Car Sales : చరిత్రను తిరగరాసిన జనవరి సేల్స్..కార్ల అమ్మకాల్లో తిరుగులేని భారత్
కార్ల అమ్మకాల్లో తిరుగులేని భారత్
Car Sales : 2026 జనవరి నెలలో భారతీయ కార్ల మార్కెట్ కొత్త రికార్డులను సృష్టించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే అమ్మకాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా టాటా మోటార్స్ తన సత్తా చాటుతూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. వినియోగదారులు సెడాన్ల కంటే ఎస్‌యూవీలకే ప్రాధాన్యత ఇస్తుండటంతో ఈ విభాగంలోని కార్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. టాటా నెక్సాన్, టాటా పంచ్ వంటి మోడళ్లు అమ్మకాల్లో సరికొత్త రికార్డులను నమోదు చేశాయి.
అగ్రస్థానంలో టాటా నెక్సాన్
జనవరి 2026లో అత్యధికంగా అమ్ముడైన కారుగా టాటా నెక్సాన్ నిలిచింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉండటం దీనికి కలిసి వచ్చింది. ఈ నెలలో ఏకంగా 23,365 యూనిట్లు విక్రయించబడ్డాయి. ఇది గతేడాది కంటే 51.75 శాతం ఎక్కువ. నెక్సాన్ యొక్క సేఫ్టీ ఫీచర్లు మరియు మోడ్రన్ డిజైన్ దీనిని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాయి.
రికార్డులు బద్దలు కొట్టిన టాటా పంచ్
టాటా నుంచి వచ్చిన మరో చిన్న ఎస్‌యూవీ టాటా పంచ్ తన సొంత రికార్డులను తానే తిరగరాస్తోంది. జనవరిలో 19,257 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. నగరాలతో పాటు పల్లెల్లో కూడా ఈ కారుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తక్కువ ధరలో ఎస్‌యూవీ అనుభూతిని ఇస్తుండటంతో సామాన్యులు కూడా పంచ్ వైపు మొగ్గు చూపుతున్నారు.
హ్యుందాయ్ క్రెటా, మారుతి బ్రెజ్జా
మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా 17,921 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో నిలిచింది. క్రెటా ఈవీ లాంచ్ కూడా దీనికి అదనపు బలాన్ని ఇచ్చింది. ఇక నాలుగో స్థానంలో మారుతి బ్రెజ్జా 17,486 యూనిట్లతో నిలిచింది. మారుతి నమ్మకం, మెయింటెనెన్స్ తక్కువ కావడంతో బ్రెజ్జా తన పట్టును నిలుపుకుంది. ఐదో స్థానంలో ఉన్న మహింద్రా స్కార్పియో (Scorpio + Scorpio-N) 15,542 యూనిట్ల అమ్మకాలతో తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది.
కొత్త రికార్డుతో మారుతి విక్టోరిస్
ఈ జాబితాలో అత్యంత ఆసక్తికరమైన అంశం మారుతి నుంచి వచ్చిన కొత్త మోడల్ మారుతి విక్టోరిస్. లాంచ్ అయిన మొదటి పూర్తి నెలలోనే 15,240 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి ఆరో స్థానానికి చేరుకుంది. మారుతి ఫ్రాంక్స్ (13,353 యూనిట్లు), హ్యుందాయ్ వెన్యూ (12,413 యూనిట్లు) వరుసగా ఏడు, ఎనిమిదో స్థానాల్లో ఉన్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో బోలెరో హవా.. కియా సోనెట్ మెరుపులు
మహింద్రా బోలెరో గ్రామీణ ప్రాంతాల్లో తన హవాను కొనసాగిస్తూ 11,841 యూనిట్ల అమ్మకాలను జరిపింది. గతేడాదితో పోలిస్తే దీని అమ్మకాలు 36.39 శాతం పెరగడం విశేషం. ఇక టాప్-10లో చివరి స్థానంలో ఉన్న కియా సోనెట్ వృద్ధి విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏకంగా 52.88 శాతం వృద్ధితో 10,998 యూనిట్లను విక్రయించి మెగా ఈవెంట్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది.
మొత్తానికి 2026 ప్రారంభం ఆటోమొబైల్ రంగానికి ఎంతో ఆశాజనకంగా ఉంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఈ ఏడాది భారత ఆటో మార్కెట్ ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది.