ICRA Report : ఇండియాలో టూ-వీలర్ల జోరు.. ఈసారి ఎలక్ట్రిక్ బండ్లదే అసలైన హోరు

ఈసారి ఎలక్ట్రిక్ బండ్లదే అసలైన హోరు

Update: 2026-05-21 12:20 GMT

ICRA Report : భారతదేశ టూ వీలర్ మార్కెట్ సరికొత్త రికార్డుల దిశగా అడుగులు వేస్తోంది. రాబోయే సరికొత్త ఆర్థిక సంవత్సరం 2027లో దేశీయ టూ-వీలర్ పరిశ్రమ 3 నుంచి 5 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేయనుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఐక్రా తన తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలో అమలులోకి వచ్చిన సరికొత్త జీఎస్టీ 2.0 సంస్కరణలు, పాత బండ్లను వదిలించుకుని కొత్త మోడళ్లు కొనాలనే కస్టమర్ల ఆసక్తి టూ-వీలర్ మార్కెట్‌కు కొండంత అండగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకుల అమ్మకాలు ఊహించని రేంజ్‌లో దూసుకుపోతుండటం ఈ వృద్ధికి ప్రధాన ఇంజన్‌గా మారింది.

ఏప్రిల్‌లోనే 19 లక్షల బండ్లు అవుట్

ఇటీవలే విడుదలైన ఏప్రిల్ 2026 గణాంకాలు భారత టూ-వీలర్ మార్కెట్ పవర్ ఏంటో నిరూపించాయి. కేవలం ఒక్క నెలలోనే దేశీయ హోల్‌సేల్ అమ్మకాలు ఏకంగా 29.2 శాతం వృద్ధితో 19 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల వాహనాల ధరలు సాధారణ కస్టమర్లకు సైతం అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారు పాత వాహనాల స్థానంలో సరికొత్త మోడళ్లను కొనుగోలు చేయడానికి భారీగా ఆసక్తి చూపిస్తున్నారు.

ఏకంగా 68 శాతం గ్రోత్‌తో రికార్డు

పెట్రోల్ రేట్లకు భయపడి జనాలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు పరుగులు పెడుతున్నారు. ఏప్రిల్ 2026 లో దేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ల రిటైల్ అమ్మకాలు ఏకంగా 1,54,337 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇది నమ్మశక్యం కాని విధంగా 68.1 శాతం వృద్ధి. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈవీ సెగ్మెంట్ 21.9 శాతం వృద్ధిని చూడగా.. ఇప్పుడు మొత్తం టూ-వీలర్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ మోడళ్ల వాటా ఏకంగా 8.1 శాతానికి ఎగబాకింది. ఓలా, ఏథర్, టీవీఎస్, బజాజ్ వంటి కంపెనీల క్రేజీ మోడళ్లకు మార్కెట్లో డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది.

ఆనందాల మధ్యలో కొన్ని టెన్షన్లు.. ఐక్రా హెచ్చరికలు ఇవే

మార్కెట్ బాగానే ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చని ఐక్రా తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ఒకవేళ రుతుపవనాలు బలహీనపడితే, అది గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆదాయాన్ని గట్టిగా దెబ్బతీసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియాలో బైకుల అమ్మకాల్లో సగానికి పైగా విక్రయాలు పల్లెటూళ్ల నుండే జరుగుతాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరలు పెరగడం, ఇంధన ధరల హెచ్చుతగ్గులు మార్కెట్ వేగానికి రాబోయే నెలల్లో కాస్త బ్రేకులు వేసే ప్రమాదం లేకపోలేదు.

Tags:    

Similar News