Car Care : కారు క్లచ్ ప్లేట్లు త్వరగా అరిగిపోతున్నాయా? ఈ సెట్టింగ్స్ మారిస్తే మీ క్లచ్ లైఫ్ డబుల్

ఈ సెట్టింగ్స్ మారిస్తే మీ క్లచ్ లైఫ్ డబుల్

Update: 2026-03-27 07:22 GMT

Car Care : కారు నడిపేటప్పుడు చాలామంది ఇంజిన్ కండిషన్, మైలేజీ లేదా బ్రేకుల గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ, కారు గుండెకాయ లాంటి క్లచ్ వ్యవస్థను మాత్రం పట్టించుకోరు. క్లచ్ సరిగ్గా లేకపోతే గేర్లు పడవు సరే కదా.. ఇంజిన్ శక్తి చక్రాలకు అందక కారు మధ్యలోనే మొరాయిస్తుంది. క్లచ్ ప్లేట్లు అరిగిపోతే వేల రూపాయల ఖర్చు తడిసి మోపెడవుతుంది. అందుకే క్లచ్ లైఫ్ పెరగాలంటే కేవలం డ్రైవింగ్ స్టైల్ మార్చుకుంటే సరిపోదు, క్లచ్ పెడల్ సెట్టింగ్స్‌లో కొన్ని చిన్న మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

క్లచ్ పెడల్ ఫ్రీ ప్లే అంటే ఏమిటి?

క్లచ్ పెడల్‌ను మనం మెల్లగా నొక్కినప్పుడు, ఏమాత్రం ఒత్తిడి లేకుండా కొంత దూరం వరకు పెడల్ కిందకు వెళ్తుంది. దీనినే ఫ్రీ ప్లే అంటారు. సాధారణంగా ఇది 10 నుండి 25 మి.మీ వరకు ఉండటం శ్రేయస్కరం. ఈ ఫ్రీ ప్లే మరీ తక్కువగా ఉంటే, మీరు పెడల్ వదిలేసినా క్లచ్ ప్లేట్లు ఇంజిన్‌తో పూర్తిగా విడిపోవు. దీనివల్ల క్లచ్ ఎప్పుడూ కొంచెం నొక్కినట్లే ఉంటుంది, ఫలితంగా ప్లేట్లు త్వరగా వేడెక్కి కాలిపోతాయి. ఒకవేళ ఫ్రీ ప్లే మరీ ఎక్కువగా ఉంటే గేర్లు మార్చేటప్పుడు కారు కుదుపులకు లోనవుతుంది.

పెడల్ హైట్ - డ్రైవింగ్ కంఫర్ట్ సీక్రెట్

చాలామంది క్లచ్ పెడల్ మరీ ఎత్తుగా ఉండాలని లేదా మరీ కిందకు ఉండాలని కోరుకుంటారు. కానీ పెడల్ హైట్ సరిగ్గా లేకపోతే అది నేరుగా గేర్ బాక్స్‌పై ప్రభావం చూపుతుంది. పెడల్ మరీ ఎత్తుగా ఉంటే క్లచ్ త్వరగా ఎంగేజ్ అయిపోయి పార్ట్స్ అరిగిపోతాయి. అదే పెడల్ మరీ కిందకు ఉంటే, మీరు క్లచ్ పూర్తిగా నొక్కినా గేర్లు సజావుగా పడవు. దీనివల్ల గేర్ పళ్ళు అరిగిపోయే ప్రమాదం ఉంది. చాలా కార్లలో క్లచ్ పెడల్ ఎత్తు 5 నుండి 7 ఇంచుల మధ్య ఉంటే గేర్ షిఫ్టింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది.

సెట్టింగ్స్ సరిగ్గా లేకపోతే వచ్చే నష్టాలు

క్లచ్ సెట్టింగ్స్ పొరపాటుగా ఉంటే మొదటగా మైలేజీ దెబ్బతింటుంది. ఇంజిన్ నుంచి వచ్చే శక్తి చక్రాలకు సరిగ్గా అందదు కాబట్టి మీరు ఎక్కువ యాక్సిలరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. దీనివల్ల క్లచ్ స్లిప్ అవ్వడం, గేర్లు మార్చేటప్పుడు ఇబ్బంది రావడం, ఇంజిన్ పై అనవసరమైన ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. వీటిని సకాలంలో గుర్తించి మెకానిక్ వద్ద సెట్ చేయించుకోకపోతే, క్లచ్ కిట్ మొత్తం మార్చాల్సి వస్తుంది. దీనికి దాదాపు రూ. 5,000 నుంచి రూ. 20,000 వరకు ఖర్చవుతుంది.

క్లచ్ లైఫ్ పెంచే మరికొన్ని చిట్కాలు

నిపుణుల అభిప్రాయం ప్రకారం, క్లచ్ లైఫ్ పెరగాలంటే కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారును గేర్‌లో ఉంచి క్లచ్ నొక్కి పట్టుకోకూడదు, వెంటనే న్యూట్రల్ చేయాలి. ఘాట్ రోడ్లు లేదా కొండ ప్రాంతాల్లో కారు వెనక్కి వెళ్లకుండా ఉండటానికి క్లచ్‌ను వాడుతుంటారు, ఇది చాలా ప్రమాదకరం. అటువంటి సమయంలో హ్యాండ్ బ్రేక్ వాడటం ఉత్తమం. అలాగే కారు వెళ్తున్నప్పుడు క్లచ్ పెడల్ మీద కాలు విశ్రాంతిగా ఉంచడం అస్సలు చేయకూడదు. ఈ చిన్న సెట్టింగ్స్ మరియు జాగ్రత్తలు మీ క్లచ్ ఆయుష్షును కనీసం 30-40 శాతం పెంచుతాయి.

Tags:    

Similar News