Engine Oil : మీ వాహనంలో ఇంజన్ ఆయిల్ మంచిదా? నకిలీదా? ఈ 3 సింపుల్ ట్రిక్స్‌తో కనిపెట్టేయండి
నకిలీదా? ఈ 3 సింపుల్ ట్రిక్స్‌తో కనిపెట్టేయండి
Engine Oil : సొంతంగా కారు లేదా బైక్ ఉన్న ప్రతి ఒక్కరూ రెగ్యులర్‌గా సర్వీసింగ్ చేయిస్తూనే ఉంటారు. అయితే వాహనం సజావుగా, ఎలాంటి రిపేర్లు లేకుండా నడవాలంటే అన్నింటికంటే ముఖ్యమైనది ఇంజన్ ఆయిల్. చాలా మంది బండి నడుపుతుంటారు కానీ.. లోపల ఉన్న ఇంజన్ ఆయిల్ కండిషన్ ఎలా ఉందనే విషయంపై అస్సలు శ్రద్ధ పెట్టరు. ఇదే తరుణాన్ని ఆసరాగా చేసుకుని మార్కెట్లో నకిలీ ఇంజన్ ఆయిల్స్ మాఫియా విపరీతంగా పెరిగిపోయింది. అవసరమైన కెమికల్స్, లూబ్రికెంట్స్ లేని ఇటువంటి నాసిరకం ఆయిల్స్ వాడటం వల్ల బండి పర్ఫార్మెన్స్ క్రమంగా పడిపోతుంది. అంతేకాదు.. ఇంజన్ లోపలి భాగాలు త్వరగా అరిగిపోయి, మైలేజ్ తగ్గి.. చివరికి ఇంజన్ సీజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. మరి మీ వాహనంలో ఉన్న ఆయిల్ అసలైనదా, నకిలీదా లేదా అది పాడైపోయిందా అనేది కేవలం మూడు సులువైన పద్ధతుల్లో ఎలా గుర్తించవచ్చో తెలుసుకుందాం.
ఆయిల్ రంగు, చిక్కదనాన్ని బట్టి కనిపెట్టేయండి
ఇంజన్ ఆయిల్ క్వాలిటీని పరీక్షించడానికి అత్యంత సులువైన మార్గం.. దాని రంగు, చిక్కదనాన్ని గమనించడం. సరికొత్తగా ఉన్న అసలైన ఇంజన్ ఆయిల్ ఎప్పుడూ లేత బంగారం రంగులో లేదా అంబర్ కలర్ లో మెరుస్తూ, చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఒకవేళ మీ బండిలోని ఆయిల్ పూర్తిగా నల్లగా మారిపోయినా, చాలా చిక్కగా బురదలా తయారైనా లేదా అందులో నల్లటి డస్ట్ పార్టికల్స్ కనిపిస్తే.. అది పాడైపోయిందని, వెంటనే మార్చాలని అర్థం. మరోవైపు, మార్కెట్లో దొరికే నకిలీ ఆయిల్స్ ఒక్కోసారి నీళ్లలా చాలా పల్చగా ఉంటాయి. అలాగే ఇంజన్ ఆయిల్ నుంచి ఏదైనా మాడిపోయిన వాసన వస్తున్నా సరే అది నాణ్యత లేని నకిలీ ఆయిల్ అని ఫిక్స్ అయిపోవచ్చు.
డబ్బా ప్యాకేజింగ్, సీల్ జాగ్రత్తగా చూడండి
మెకానిక్ షాపుల్లో కొత్త ఆయిల్ డబ్బా కొనేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నకిలీల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. బ్రాండెడ్ కంపెనీల ఒరిజినల్ ప్రొడక్ట్ ప్యాకేజింగ్ చాలా నీట్‌గా, ప్రొఫెషనల్‌గా ఉంటుంది. అదే నకిలీ ఆయిల్ డబ్బాలపై ఉండే ప్రింటింగ్ కాస్త వెలసిపోయినట్టు, అక్షరాలు మసకగా ఉంటాయి. కొన్నిటిపై స్పెల్లింగ్ తప్పులు కూడా దొర్లుతుంటాయి. ప్రస్తుతం చాలా పాపులర్ బ్రాండ్ల కంపెనీలు తమ ఆయిల్ డబ్బాలపై ప్రత్యేకమైన బ్యాచ్ నంబర్ మరియు క్యూఆర్ కోడ్ ఇస్తున్నాయి. మీ మొబైల్ ద్వారా ఆ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా అది ఒరిజినల్ అవునో కాదో క్షణాల్లో తెలిసిపోతుంది. ఒకవేళ డబ్బా క్యాప్ లూజ్‌గా ఉన్నా లేదా లోపల సీల్ ముందే విరిగిపోయి ఉన్నా ఆ ఆయిల్‌ను అస్సలు కొనకండి.
మైలేజ్ తగ్గిందా? గురగుర శబ్దాలు వస్తున్నాయా?
కారు లేదా బైక్ నడుపుతున్నప్పుడు వచ్చే మార్పులను బట్టి కూడా ఇంజన్ ఆయిల్ పాడైందని గుర్తించవచ్చు. ఒకవేళ మీ వాహనం మునుపటిలా స్మూత్‌గా సాగకుండా.. ఇంజన్ నుంచి వింత వింతగా ఖటఖట లేదా గురగుర అనే శబ్దాలు వస్తుంటే అలర్ట్ అవ్వాలి. అలాగే ఇంజన్ విపరీతంగా వేడెక్కిపోవడం లేదా బండి మైలేజ్ అకస్మాత్తుగా పడిపోవడం వంటివి కూడా పాడైపోయిన ఆయిల్ లక్షణాలే. నాసిరకం ఆయిల్ వల్ల ఇంజన్ భాగాలకు సరైన లూబ్రికేషన్ అందక.. వాటి మధ్య ఘర్షణ పెరిగి బండి పికప్ తగ్గిపోతుంది. దీనివల్ల బండి నడపడం చాలా హెవీగా, భారంగా అనిపిస్తుంది.