో రారాజుగా వెలుగొందుతున్న హోండా సిటీ 6వ జనరేషన్ మోడల్ సరికొత్త ఆకారంలో సిద్ధమవుతోంది. తేలికపాటి పిఎఫ్2 ప్లాట్‌ఫారమ్‌పై డిజైన్ చేస్తున్న ఈ కారు, మునుపటి కంటే చాలా స్పోర్టీగా, కూపే తరహాలో కనిపించనుంది. హోండా 0 సిరీస్ కాన్సెప్ట్ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ మోడల్ కేబిన్ లోపల విశాలమైన స్థలాన్ని, అత్యుత్తమ బూట్ స్పేస్‌ను అందిస్తుంది. ఇంజిన్ విషయానికి వస్తే 1.5 లీటర్ పెట్రోల్ ఆప్షన్‌తో పాటు లీటరుకు 28 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కొత్త తరం ఇ:హెచ్ఈవి హైబ్రిడ్ టెక్నాలజీని జోడించనున్నారు.

భారీ బ్యాటరీతో హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 0 ఆల్ఫా

భారత ఈవి రంగాన్ని ఏలేందుకు హోండా తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ హోండా 0 ఆల్ఫాను సిద్ధం చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే ఇది మార్కెట్‌లోకి రానుంది. అత్యంత లైట్ వెయిట్ టెక్నాలజీతో ముందస్తు డిజైన్ ఫీచర్లతో తయారవుతున్న ఈ కారులో ముందు వైపు వెలిగే ఎల్ఈడీ బార్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఎలివేట్ మోడల్ కంటే దాదాపు 100 మిమీ ఎక్కువ వీల్‌బేస్ ఉండటం వల్ల లోపల కూర్చునే వారికి లగ్జరీ అనుభూతిని ఇస్తుంది. అల్ట్రా-ఫాస్ట్ డిసి ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఈ ఈవి, క్రెటా ఎలక్ట్రిక్, టాటా సియెర్రా ఈవి మోడళ్లకు గట్టి పోటీని ఇవ్వనుంది.

మిడ్ సైజ్ ఎస్‌యూవీ, 7-సీటర్ ఫ్యామిలీ కార్ల రాక

చిన్న కార్ల విభాగంలో పట్టు సాధించేందుకు 2028 నాటికి 4-మీటర్ల కంటే తక్కువ పొడవుండే ఒక కాంపాక్ట్ ఎస్‌యూవీని తీసుకొస్తోంది. కొత్త 1.2 లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజిన్‌తో పాటు స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్ ఇందులో ఉండనుంది. టాటా నెక్సాన్, బ్రెజ్జాలకు ఇది ప్రత్యామ్నాయంగా నిలవనుంది. భారీ కుటుంబాల అవసరాలను తీర్చేందుకు 6, 7 సీటర్ల సామర్థ్యంతో మరో పెద్ద ఎస్‌యూవీని ప్లాన్ చేస్తోంది. ఇందులో కెప్టెన్ సీట్ల ఆప్షన్‌తో పాటు 1.5 లీటర్ పవర్‌ఫుల్ ఇంజిన్ అందించనున్నారు. మహీంద్రా ఎక్స్‌యూవీ 7XO, సఫారీ మోడళ్లను ఎదుర్కొనేలా దీనిని తీర్చిదిద్దుతున్నారు.

Tags: