Hyundai : 2027 కల్లా మార్కెట్లోకి రెండు సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీలు.. అదిరిపోయే ప్లాన్ వేసిన హ్యుందాయ్
అదిరిపోయే ప్లాన్ వేసిన హ్యుందాయ్
Hyundai : భారతదేశపు ఎస్‌యూవీ మార్కెట్‌లో పట్టు సాధించడమే లక్ష్యంగా కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా ఒక భారీ విప్లవాత్మక వ్యూహాన్ని ప్రకటించింది. రాబోయే 2030 నాటికి దేశీయ మార్కెట్లో ఏకంగా 26 సరికొత్త మోడళ్లను లాంచ్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఇందులో సాంప్రదాయ ఐసీఈ (ICE-పెట్రోల్/డీజిల్) ఇంజన్లతో పాటు అధునాతన హైబ్రిడ్, చౌకైన ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయి. ఈ సుదీర్ఘ ప్రణాళికలో భాగంగా, సరిగ్గా 2027 నాటికి భారతీయ మార్కెట్లోకి రెండు సరికొత్త పవర్‌ఫుల్ మిడ్-సైజ్ ఎస్‌యూవీలను దించడానికి హ్యుందాయ్ ముహూర్తం ఖరారు చేసింది. ఇందులో ఒకటి దేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే క్రెటా కారుకు నెక్స్ట్ జనరేషన్ అప్‌డేట్ కాగా.. మరొకటి సరికొత్త డిజైన్‌తో రాబోతున్న సరికొత్త ఎస్‌యూవీ.
ఎస్‌యూవీ ప్రియుల మనసు దోచుకున్న హ్యుందాయ్ క్రెటా.. 2027 లో సరికొత్త మూడవ జనరేషన్ అవతారంలో రాబోతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన టెస్ట్ మోడల్స్ ఇండియన్ రోడ్లపై జోరుగా టెస్టింగ్ జరుపుకుంటున్నాయి. లీకైన నివేదికల ప్రకారం.. ఈ సరికొత్త 2027 క్రెటా మోడల్ ప్రస్తుత కారు కంటే చాలా పొడవుగా, వెడల్పుగా, క్యాబిన్ లోపల భారీ స్పేస్‌తో రాబోతోంది. హ్యుందాయ్ కంపెనీకి చెందిన సరికొత్త అడ్వాన్స్‌డ్ K3 ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫారమ్‌పై ఈ కారును నిర్మిస్తున్నారు. ఈ సరికొత్త మోడల్ ద్వారా హ్యుందాయ్ తన సరికొత్త ప్లియోస్ కనెక్ట్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ను భారతదేశంలో మొదటిసారిగా పరిచయం చేయనుంది.
మారుతున్న మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా, 2027 హ్యుందాయ్ క్రెటాలో ఈసారి సరికొత్త స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్‌ను కూడా జోడించబోతున్నారు. దీనివల్ల కస్టమర్లకు లగ్జరీ డ్రైవింగ్‌తో పాటు మైండ్ బ్లాకింగ్ మైలేజ్ లభిస్తుంది. అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నమ్మకమైన 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, పవర్‌ఫుల్ టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లను కూడా కంపెనీ అలాగే కొనసాగించనుంది. వీటితో పాటు అప్‌డేటెడ్ ADAS సేఫ్టీ సూట్, సరికొత్త ప్రీమియం డ్యాష్‌బోర్డ్ ట్రిమ్స్, లగ్జరీ అప్హోల్స్టరీ వంటి హంగులను ఇందులో లోడ్ చేయనున్నారు.
నెక్స్ట్ జనరేషన్ క్రెటాతో పాటు, హ్యుందాయ్ కంపెనీ ప్రస్తుతం కోడ్‌నేమ్ Bc4iతో సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీని కూడా తయారు చేస్తోంది. గ్లోబల్ మార్కెట్లో ఉన్న పాపులర్ బేయాన్ కాంపాక్ట్ క్రాస్ఓవర్ ఆధారంగా ఈ సరికొత్త మోడల్ రూపుదిద్దుకోనుంది. సైజ్ పరంగా ఇది రాబోయే నెక్స్ట్ జనరేషన్ క్రెటా కంటే కొంచెం చిన్నదిగా ఉంటూ.. మార్కెట్లో క్రెటా కారు కంటే తక్కువ ధరలోనే లభించనుంది. దీనిని నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు సామాన్యుల బడ్జెట్‌కు తగ్గట్టుగా సీఎన్‌జీ ఆప్షన్‌తో కూడా తీసుకురాబోతున్నారు.
హ్యుందాయ్ కంపెనీ కేవలం మిడ్-సైజ్ కార్లకే పరిమితం కాకుండా.. భారతదేశంలో తన అంతర్జాతీయ లగ్జరీ కార్ల బ్రాండ్ జెనెసిస్‌ను కూడా అఫీషియల్‌గా లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది మార్కెట్లోకి వస్తే మెర్సిడెస్ బెంచ్, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. రాబోయే రోజుల్లో కాలుష్య రహిత ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ, పూర్తి సాఫ్ట్‌వేర్ ఆధారిత స్మార్ట్ కార్లపై హ్యుందాయ్ గట్టిగా ఫోకస్ పెట్టనుంది. ఈ సరికొత్త ప్లాన్లతో టయోటా హైబ్రిడ్ కార్లకు, టాటా ఈవీ కార్లకు గట్టి కౌంటర్ ఇచ్చి ఇండియాలో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని హ్యుందాయ్ గట్టి ప్లాన్ వేసింది.