Honda: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా తన అమ్మకాలను పెంచుకోవడానికి భారీ ప్రణాళికలు రచిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా మారుతి సుజుకి, టాటా, హ్యుందాయ్ వంటి కంపెనీలతో పోటీపడటంలో హోండా కొంత వెనుకబడింది. ముఖ్యంగా ఎస్‌యూవీ విభాగంలో సరైన మోడల్స్ లేకపోవడం కంపెనీకి మైనస్‌గా మారింది. ఈ లోటును పూడ్చేందుకు రాబోయే కొన్ని సంవత్సరాలలో భారత మార్కెట్లోకి ఏకంగా నాలుగు కొత్త ఎస్‌యూవీలను తీసుకురావడానికి హోండా సన్నాహాలు చేస్తోంది. ఇందులో ఒక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, ఒక హైబ్రిడ్ మోడల్ అలాగే రెండు పెట్రోల్ ఎస్‌యూవీలు ఉండటం విశేషం.

1. హోండా 0 అల్ఫా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

హోండా విడుదల చేయబోయే ఈ నూతన శ్రేణిలో మొట్టమొదటిది 0 అల్ఫా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కానుంది. గతేడాది అక్టోబర్‌లో జపాన్ మొబిలిటీ షోలో దీనికి సంబంధించిన కాన్సెప్ట్‌ను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ప్రొడక్షన్ మోడల్ డిసెంబర్ 2, 2026 నాడు భారత్‌లో అధికారికంగా ఆవిష్కరించబడే అవకాశం ఉంది. ఈ ఈవీలో ఎత్తైన రూఫ్, విశాలమైన కేబిన్, పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ గ్లాస్ రూఫ్ అలాగే ఏడీఏఎస్ భద్రతా ఫీచర్లు లభించనున్నాయి. ఇందులో 65kWh నుంచి 75kWh బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉండగా, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు.

2. హోండా సీఆర్-వీ హైబ్రిడ్

ఒకప్పుడు భారత మార్కెట్లో మంచి ప్రజాదరణ పొంది, ఆ తర్వాత 2020లో నిలిపివేయబడిన హోండా ప్రీమియం ఎస్‌యూవీ సీఆర్-వీ మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వనుంది. దీని కొత్త హైబ్రిడ్ వెర్షన్‌ను 2027 నాటికి మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఈ ప్రీమియం ఎస్‌యూవీలో 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్లు జతచేయనున్నారు. ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో రానున్న ఈ కొత్త సీఆర్-వీలో 15 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ లభించనున్నాయి.

3. హోండా సబ్‌-ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న సబ్-4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీపడేందుకు హోండా ఒక చిన్న ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది. దీనిని 2028 నాటికి లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది మార్కెట్లో మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మహింద్ర XUV 3XO మరియు కియా సోనెట్ వంటి పాపులర్ కార్లకు గట్టి పోటీ ఇస్తుంది. గతంలో విక్రయించిన WR-V స్థానంలో ఈ నూతన మోడల్ రానుంది.

4. హోండా మిడ్‌సైజ్ ఎస్‌యూవీ

2028 తర్వాత హోండా మరొక కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని తీసుకురానుంది. ఇది నేరుగా హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి మిడ్‌సైజ్ ఎస్‌యూవీలతో తలపడనుంది. ఈ మోడల్‌లో 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ లేదా హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్ అందించే ఛాన్స్ ఉంది. సరైన ధరలో అధునాతన ఫీచర్లతో ఈ కారు వస్తే, హోండా బ్రాండ్ అమ్మకాలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags: