Hyundai : హ్యుందాయ్ నుంచి అదిరిపోయే మిడ్ సైజ్ ఎస్‌యూవీ.. మారుతీకి ఇక ముచ్చెమటలే
మారుతీకి ఇక ముచ్చెమటలే
Hyundai : భారత ఆటోమొబైల్ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న హ్యుందాయ్ మోటార్ ఇండియా, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రెండు సరికొత్త ఎస్‌యూవీలను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఇందులో ఒకటి యూరప్ మార్కెట్లో బాగా పాపులర్ అయిన బేయాన్ క్రాస్‌ఓవర్ ఆధారంగా రూపొందుతున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ కాగా, రెండోది పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారైన ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఈ కొత్త మోడల్ హ్యుందాయ్ లైనప్‌లో వెన్యూ, క్రెటా మధ్య ఉన్న గ్యాప్‌ను భర్తీ చేయనుంది.
లగ్జరీ లుక్.. బాక్సీ డిజైన్
హ్యుందాయ్ బేయోన్ ఆధారిత ఈ కొత్త ఎస్‌యూవీ సుమారు 4.2 మీటర్ల పొడవుతో రానుంది. ఇది చూడటానికి ఎత్తుగా, బాక్సీ డిజైన్‌తో చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ముందు భాగంలో ఐస్ క్యూబ్ ఆకారపు ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, పైన స్టైలిష్ ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో స్ప్లిట్ హెడ్ ల్యాంప్ సెటప్ ఉంటుంది. దీనికి తోడు 16-అంగుళాల డైమండ్-కట్ అలోయ్ వీల్స్, బాడీ క్లాడింగ్, వెనుక భాగంలో కనెక్టెడ్ ఎల్ఈడీ టైల్ లైట్స్ ఈ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి.
సీఎన్‌జీ వేరియంట్‌లోనూ సంచలనం
ఈ కారులో మరో విశేషం ఏమిటంటే, 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉండి, డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో సీఎన్‌జీ (CNG) ఆప్షన్ కలిగి ఉన్న మొదటి హ్యుందాయ్ కారు ఇదే కానుంది. ఇది నేరుగా మారుతీ సుజుకీ విక్టోరిస్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. పెట్రోల్ ధరలతో ఇబ్బంది పడే వారికి, లగ్జరీతో పాటు పొదుపుగా ప్రయాణించాలనుకునే వారికి ఈ సీఎన్‌జీ వేరియంట్ ఒక వరప్రసాదంలా మారుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
అత్యాధునిక టెక్నాలజీ, ఏడీఏఎస్
లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే, హ్యుందాయ్ తన మార్కు టెక్నాలజీని ఇందులో జోడించింది. పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ క్లస్టర్, సేఫ్టీ కోసం అడాప్టివ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి. మారుతీ గ్రాండ్ విటారా, విక్టోరియా వంటి మిడ్-సైజ్ ఎస్‌యూవీల మార్కెట్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా హ్యుందాయ్ ఈ ప్లాన్ వేసింది.
పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు
ఇంజిన్ సామర్థ్యం విషయానికి వస్తే, ఇందులో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది. ఇది 114 బీహెచ్‌పీ పవర్, 144 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ లేదా సివిటి (CVT) ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ జత చేయబడుతుంది. వీటితో పాటు స్పోర్టీ డ్రైవింగ్ కోరుకునే వారి కోసం 1.5 లీటర్ టర్బో పెట్రోల్ లేదా సరికొత్త 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లను కూడా అందించే అవకాశం ఉంది. డీజిల్ లవర్స్ కోసం ప్రత్యేకంగా డీజిల్ వేరియంట్ కూడా లైన్-అప్‌లో ఉండే ఛాన్స్ ఉంది.