January 2026 Car Launches:కారు కొనాలంటే ఇప్పుడే ఆగండి..జనవరిలో కార్ల సునామీ..రోడ్లపై మహీంద్రా, కియా యుద్ధం
జనవరిలో కార్ల సునామీ..రోడ్లపై మహీంద్రా, కియా యుద్ధం
January 2026 Car Launches: కొత్త ఏడాది 2026 జనవరి నెల కార్ల ప్రేమికులకు పండగ తీసుకురాబోతోంది. భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో కియా, మహీంద్రా, టాటా మోటార్స్, రెనాల్ట్ వంటి అగ్రగామి సంస్థలు తమ సరికొత్త మోడళ్లను, ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఎలక్ట్రిక్ వాహనాల నుంచి పవర్‌ఫుల్ ఎస్‌యూవీల వరకు జనవరి నెలలో రోడ్లపైకి రానున్న ఆ క్రేజీ కార్ల వివరాలు మీకోసం..
కియా సెల్టోస్
కియా తన అత్యంత ప్రజాదరణ పొందిన సెల్టోస్ మోడల్‌లో సెకండ్ జనరేషన్ వెర్షన్‌ను తీసుకురాబోతోంది. కొత్త K3 ప్లాట్‌ఫారమ్‌పై రూపొందిన ఈ కారు మునుపటి కంటే 95 మిమీ పొడవు, 30 మిమీ వెడల్పు పెరిగింది. దీనివల్ల లోపల స్పేస్ మరింత ఎక్కువగా ఉంటుంది. జనవరి 2న దీని ధరలను ప్రకటించనుండగా, కేవలం రూ.25,000 టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో ఇది మళ్ళీ మార్కెట్ను ఏలబోతోంది.
మహీంద్రా XUV 7XO
మహీంద్రా XUV700 ఇప్పుడు సరికొత్త హంగులతో XUV 7XOగా అవతారమెత్తబోతోంది. జనవరి 5న లాంచ్ కానున్న ఈ ఎస్‌యూవీలో మూడు 12.3 అంగుళాల స్క్రీన్ల డాష్‌బోర్డ్ సెటప్ ప్రధాన ఆకర్షణ. మసాజ్ ఫంక్షన్ ఉన్న సీట్లు, 16 స్పీకర్ల ప్రీమియం సౌండ్ సిస్టమ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పాత ఇంజిన్లనే కొనసాగిస్తూనే, డిజైన్ పరంగా దీనిని మరింత షార్ప్‌గా తీర్చిదిద్దారు.
రెనాల్ట్ డస్టర్
ఒకప్పుడు ఇండియాలో ఎస్‌యూవీ ట్రెండ్ సృష్టించిన డస్టర్, సరికొత్త రూపంలో జనవరి 26న (రిపబ్లిక్ డే) సందడి చేయనుంది. CMF-B ప్లాట్‌ఫారమ్‌పై తయారైన ఈ కొత్త డస్టర్‌లో 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండబోతోంది. ఇది 154 bhp పవర్‌ను ఇస్తుంది. అంతర్జాతీయ మోడల్‌కు దగ్గరగా ఉంటూనే, ఇండియన్ కస్టమర్ల కోసం ప్రత్యేక మార్పులతో ఈ కారు రాబోతోంది. హైబ్రిడ్ వెర్షన్ కూడా వచ్చే అవకాశం ఉండటంతో మైలేజీ ప్రియులు దీనికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ & స్కోడా కుషాక్
మైక్రో ఎస్‌యూవీ పంచ్ లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను జనవరిలో లాంచ్ చేయనుంది. ఇందులో పంచ్ ఈవీ తరహాలో సరికొత్త స్టీరింగ్ వీల్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉండబోతున్నాయి. మరోవైపు స్కోడా కుషాక్ కూడా ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్‌తో రాబోతోంది. పనోరమిక్ సన్ రూఫ్, 360 డిగ్రీల కెమెరా, లెవల్-2 ADAS వంటి భద్రతా ఫీచర్లతో కుషాక్ మరింత పటిష్టంగా మారనుంది.
నిస్సాన్ గ్రేవిటే
కొత్త ఫ్యామిలీ ఎంపీవీ నిస్సాన్ సంస్థ రెనాల్ట్ ట్రైబర్ ఆధారంగా గ్రేవిటే అనే 7-సీటర్ ఎంపీవీని జనవరిలో పరిచయం చేయనుంది. మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరలో మంచి స్పేస్ ఇచ్చేలా దీనిని రూపొందించారు. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు, చిన్న కుటుంబాల లాంగ్ జర్నీలకు పక్కాగా సరిపోతుంది. మార్చిలో దీని ధరల ప్రకటన ఉండనుంది.