Hyundai: డూప్లికేట్ తాళంచెవి ఉన్నా హ్యుందాయ్ కార్లు చోరీ చేయడం అసాధ్యం.. సరికొత్త ఫీచర్ లాంచ్
సరికొత్త ఫీచర్ లాంచ్
Hyundai: కార్ యజమానులకు ఎదురయ్యే అతిపెద్ద భయం వాహనం చోరీకి గురవ్వడం. ముఖ్యంగా దొంగలు నకిలీ తాళం తయారు చేసి కారును ఎత్తుకెళ్లే ప్రమాదం ఉంటుంది. ఈ ఆందోళనకు ముగింపు పలుకుతూ హ్యుందాయ్ తమ వెన్యూ, వెన్యూ ఎన్ లైన్ కార్లలో బ్లూలింక్ రిమోట్ ఇమ్మోబిలైజర్ అనే అత్యంత సురక్షితమైన టెక్నాలజీని ప్రవేశపెట్టింది.
ఫోన్ యాప్ ద్వారా ఇంజిన్ రీ-స్టార్ట్ నిరోధం
హ్యుందాయ్ అందిస్తున్న ఈ సరికొత్త బ్లూలింక్ రిమోట్ ఇమ్మోబిలైజర్ ఫీచర్ సహాయంతో కారు యజమానులు తమ స్మార్ట్‌ఫోన్ నుంచే వాహనాన్ని నియంత్రించవచ్చు. ఒకవేళ దొంగలు ఒరిజినల్ తాళాన్ని పోలిన డూప్లికేట్ కీ తయారు చేసుకుని కారును స్టార్ట్ చేసినా, యజమాని తన ఫోన్‌లోని బ్లూలింక్ యాప్ ద్వారా రిమోట్‌గా ఇమ్మోబిలైజర్ మోడ్‌ను ఆన్ చేయవచ్చు. రక్షణ కారణాల రీత్యా కారు కదులుతున్నప్పుడు ఈ సిస్టమ్ ఇంజిన్‌ను మధ్యలో ఆపదు. కారు ఒకసారి ఆగగానే ఇంజిన్ ఆటోమేటిక్‌గా లాక్ అయిపోయి, మళ్లీ స్టార్ట్ కాకుండా నిలిచిపోతుంది.
లైవ్ లోకేషన్ ట్రాకింగ్ సదుపాయం
అనుమానం వచ్చిన వెంటనే కస్టమర్ కేర్ సెంటర్‌ను సంప్రదించే సమయం వృథా కాకుండా నేరుగా యాప్ నుంచే ఈ ఫీచర్‌ను సక్రియం చేసుకోవచ్చు. కారులో లైవ్ కనెక్టివిటీ అందుబాటులో ఉండటం వల్ల యాప్ ద్వారా వాహనం ఏ ప్రాంతంలో ఉందో ఖచ్చితమైన లోకేషన్ తెలుసుకోవడం సులువవుతుంది. ఈ ఫీచర్ వల్ల పోలీసులు లేదా రక్షణ ఏజెన్సీలు చోరీకి గురైన కారును వేగంగా గుర్తించి స్వాధీనం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.
షోరూమ్‌కు వెళ్లకుండానే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్
హ్యుందాయ్ ఈ సాంకేతికతను సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) ద్వారా వినూత్నంగా పరిచయం చేసింది. కంట్రోలర్ ఓవర్-ది-ఎయిర్ (C-OTA) సాంకేతికతతో పనిచేయడం వల్ల వాహనదారులు కార్లను సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. 2025 నవంబర్ నుంచి విక్రయించిన వెన్యూ, వెన్యూ ఎన్ లైన్ మోడళ్లకు ఈ అప్‌డేట్ నేరుగా అందుతుంది. 2026 సెప్టెంబర్ నుంచి వస్తున్న వెన్యూ HX10, వెన్యూ ఎన్ లైన్ N10 వేరియంట్లలో ఈ ఫీచర్ ప్రామాణికంగా వస్తోంది. పాత బ్లూలింక్ మోడళ్లకు కూడా దశలవారీగా ఈ అప్‌డేట్ అందించనున్నారు.
70కి పైగా కనెక్టెడ్ సెక్యూరిటీ ఫీచర్లు
హ్యుందాయ్ బ్లూలింక్ వ్యవస్థ కేవలం దొంగతనాల నిరోధానికే పరిమితం కాలేదు. ఇందులో 70కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించే ఆటో-క్రాష్ నోటిఫికేషన్, అత్యవసర ఎస్ఓఎస్ సేవలు, డిజిటల్ కీ, హ్యుందాయ్ పే వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఏఐ వాయిస్ కమాండ్లు, వివిధ ప్రాంతీయ భాషల సపోర్ట్ వల్ల వాహన చోరీలను అరికట్టడంలో ఈ సాంకేతికత మైలురాయిగా నిలవనుంది.