Maruti Flex-Fuel Car: మారుతి సుజుకి సరికొత్త విప్లవం.. దేశంలోనే తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు విడుదల

దేశంలోనే తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు విడుదల

Update: 2026-06-04 08:49 GMT

Maruti Flex-Fuel Car: భారతదేశ ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవానికి తెర లేచింది. దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి గురువారం నాడు దేశంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును అధికారికంగా ఆవిష్కరించింది. తన పాపులర్ మోడల్ అయిన వ్యాగన్ ఆర్ కారును ఈ సరికొత్త టెక్నాలజీతో రూపొందించింది. ఈ కారు లాంచింగ్ ద్వారా దేశంలో ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించడంతో పాటు, కాలుష్యాన్ని భారీగా అరికట్టవచ్చని కంపెనీ చెబుతోంది. భారత క్లీన్ ఎనర్జీ కార్ల మార్కెట్లో ఇప్పటికే 50 శాతానికి పైగా వాటాతో టాప్‌లో ఉన్న మారుతి సుజుకి, తాజా లాంచ్‌తో తన పట్టును మరింత బలోపేతం చేసుకుంది.

కేంద్ర మంత్రుల సమక్షంలో ఘనంగా లాంచ్

ఈ చారిత్రాత్మక లాంచింగ్ ఈవెంట్‌లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరి ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారుతి సుజుకి ఎండీ, సీఈఓ హిసాషి తాకేవుచి మాట్లాడుతూ.. ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ వ్యాగన్ ఆర్ కేవలం ఒక కొత్త కారు మాత్రమే కాదని, భారత ఇంధన రంగంలో సరికొత్త అధ్యాయానికి నాంది అని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయమైన ఆత్మనిర్భర్ భారత్ వైపు తాము వేసిన బలమైన అడుగు ఇదని ఆయన స్పష్టం చేశారు.

ఎథనాల్ ఇంధనానికి తగ్గట్టుగా ఇంజన్ మార్పులు

సాధారణ పెట్రోల్ కార్లతో పోలిస్తే ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు ఇంజన్ టెక్నాలజీ చాలా భిన్నంగా ఉంటుంది. ఈ కారును E85 ఇంధనంతో నడిపించేందుకు వీలుగా దీని ఇంజన్, ఫ్యూయల్ సిస్టమ్, ఇతర కీలక భాగాలలో పెద్ద ఎత్తున సాంకేతిక మార్పులు చేశారు. E85 అంటే ఈ ఇంధనంలో 85 శాతం ఎథనాల్, కేవలం 15 శాతం మాత్రమే పెట్రోల్ మిశ్రమం ఉంటుంది. భవిష్యత్తులో పెట్రోల్‌లో ఎథనాల్ శాతాన్ని మరింత పెంచాలనే భారత ప్రభుత్వ ప్రణాళికలకు అనుగుణంగా మారుతి సుజుకి ఈ నెక్స్ట్ జనరేషన్ ఇంజన్‌ను సిద్ధం చేసింది.

లుక్ పాతదే.. పేరు కొత్తది

డిజైన్ విషయానికి వస్తే, ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ వ్యాగన్ ఆర్ చూడటానికి ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న సాధారణ మోడల్ లాగే ఉంటుంది. కారు బాహ్య రూపంలో కానీ, లోపలి కేబిన్ రూపురేఖల్లో కానీ ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే ఇది ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు అని గుర్తించడం కోసం కారు వెనుక భాగంలో BioFlex అనే కొత్త బ్యాడ్జింగ్‌ను అందించారు. అలాగే కారు బాడీపై సరికొత్త గ్రాఫిక్స్ స్టిక్కర్లను అంటించారు. టూ వీలర్ సెగ్మెంట్‌లో ఇప్పటికే హీరో మోటోకార్ప్, సుజుకి వంటి కంపెనీలు ఫ్లెక్స్-ఫ్యూయల్ బైకులను ప్రదర్శించినప్పటికీ, కార్ల విభాగంలో మాత్రం ఈ ఘనత సాధించిన మొదటి బ్రాండ్‌గా మారుతి సుజుకి నిలిచింది.

Tags:    

Similar News