Best Selling Cars : మారుతి సుజుకి కోటలో పంచ్..40ఏళ్ల రికార్డ్ బ్రేక్..టాప్ 10 కార్ల లిస్టులో పెను మార్పులు

40ఏళ్ల రికార్డ్ బ్రేక్..టాప్ 10 కార్ల లిస్టులో పెను మార్పులు

Update: 2025-12-26 13:28 GMT

Best Selling Cars : భారతీయ ఆటోమొబైల్ రంగంలో దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యం వహించిన మారుతి సుజుకి కోటకు బీటలు వారుతున్నాయి. ఒకప్పుడు టాప్-10 కార్ల లిస్టు తీస్తే అందులో 8 మారుతి కార్లే ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్ వంటి కంపెనీలు ఎస్‌యూవీల జోరుతో మారుతిని వెనక్కి నెడుతున్నాయి. ముఖ్యంగా టాటా పంచ్ సృష్టించిన ప్రభంజనం భారత కార్ల చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

భారత ఆటో మార్కెట్లో ఎప్పుడూ లేని విధంగా ఒక పెను మార్పు చోటుచేసుకుంది. 2024లో టాటా పంచ్ అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచి, మారుతి సుజుకికి చెందిన 40 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టింది. మారుతి లోగో లేని కారు ఇండియాలో నంబర్ వన్ స్థానానికి రావడం గత నాలుగు దశాబ్దాల్లో ఇదే మొదటిసారి. 2025 నవంబర్ నాటికి మారుతి సుజుకి టాప్-10లో కేవలం 6 మోడళ్లకు పడిపోయింది. గతంలో ఇది 8గా ఉండేది.

ప్రస్తుతం భారతీయ కస్టమర్లు హ్యాచ్‌బ్యాక్ కార్ల కంటే ఎస్‌యూవీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. హ్యుందాయ్ క్రెటా, టాటా నెక్సాన్, టాటా పంచ్ వంటి మోడళ్లు అమ్మకాల్లో దూసుకుపోతున్నాయి. 2025లో టాటా నెక్సాన్, హ్యుందాయ్ క్రెటా చెరో 2 లక్షల యూనిట్ల అమ్మకాల మార్కును అందుకునే దిశగా సాగుతున్నాయి. మారుతికి గట్టి పోటీ ఇస్తూ మహీంద్రా నుంచి స్కార్పియో కూడా టాప్-10 లిస్టులో తన స్థానాన్ని పదిలం చేసుకుంది.

ఎస్‌యూవీల జోరు ఇంత ఉన్నా, సెడాన్ విభాగంలో మారుతి డిజైర్ మాత్రం తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా సీఎన్జీ వేరియంట్ అందుబాటులో ఉండటం, మైలేజీ ఎక్కువగా రావడం వల్ల మధ్యతరగతి ప్రజలు ఇంకా డిజైర్‌ను నమ్ముతున్నారు. 2025 చివరకి డిజైర్ సుమారు 2.15 లక్షల యూనిట్ల అమ్మకాలతో ఇండియాలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచే అవకాశం ఉందని అంచనా.

ముందు ముందు ఈ పోటీ ఇంకా తీవ్రం కానుంది. టాటా తన కొత్త మోడల్ సియెర్రా లాంచ్ రోజే 70 వేల బుకింగ్స్ సాధించి రికార్డు సృష్టించింది. హ్యుందాయ్ వేన్యూ కి 46 వేల ఆర్డర్లు వచ్చాయి. మహీంద్రా తన స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్‌ను 2026లో తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇవన్నీ చూస్తుంటే మారుతి సుజుకి తన నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి తన వ్యాపార శైలిని పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

Tags:    

Similar News