Indian Auto Sales : భారత ఆటో చరిత్రలోనే అత్యధిక సప్లై నమోదు.. రికార్డులు బద్దలు కొట్టిన కార్ సేల్స్
రికార్డులు బద్దలు కొట్టిన కార్ సేల్స్
Indian Auto Sales : భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమకు అక్టోబర్ 2025 చాలా ప్రత్యేకమైన నెలగా నిలిచింది. ప్యాసింజర్ వాహనాలు, టూ వీలర్లు, త్రీ వీలర్లు.. ఈ మూడు విభాగాలలో కూడా అత్యధిక అమ్మకాలు, రికార్డు స్థాయి సప్లై కనిపించింది. ముఖ్యంగా ఇటీవల జీఎస్‌టీ రేట్లలో తగ్గింపు, దీపావళి-నవరాత్రి వంటి పండుగల కారణంగా డిమాండ్ భారీగా పెరిగింది. ఈ రికార్డు అమ్మకాల వివరాలను చూద్దాం.
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ గణాంకాల ప్రకారం, ప్యాసింజర్ వెహికల్ విభాగంలో అక్టోబర్‌లో అమ్మకాలు అత్యద్భుతంగా పెరిగాయి. ఈ విభాగంలో అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 17 శాతం పెరిగాయి. ఈ నెలలో మొత్తం 4,60,739 యూనిట్ల హోల్‌సేల్ అమ్మకాలు నమోదయ్యాయి. గత సంవత్సరం ఇదే నెలలో ఈ సంఖ్య 3,93,238 యూనిట్లుగా ఉంది.
ముఖ్యంగా ఎస్‌యూవీ కార్ల పట్ల వినియోగదారుల ఆసక్తి పెరగడం, కొత్త మోడల్స్ మార్కెట్‌లోకి రావడం ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణం. టూ వీలర్ మార్కెట్‌లో కూడా అక్టోబర్‌లో సానుకూల వృద్ధి కనిపించింది. కంపెనీలు డీలర్లకు 22,10,727 యూనిట్లను సప్లై చేశాయి. ఇది గతంతో పోలిస్తే 2 శాతం ఎక్కువ. ఈ సారి స్కూటర్ల అమ్మకాలు భారీగా పెరిగి, 8,24,003 యూనిట్ల విక్రయాలతో ఏకంగా 14 శాతం బలమైన వృద్ధిని సాధించాయి. పట్టణ ప్రాంతాల్లో స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోందని ఇది స్పష్టం చేస్తోంది. అయితే మోటార్‌సైకిల్స్ విభాగం మాత్రం కొద్దిగా వెనుకబడి, అమ్మకాలు 4 శాతం తగ్గి 13,35,468 యూనిట్లుగా నమోదయ్యాయి.
ఆటో-రిక్షాలు, ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ విభాగం కూడా అక్టోబర్‌లో 6 శాతం వృద్ధిని నమోదు చేసి, 81,288 యూనిట్లకు చేరుకుంది.SIAM డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ మాట్లాడుతూ.. "అక్టోబర్‌లో వాహనాల సప్లై భారత ఆటో పరిశ్రమ చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకుంది. భారీ పండుగ డిమాండ్‌తో పాటు, ప్రభుత్వం జీఎస్‌టీ రేట్లను తగ్గించడం వల్ల కార్ల ధరలు తగ్గడం వినియోగదారులను కొనుగోలుకు ప్రేరేపించింది. ఈ రెండు కారణాలే రికార్డు వృద్ధికి దారితీశాయి" అని తెలిపారు.