Hyundai Creta : సరికొత్త అవతారంలో క్రెటా..రాబోతున్న థర్డ్ జనరేషన్ మోడల్
రాబోతున్న థర్డ్ జనరేషన్ మోడల్
Hyundai Creta : భారతదేశంలో మిడ్-సైజ్ ఎస్‌యూవీ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు హ్యుందాయ్ క్రెటా. ఈ సెగ్మెంట్‌లో రారాజుగా వెలుగొందుతున్న క్రెటా, 14 మందికి పైగా గట్టి పోటీదారులను తట్టుకొని మరీ తన నంబర్ 1 స్థానాన్ని కాపాడుకుంటోంది. 2025 క్యాలెండర్ ఇయర్లో ఏకంగా 2 లక్షల యూనిట్లు అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ క్రేజ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లేందుకు హ్యుందాయ్ తన థర్డ్ జనరేషన్ క్రెటాను సిద్ధం చేస్తోంది. దక్షిణ కొరియాలో ఇప్పటికే ఈ కొత్త మోడల్ టెస్టింగ్ దశలో ఉండగా, దానికి సంబంధించిన ఆసక్తికరమైన లీకులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్రెటా సెకండ్ జనరేషన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్. ఇది 2024 జనవరిలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అయితే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా హ్యుందాయ్ ఇప్పుడు మూడవ తరం క్రెటాపై పని చేస్తోంది. తాజాగా వెలువడిన గ్రాఫిక్ రెండర్ల ప్రకారం..ఈ కొత్త క్రెటా ఐరోపాలో ప్రసిద్ధి చెందిన హ్యుందాయ్ నెక్సో డిజైన్ పోలికలతో ఉండబోతోంది. కారు ముందు భాగంలో సరికొత్త క్వాడ్ డాట్ లోగో ఉంటుంది, ఇది కారు స్టార్ట్ చేసినప్పుడు వెలుగుతుంది. దీనికి తోడు పిక్సలేటెడ్ ఎల్‌ఈడీ డీఆర్ఎల్ లు, ఐస్ క్యూబ్ స్టైల్ ఫాగ్ లాంప్స్ కారుకు ఒక ఫ్యూచరిస్టిక్ లుక్ ఇస్తాయి.
ఎక్స్ టీరియర్ పరంగా కొత్త క్రెటా ప్రస్తుత మోడల్ కంటే పెద్దదిగా, మరింత కండలు తిరిగినట్టుగా కనిపిస్తోంది. 19-అంగుళాల భారీ అలాయ్ వీల్స్, ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్, అగ్రెసివ్ బోనెట్ డిజైన్ దీనికి ప్రీమియం ఎస్‌యూవీ రూపాన్ని ఇచ్చాయి. టాటా సియెర్రా, కియా సెల్టోస్ వంటి ప్రత్యర్థులకు పోటీగా హ్యుందాయ్ దీనిని మరింత విశాలంగా రూపొందిస్తోంది. వెనుక భాగంలో కూడా కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, కొత్త స్పాయిలర్ దీనికి స్పోర్టీ లుక్ ఇస్తాయి.
కారు ఇంటీరియర్ గురించి చెప్పాలంటే..ఇది ఒక కదిలే టెక్నాలజీ హబ్‌లా ఉండబోతోంది. డ్యాష్‌బోర్డ్‌పై డ్యూయల్ 12.3-అంగుళాల స్క్రీన్లు లేదా ఏకంగా ట్రిపుల్ స్క్రీన్ సెటప్ వచ్చే అవకాశం ఉంది. వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, లెవల్-2 ADAS వంటి అత్యాధునిక రక్షణ ఫీచర్లు ఇందులో ఉంటాయి. డోర్ హ్యాండిల్స్ , విండో కంట్రోల్స్ కూడా పూర్తిగా రీ-డిజైన్ చేయబడ్డాయి. ప్రయాణీకుల సౌకర్యం కోసం కొత్త రకం హెడ్ రెస్టులు, అదిరిపోయే సౌండ్ సిస్టమ్ కూడా ఉండబోతున్నాయి.
ఇంజిన్ సామర్థ్యం విషయానికి వస్తే, హ్యుందాయ్ తన నమ్మకమైన మూడు ఇంజిన్ ఆప్షన్లను కొనసాగించనుంది. 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్లు అందుబాటులో ఉంటాయి. కస్టమర్ల ఎంపికను బట్టి 6-స్పీడ్ మాన్యువల్, సీవీటీ (CVT), 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ లేదా 7-స్పీడ్ డీసీటీ (DCT) గేర్‌బాక్స్‌లను హ్యుందాయ్ ఆఫర్ చేయనుంది. మొత్తంమీద, కొత్త తరం క్రెటా భారత మార్కెట్లోకి వస్తే ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మళ్ళీ హ్యుందాయ్ ఏకచ్ఛత్రాధిపత్యం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.