Bajaj Pulsar : వెనిజులా వీధుల్లో మన పల్సర్ రచ్చ..యుద్ధం జరుగుతున్నా తగ్గని క్రేజ్

యుద్ధం జరుగుతున్నా తగ్గని క్రేజ్

Update: 2026-01-06 07:22 GMT

Bajaj Pulsar : వెనిజులాలో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం తారస్థాయికి చేరింది. అమెరికా సైనిక దాడుల తర్వాత అక్కడి అధ్యక్షుడు మదురోను అరెస్ట్ చేయడం, డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో ఆ దేశ భవిష్యత్తు అంధకారంలో పడింది. అయితే ఈ యుద్ధ వాతావరణం నడుమ ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. వెనిజులా వీధుల్లో మన దేశానికి చెందిన బజాజ్ పల్సర్, బాక్సర్ బైక్‌లు రయ్‌రయ్‌మంటూ తిరుగుతున్నాయి. అక్కడ భారతీయ వాహనాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

వెనిజులాలో అమెరికా సైన్యం అడుగుపెట్టిన తర్వాత ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. నిత్యావసరాల కోసం ఆ దేశం ఇతర దేశాల దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ దిగుమతుల్లో భారతదేశం కూడా ఒక ముఖ్య భాగస్వామి. ముఖ్యంగా బజాజ్ ఆటో తయారు చేసే పల్సర్, బాక్సర్ బైక్‌లు వెనిజులా యువతకు హాట్ ఫేవరెట్. అక్కడ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సరిగ్గా లేకపోవడంతో సొంత వాహనాల కోసం జనం ఎగబడుతున్నారు. అయితే, అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాల వల్ల కంపెనీకి పెద్దగా నష్టం లేదని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ స్పష్టం చేశారు. కంపెనీ మొత్తం ఎగుమతుల్లో వెనిజులా వాటా కేవలం 1 శాతం లోపే ఉండటమే దీనికి కారణం.

వెనిజులాలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, బజాజ్ ఆటో ప్రపంచవ్యాప్తంగా తన ఎగుమతుల్లో దూసుకుపోతోంది. ఆర్థిక సంవత్సరం 2026 (ఏప్రిల్ - డిసెంబర్) కాలంలో బజాజ్ ఏకంగా 16,39,971 యూనిట్లను విదేశాలకు పంపింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 19 శాతం వృద్ధి. వెనిజులాలో ఒకప్పుడు జనరల్ మోటార్స్, ఫోర్డ్ వంటి దిగ్గజ కంపెనీలు ఉండేవి, కానీ ఆర్థిక సంక్షోభం కారణంగా అవి మూతపడ్డాయి. ఇప్పుడు ఆ ఖాళీని చైనా కంపెనీలతో పాటు మన బజాజ్ భర్తీ చేస్తోంది. తక్కువ మెయింటెనెన్స్, ఎక్కువ మైలేజ్ ఇచ్చే భారతీయ బైక్‌లంటే అక్కడి వారికి ప్రాణం.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌కు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా షరతులకు లొంగకపోతే, మదురో కంటే ఘోరమైన శిక్ష తప్పదని హెచ్చరించారు. ఒకవేళ అమెరికాకు సహకరిస్తే సైన్యాన్ని వెనక్కి తీసుకుంటామని కూడా క్లూ ఇచ్చారు. ఈ అంతర్జాతీయ రాజకీయ పోరాటం ఎలా ఉన్నా, అక్కడ సామాన్యుడికి మాత్రం మన ఊరి పల్సర్ బైకే కొండంత అండగా నిలుస్తోంది. వెనిజులా ఆటోమొబైల్ రంగం ప్రస్తుతం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడి నడుస్తోంది.

Tags:    

Similar News