Two Wheeler Sales : షోరూమ్‌ల ముందు క్యూలు..రిజిస్ట్రేషన్ల మోత..2 కోట్ల పైగా బైకులు, స్కూటర్ల విక్రయం
2 కోట్ల పైగా బైకులు, స్కూటర్ల విక్రయం
Two Wheeler Sales : 2025లో భారత ఆటోమొబైల్ రంగం సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం కార్లు మాత్రమే కాదు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా మునుపెన్నడూ లేని రీతిలో దూసుకెళ్లాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా టూ-వీలర్ రిజిస్ట్రేషన్ల సంఖ్య 2 కోట్ల (20 మిలియన్లు) మార్కును దాటి రికార్డు నమోదు చేసింది. వాహన్ పోర్టల్ గణాంకాల ప్రకారం.. డిసెంబర్ చివరి నాటికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
జీఎస్టీ 2.0 మ్యాజిక్
ఈ ఏడాది ద్వితీయార్థంలో అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలు ద్విచక్ర వాహన రంగానికి పెద్ద బూస్ట్‌ను ఇచ్చాయి. అంతకుముందు అన్ని రకాల బైకులపై 28% జీఎస్టీ ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం.. 350cc లోపు ఇంజిన్ సామర్థ్యం ఉన్న స్కూటర్లు, బైకులపై పన్నును 18 శాతానికి తగ్గించారు. దీనివల్ల మధ్యతరగతి ప్రజలు కొనే దాదాపు 90% మోడళ్ల ధరలు భారీగా తగ్గాయి. ఈ నిర్ణయం పండుగ సీజన్‌లో అమ్మకాలు వెల్లువెత్తేలా చేసింది. అయితే, 350cc కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ప్రీమియం బైకులపై మాత్రం పన్ను 40 శాతానికి పెరిగింది.
గ్రామీణ ప్రాంతాలే అసలైన గ్రోత్ ఇంజిన్
ఈ రికార్డు అమ్మకాల వెనుక అసలైన హీరో గ్రామీణ ప్రాంతాలేనని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ ఏడాది మంచి వర్షాలు కురవడం, పంట దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో రైతుల ఆదాయం పెరిగింది. ఫలితంగా పట్టణ ప్రాంతాల కంటే గ్రామాల్లోనే బైకులు, స్కూటర్ల అమ్మకాలు రెండింతల వేగంతో పెరిగాయి. ప్రభుత్వ మౌలిక సదుపాయాల కల్పన కూడా గ్రామాల్లో వాహనాలకు డిమాండ్ పెంచేలా చేసింది.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
నవంబర్ 29 నాటి డేటా ప్రకారం.. దేశంలో 20.2 మిలియన్ల టూ-వీలర్ల రిజిస్ట్రేషన్ పూర్తయింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది సుమారు 7 శాతం వృద్ధి. ముఖ్యంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగిన పండుగ సీజన్ అమ్మకాలు ఆల్-టైమ్ రికార్డులను తిరగరాశాయి. ఎలక్ట్రిక్ వాహనాల పట్ల కూడా వినియోగదారులు ఆసక్తి కనబరచడం విశేషం. మొత్తం మీద పన్ను తగ్గింపులు, గ్రామీణ ఆర్థికాభివృద్ధి కలిసి 2025ని ద్విచక్ర వాహన రంగానికి ఒక గోల్డెన్ ఇయర్‌గా మార్చేశాయి.