Honda : హోండా డబుల్ ధమాకా..2026లో రోడ్లపైకి రెండు సూపర్ ఎస్‌యూవీలు
2026లో రోడ్లపైకి రెండు సూపర్ ఎస్‌యూవీలు
Honda : హోండా కార్ లవర్స్‌కు గుడ్ న్యూస్. గతేడాది తన భవిష్యత్ ప్రణాళికలను ప్రకటించిన జపాన్ వాహన దిగ్గజం హోండా మోటార్ కంపెనీ, 2030 నాటికి భారత్‌లో 10 కొత్త మోడళ్లను విడుదల చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా, ఈ 2026 సంవత్సరంలో రెండు శక్తివంతమైన ఎస్‌యూవీలను మార్కెట్లోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. తన పాపులర్ మోడల్ ఎలివేట్‌కు కొత్త హంగులు అద్దడంతో పాటు, అదిరిపోయే హైబ్రిడ్ ఫీచర్లతో ప్రీమియం ఎస్‌యూవీ ZR-Vని కూడా హోండా పరిచయం చేయనుంది.
ప్రస్తుత పోటీ మార్కెట్‌లో టాటా, హ్యుందాయ్ వంటి కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు హోండా తన అమ్ముల పొదిలోని అస్త్రాలను సిద్ధం చేసింది. ముఖ్యంగా మధ్యతరగతి, ప్రీమియం సెగ్మెంట్లను టార్గెట్ చేస్తూ ఈ రెండు కార్లను రూపొందించింది.
1. హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్
హోండా ఎలివేట్ ఇప్పటికే ఇండియన్ మార్కెట్‌లో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు దీనిని మరింత స్టైలిష్‌గా మార్చి 2026 ద్వితీయార్థంలో విడుదల చేయనున్నారు. దీని ఫ్రంట్, రియర్ డిజైన్‌లో చిన్నపాటి మార్పులు ఉండనున్నాయి. లోపల పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి లగ్జరీ ఫీచర్లు కొత్తగా చేరవచ్చు. ఇందులో పాత 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌నే కొనసాగించనున్నారు. ఇది 121 BHP పవర్ ఇస్తుంది. అడ్వాన్స్‌డ్ ADAS టెక్నాలజీ, 10.25 ఇంచుల టచ్ స్క్రీన్, 6 ఎయిర్‌బ్యాగ్‌లతో సేఫ్టీకి పెద్ద పీట వేశారు. దీని ధర సుమారు రూ. 11.50 లక్షల నుంచి రూ. 17 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చు.
2. హోండా జెడ్ఆర్-వి
హోండా నుంచి వస్తున్న అత్యంత పవర్ఫుల్ హైబ్రిడ్ ఎస్‌యూవీ ఇది. దీనిని నేరుగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయించనున్నారు. ఇందులో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవి కలిసి 184 PS పవర్, 315 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. కేవలం 7.8 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. 12-స్పీకర్ల బోస్ (Bose) ఆడియో సిస్టమ్, 8-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో ఇది లగ్జరీ కార్లకు తక్కువ కాకుండా ఉంటుంది. హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల ఇది లీటరుకు సుమారు 22-25 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది ప్రీమియం రేంజ్ కారు కావడంతో ధర రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉండవచ్చు.