Hyundai Inster : మేడ్ ఇన్ ఇండియా.. డిజైన్ ఇన్ ఇండియా.. హ్యుందాయ్ నుంచి రాబోతున్న మినీ ఎలక్ట్రిక్ సెన్సేషన్

హ్యుందాయ్ నుంచి రాబోతున్న మినీ ఎలక్ట్రిక్ సెన్సేషన్

Update: 2026-03-17 09:23 GMT

Hyundai Inster : భారతదేశ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తన జెండా పాతేందుకు హ్యుందాయ్ మోటార్ ఇండియా సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. ముఖ్యంగా టాటా పంచ్ ఈవీ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా, 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉండే ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని హ్యుందాయ్ సిద్ధం చేస్తోంది. ఈ కారుకు HE1i అనే కోడ్‌నేమ్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏమిటంటే, ఈ కారును భారతదేశంలోనే డిజైన్ చేసి, ఇక్కడి ఇంజనీర్ల పర్యవేక్షణలో, మన దేశ వాతావరణానికి తగ్గట్లుగా రూపొందిస్తున్నారు. ఇది 2027 నాటికి భారతీయ రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది.

ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు తయారీ హ్యుందాయ్ శ్రీపెరంబుదూర్ ప్లాంట్‌లో జరగనుంది. ఖర్చు తగ్గించి, వినియోగదారులకు తక్కువ ధరకే కారును అందించాలనే ఉద్దేశంతో హ్యుందాయ్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మన దేశానికి చెందిన ఎక్సైడ్ ఇండస్ట్రీస్తో జతకట్టి, స్థానికంగా తయారైన బ్యాటరీలను ఈ కారులో ఉపయోగించబోతోంది. దీనివల్ల కారు ధర గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. గ్లోబల్ మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఈవీ ఆధారంగా ఈ కొత్త మోడల్ రూపుదిద్దుకుంటుందని సమాచారం.

సాంకేతిక పరంగా ఈ కారు చాలా పవర్ఫుల్ గా ఉండబోతోంది. ఇది హ్యుందాయ్ అత్యాధునిక స్కేలబుల్ E-GMP ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ప్లాట్‌ఫారమ్ 800V హై-స్పీడ్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది, అంటే కేవలం కొన్ని నిమిషాల్లోనే కారు బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. గ్లోబల్ వేరియంట్లలో 42kWh, 49kWh బ్యాటరీ ఆప్షన్లు ఉండగా, భారతీయ వెర్షన్ కోసం కూడా రెండు వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌లను కంపెనీ అందించనుంది. ఇది ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే దాదాపు 300 నుండి 350 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇచ్చే అవకాశం ఉంది.

ఫీచర్ల విషయానికి వస్తే, హ్యుందాయ్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ఈ కొత్త ఈవీలో లెవల్-2 అడాస్ వంటి అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు, 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, డ్యూయల్ స్క్రీన్ సెటప్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండబోతున్నాయి. కేవలం ఈ ఒక్క కారుతోనే ఆగకుండా, 2030 నాటికి భారత్‌లో మొత్తం 26 కొత్త మోడళ్లను లాంచ్ చేయాలని హ్యుందాయ్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందులో హైబ్రిడ్ కార్లు, మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయి. ఈ పోటీ వల్ల అంతిమంగా వినియోగదారులకే మంచి ఆప్షన్లు లభించనున్నాయి.

Tags:    

Similar News