Hyundai: పండుగ సీజన్ ముంగిట వాహనదారులకు హ్యుందాయ్ మోటార్స్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ పాపులర్ ఎస్‌యూవీలైన క్రెటా, అల్కాజార్, క్రెటా ఈవీ మోడళ్లలో సరికొత్త లాంజ్ ఎడిషన్‌లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.19.21 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో లభించే ఈ కార్లు వెనుక సీటు ప్రయాణికులకు లగ్జరీ అనుభూతిని అందిస్తాయి. కొత్తగా తెచ్చిన లాంజ్ ఎడిషన్ మోడళ్లలో వెనుక సీటులో కూర్చునే వారి సౌకర్యానికి, వినోదానికి హ్యుందాయ్ అధిక ప్రాధాన్యత ఇచ్చింది. వెనుక వైపు ప్రత్యేకంగా 11.6 ఇంచుల పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్ సిస్టమ్‌ను అమర్చారు. దీని ద్వారా ప్రయాణ సమయంలో నేరుగా ఓటీటీ యాప్‌లలో సినిమాలు చూడటం, గేమ్‌లు ఆడుకోవడం, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ మిర్రరింగ్ వంటి అనేక సదుపాయాలు పొందే వీలుంది. బోస్ కంపెనీకి చెందిన 8 స్పీకర్ల ప్రీమియం ఆడియో సిస్టమ్ ప్రయాణాన్ని లగ్జరీగా మారుస్తుంది. కారు లోపల మూన్ వైట్ యాంబియంట్ లైటింగ్, కస్టమ్ హెడ్‌రెస్ట్ కుషన్లు రాజసానికీ, కంఫర్ట్‌కు కొత్త నిర్వచనాన్ని ఇస్తాయి.

హ్యుందాయ్ క్రెటా లాంజ్ ఎడిషన్ విశేషాలు

క్రెటా లాంజ్ ఎడిషన్‌ను కింగ్ ట్రిమ్ ఆధారంగా తీర్చిదిద్దారు. ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఐవీటీ, 1.5 లీటర్ డీజిల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. నూతన గోల్డెన్ బ్రాంజ్ షేడ్‌తో పాటు 18 ఇంచుల మ్యాట్ బ్లాక్ అలాయ్ వీల్స్, రూఫ్ రయల్స్, సైడ్ మిర్రర్లపై బ్లాక్ ఫినిషింగ్ కారుకు స్పోర్టీ లుక్‌ను తెచ్చిపెట్టాయి. పెట్రోల్ వేరియంట్ ధర రూ. 19.21 లక్షల నుంచి రూ. 19.36 లక్షల వరకు ఉండగా, డీజిల్ వేరియంట్ ధర రూ. 20.30 లక్షల నుంచి రూ. 20.45 లక్షల వరకు ఉంటుంది.

హ్యుందాయ్ అల్కాజార్ లాంజ్ ఎడిషన్ స్పెషాలిటీ ఇదే

సిగ్నేచర్ వేరియంట్ ప్రాతిపదికన వచ్చిన అల్కాజార్ లాంజ్ ఎడిషన్ కేవలం 1.5 లీటర్ డీజిల్ ఆటోమేటిక్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది. వెనుక ప్రయాణికులకు ధారాళమైన లెగ్ స్పేస్ కల్పించేందుకు దీనిని ప్రత్యేకంగా 5-సీటర్ లేఅవుట్‌తో రూపొందించారు. వాయిస్ కంట్రోల్డ్ స్మార్ట్ పనోరమిక్ సన్‌రూఫ్, 11.6 ఇంచుల రియర్ స్క్రీన్, డ్యూయల్ టోన్ ఆప్షన్లు దీని ప్రధాన ఆకర్షణలు. అల్కాజార్ లాంజ్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 21.80 లక్షలుగా నిర్ణయించగా, డ్యూయల్ టోన్ వేరియంట్ ధర రూ. 21.95 లక్షలుగా ఉంది.

క్రెటా ఎలక్ట్రిక్ లాంజ్ ఎడిషన్ హంగులు

ఇవి మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రియుల కోసం క్రెటా ఎలక్ట్రిక్ లాంజ్ ఎడిషన్‌ను కూడా ఎక్సలెన్స్ లాంగ్ రేంజ్ వేరియంట్‌లో తెచ్చారు. ఇందులో హోమ్ ఛార్జర్ ఆప్షన్‌తో పాటు ఫ్రంట్ డాష్‌క్యామ్, వెనుక ప్రయాణికులకు వైర్‌లెస్ ఛార్జర్, 17 ఇంచుల బ్లాక్ ఏరో అలాయ్ వీల్స్ ప్రత్యేకంగా అందించారు. క్రెటా ఈవీ లాంజ్ ఎడిషన్ సాధారణ మోడల్ ధర రూ. 24.34 లక్షల నుంచి ప్రారంభమై, హోమ్ ఛార్జర్ సదుపాయం ఉన్న టాప్ వేరియంట్ డ్యూయల్ టోన్ ధర రూ. 25.22 లక్షల వరకు ఉంటుంది.

Tags: